కాలేజీలుగా 119 బీసీ గురుకులాలు
దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించాం.
ఈ నెల 22వ తేదీ తుది గడువుకాగా, జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నాం.
వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభం
మొత్తం 138 కాలేజీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్
21,680 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి
(హైదరాబాద్:విజయం న్యూస్):-
హైదరాబాద్: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. 119 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. గతంలో ఉన్న 19 బీసీ గురుకులాలతో కలిపి మొత్తం 138 రెసిడెన్షియల్ కాలేజీల్లో ప్రవేశాలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బీసీల సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మహాత్మాజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విడతలవారీగా బీసీ గురుకులాల సంఖ్యను పెంచగా, ప్రస్తుతం 261 బీసీ గురుకులాలు అందుబాటులో ఉన్నాయి. తొలిసారిగా 2017-18లో 119 గురుకులాలను ఏర్పాటు చేశారు. తొలి ఏడాది ఆ గురుకులాల్లో 5, 6, 7 తరగుతుల్లో విద్యార్థులకు ప్రవేశాలను కల్పించారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతిని పెంచుకుంటూ వస్తుండగా, 2020-21 నాటికి పదో తరగతి వరకు విద్య అందించే స్థాయికి చేరుకొన్నాయి.
also read;-ఓటమి పాపమెవరిది?
ఈ నేపథ్యంలో ఆ 119 గురుకుల పాఠశాలల్లో ఇంటర్ విద్యను అందించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఆ గురుకులాలను రెసిడెన్షియల్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 19 బీసీ గురుకుల కాలేజీల ద్వారా 6,080మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నది. తాజాగా అందుబాటులోకి రానున్న 119 గురుకుల కళాశాలలతో మరో 15,600 మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. మొత్తంగా 138 గురుకులాల ద్వారా 21,680 మంది బీసీ విద్యార్థులకు ఉచిత విద్య అందనున్నది.
also read;-తుమ్మలది టీఆర్ఎస్ రెబల్ కాదు..టీఆర్ఎస్సే
కొత్త కోర్సులు కూడా..
కొత్త కోర్సులను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్‌లో కొత్తగా అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టింది.
బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుతం ఉన్న 19 బీసీ గురుకుల కళాశాలలతోపాటు ఈ ఏడాది నుంచి అదనంగా 119 కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. మొత్తంగా 138 కాలేజీల ద్వారా బీసీ విద్యార్థులకు ఇంటర్ విద్యను అందించనున్నాం. బీసీ గురుకుల కళాశాలల్లో కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టాం. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించాం. ఈ నెల 22వ తేదీ తుది గడువుకాగా, జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నాం.
– బుర్రా వెంకటేశం, ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ