Telugu News

పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి

మాజీ ఎంపీని కాంగ్రెస్ కు ఆహ్వానించిన సీఎల్పీనేత భట్టి

0
పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి
== మాజీ ఎంపీని కాంగ్రెస్ కు ఆహ్వానించిన సీఎల్పీనేత భట్టి
== కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుంటుందన్న భట్టి
== బీఆర్ఎస్ సభలో కనిపించని బిజెపి వ్యతిరేక ఎజెండా

== బిజెపిని కట్టడి చేయడం కాంగ్రెస్ తో నే సాధ్యం
== వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి పయనించాలి
== పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నా
== ఖమ్మం మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని, ఆయన్ను  మనస్పూర్తిగా  ఆహ్వానిస్తున్నామని, ఆయన్ను కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు.  అవకాశవాద రాజకీయాలు చేస్తూ, ప్రజలను మాటలతో నిలువున మోసం చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చరమగీతం పాడాలంటే, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. దేశ సంస్కృతిని, సంపదని, స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి తయారు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థలను దహించి వేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎజెండా ఇస్తామని జరిగిన ప్రచార ఆర్భాటానికి తగ్గట్టుగా ఖమ్మం బిఆర్ఎస్ సభలో ఈ దేశానికి, కనీసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పనికొచ్చేటువంటి ఎజెండా కూడా కనిపించలేదని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
గురువారం ఖమ్మం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏరాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొచ్చి ఆర్భాటంగా నిర్వహించిన సభలో దేశానికి దశ, దిశ ఇచ్చే ఎజెండా లేకపోవడంతో పాటు ప్రజలు ఆశీంచినవి కూడ  ప్రకటించకపోవడం విచారకరమన్నారు. బిజెపిని కట్టడి చేయడం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. జాతులు, కులాలు, ప్రాంతాలు, మతాల పేరిట ప్రజలను విభజించి,
విద్వేషాలను రెచ్చగొట్టి, ఘర్షణలు సృష్టించి, రక్తపాతంతో రాజాకీయలబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి నేడు దేశానికి పెనుసవాల్ గా మారిందని అందోలన వ్యక్తం చేశారు. దేశానికి పెను సవాల్ గా మారిన బిజెపిని కట్టడి చేయడం జాతీయ స్థాయిలో బలమైన పుణాదులు కలిగి ఉండి, లౌకికతత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుందన్నారు. బిజెపిని కట్టడి చేయడం కాంగ్రెస్ తోనే సాధ్యమయ్యే అవకాశం ఉన్నందున దేశ ప్రయోజనాల దృష్టా  వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తే బావుంటుందని  విజ్ఞపి చేశారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి రావాలని మీడియా సాక్షిగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ లోకి రావడానికి తాను అడ్డుగాలేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు భట్టి  సమాధానం ఇచ్చారు.
== ప్రజాసమస్యల ఊసే లేని బిఆర్ఎస్ సభ
ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో గిరిజనలు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్య పరిష్కారం గురించి బిఆర్ఎస్ సభలో ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు యూనివర్శిటి ఉందని, కానీ ఖమ్మం ఉమ్మడి జిల్లాకు యూనివర్శీటి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. యూనివర్శిటి ప్రకటన చేయాలని కోరినప్పటికి సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం తగదన్నారు.
పేదల ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్ల గురించి సభలో ఊసే ఎత్తలేదన్నారు. విభజన చట్టం హక్కుగా పొందిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై కేంద్రంతో పోరాటం చేయాలని కోరినప్పటికీ దీని గురించి మాట్లాడనే లేదన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటీకరణ చేస్తున్న బిజెపి చర్యలకు ఏలా అడ్డుకట్ట వేస్తారో సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆనేక సమస్యల గురించి కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి వినతి పత్రం ఇచ్చానని చెపారు. వాటిని పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
== కాంగ్రెస్ తోనే  దేశాభివృద్ది
దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ హాయంలో ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యవస్థలు, ప్రణాళికలు,  ప్రజాస్వామ్య బలోపేతానికి వేసిన పుణాదులు, మిశ్రమ ఆర్ధిక విధానాలు తీసుకొచ్చి దేశం పురోగమనం సాధించేందుకు కాంగ్రెస్ చేసిన కృషి ఫలితమేనని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఆనేక సంస్థలకు అధిపతులై దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారంటే దేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకొచ్చిన స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధి గొప్పతనమే అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి హరిత విప్లవం, పాడిని అభివృద్ధి చేసి శ్వేత విప్లవం, నీలి విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణల అమలు, గరిభీ హఠావో నినాదం, ప్రభుత్వ విద్య సంస్థల్లో చదువుకున్న పేదలకు, సామాన్యులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, ఇతర సర్వీసు రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలబడటానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన అభివృద్ది పథకాలు కారణమన్నారు.
== ఈ నెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర
సాధించుకున్న లౌకిక వ్యవస్థను, సామ్యవాద విధానాలకు ఇబ్బంది పెడుతున్న బిజెపిని దూరం పెట్టడానికి రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30న శ్రీనగర్ ముగుస్తున్నందన పెద్ద సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామిక వాదులు, లౌకిక వాదులు కాంగ్రెస్ చేసే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర మొదలవుతుందన్నారు.

బ్లాక్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు రెండు నెలల పాటు నిర్వహించే హాత్ సే హాత్ జోడో యాత్రలో ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధి  సందేశాన్ని వినిపించి దేశాన్ని కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఆలోచనలు, భావా జాలాన్ని ప్రచారం చేసి హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు రెండు నెలల పాటు కష్టించి పని చేయడానికి కార్యకర్తలు సమయాత్తం కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,టిపిసిసి ఉపాద్యక్షులు ,మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య, ఖమ్మం నియోజకవర్గ పిసిసి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, వైరా నియోజకవర్గ పిసిసి సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్, నగర బి సి అద్యక్షులు బాణాల లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.