వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : రేవంత్ రెడ్డి
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.
(హైదరాబాద్-విజయంన్యూస్)
మనమంతా ఐక్యంగా ఉండి పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేద్దాం.. ఇప్పుడు కష్టపడితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈజీగా వస్తుంది.. అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా కష్టపడి పనిచేసి దేశంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయిద్దామంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 5 మండలాలలో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ గెలుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. 35 మండలాలలో బలంగా ఉంటే ఎంపీ స్థానం గెలుస్తాం.. 600 మండలాలలో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని రేవంత్ నేతలకు వివరించారు.
also read :-నేను సీఎం కేసీఆర్ ను కలవాలి.. నన్ను వదలండి : జేసీ హల్ చల్
హైదరాబాద్ ఇందిరాభవన్లో డిజిటల్ మెంబర్షిప్ కోసం నియోజకవర్గాల కో`ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశం లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నేతలకు సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. మండలాలలో అధ్యక్షులు సరిగా పని చేయకపోతే వారిపై చర్యలు తప్పవన్నారు. మండలంలో 10 వేలు, నియోజకవర్గంలో 50 వేలు, పార్లమెంట్ నియోజక వర్గంలో 3.5 లక్షల సభ్యత్వం చేయిస్తే వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని గతంలో చెప్పారు.రేపు అసెంబ్లీ ఇన్ఛార్జిలతో మెంబెర్షిప్ పైన సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. 30వ తేదీన ప్రత్యేకంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం వారీగా సవిూక్ష చేస్తాం అని తెలిపారు.
also read ;-పోడు పట్టాలు..12 శాతం రిజర్వేషన్లేవి సీఎం కేసీఆర్ : బండి సంజయ్
కార్యకర్తలు, నేతలు సభ్యత్వంపైనే దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తప్పకుండా పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు. పెద్దఎత్తున సభ్యత్వం చేయించిన నాయకులకు పార్టీలో గుర్తింపు దక్కుతుందని అన్నారు.ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వం క్రియాశీలకంగా తీసుకుని పనిచేయాలని నేతలకు రేవంత్ సూచించారు. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బూతుకు వంద మంది చొప్పున సుమారు 34 వేల పోలింగ్ బూతుల్లో సభ్యత్వం చేయించాలని వివరించారు. ఎవరెన్ని సభ్యత్వాలు చేయిస్తున్నారో ఏఐసీసీ అధినేతల వద్ద రోజువారి సమాచారం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎమ్మెల్యే సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, దీపక్ జాన్, చిన్నారెడ్డి, నిరంజన్, వేం నరేందర్ రెడ్డి, సోహైల్ తదితరులు హాజరయ్యారు.