Telugu News

కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం లేదు: కూనంనేని 

ప్రజాపోరు ముగింపు సభలో కూనంనేని, తమ్మినేని

0

కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం లేదు: కూనంనేని 

*మతోన్మాద శక్తులతో దేశానికి ప్రమాదం*

*బిజెపి దొంగలకు దేశ సంపద దోచిపెడుతుంది.*

*ప్రజాపోరు ముగింపు సభలో కూనంనేని, తమ్మినేని*

*ఖమ్మం రూరల్లో వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ*

ఖమ్మం,ఏప్రిల్ 22(విజయం న్యూస్):

కమ్యూనిజానికి ప్రత్యామ్నాయ శక్తి ఇంత వరకు లేదని ఇక రాబోదని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం తెలిపారు. విచ్చిన్నకర శక్తులను, మతోన్మాద శక్తులను అడ్డుకుంటామని బిజెపి వ్యతిరేక పోరాటంలో కలిసి వచ్చే ప్రగతిశీల లౌకిక వామపక్ష శక్తులను కలుపుకుని బిజెపిని గద్దె దించుతామని వారు స్పష్టం చేశారు.సిపిఐ ఖమ్మం జిల్లా సమితి చేపట్టిన ప్రజా పోరు యాత్ర ముగింపు సభ శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో జరిగింది. పెద్దతండా నుంచి తరుణి హాట్ వరకు వేలాది మందితో ప్రదర్శన నిర్వహించారు.వరంగల్ క్రాస్ రోడ్డు పెద్దతండా వరకు అరుణ పతాకాలు చేబూని ఎర్ర చీరలు, ఎర్ర చొక్కాలు ధరించిన ప్రజలతో అరుణావర్థమైంది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని. మాట్లాడుతూ,మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనూ,హిందు మతంలోనూ దొంగలు పడ్డారని దేశ సంపదను కొందరు ద్రోహులకు కట్టబెడుతున్నారని మతాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రమ జీవుల పక్షాన పోరాడుతున్న పార్టీలను ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని సాంబశివరావు తెలిపారు. బిజెపిని నిలువరించే శక్తి కమ్యూనిస్టులకు ఉందని బిజెపి వ్యతిరేక శక్తులను ఐక్యం చేస్తామని ఆయన తెలిపారు. నిన్న మొన్నటి వరకు పదవుల కోసం అర్రులు. చాచిన వారు ఇప్పుడు కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నారని అప్పటి కమ్యూనిస్టులకు ఇప్పటి కమ్యూనిస్టులకు ఉన్న తేడా ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవకాశ వాద రాజకీయాలకు పాల్పడే వారు విమర్శలు చేస్తే కమ్యూనిస్టులు సహించబోరని ఆయన హెచ్చరించారు. బిజెపినో,కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్న వారు ఎటువంటి వారో, ఎంత మేర రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారో ప్రజలు ఆలోచించాలన్నారు. డబ్బుతో డబ్బు కోసం జరిగే సమ్మేళనాలు ఏ రకం ఆత్మీయ సమ్మేళనాలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు సంఖ్య పరంగా బలహీనపడవచ్చు కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం అజేయం, అజరామరం అన్నారు.దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతుందని ఈ దేశానికి, సమాజానికి ప్రమాదం ఏర్పడిన ప్రతిసారి కమ్యూనిస్టులు ముందుండి పోరాడతారని సాంబశివరావు తెలిపారు. అధికారం కోసం ప్రజా సమస్యల పరిష్కారం మా ఎజెండా అని ఆయన స్పష్టం చేశారు.

== దేశ సంపదను దోచి పెడుతున్నారు : తమ్మినేని

దేశ సంపదను బిజెపి పెద్దలు కొందరికీ దోచిపెడుతున్నారని దీనిని నిలువరించేందుకే కమ్యూనిస్టులు పోరాడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.సిపిఐ ప్రజాపోరు యాత్రకు సంఘీభావం తెలిపిన తమ్మినేని సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించే వారికి ఈ సభ సమాధానం చెబుతుందన్నారు. ఖమ్మం రూరల్ మండల సమితి ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ రేపటి ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. బిజెపి సమ న్యాయం గురించి మాట్లాడుతుందని క్రిస్టియన్లు, ముస్లింలు లేని సామాజిక న్యాయం సాధ్యమా అని తమ్మినేని ప్రశ్నించారు. బిజెపిలో నమ ధర్మం లేదని సామాజిక న్యాయం లేదని కేవలం కార్పొరేట్ శక్తులకు రోచిపెట్టడమే బిజెపి ఎజెండా అని తమ్మినేని స్పష్టం చేశారు. బిజెపి ప్రైవేటీకరణ ఫలితంగా రిజర్వేషన్లు దూరమవుతున్నాయని దీనిని మధ్యతరగతి మేధావులు, వివిధ వర్ణాలకు చెందిన వారు గుర్తెరగాలన్నారు. బిసిల లెక్క తేలకుండా రిజర్వేషన్లు అమలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పార్లమెంటరీ, కార్యనిర్వహక న్యాయవ్యవస్థ సహా నాలుగింటిని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తుందన్నారు.కేంద్ర అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారాయని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర విధులు, బాధ్యతలు స్పష్టంగా పేర్కొన్న కేంద్రం రాష్ట్రాల అధికారాలను హరించివేస్తుందన్నారు.కెసిఆర్ కి బిజెపి తత్వం బోధపడిందని బిజెపి వ్యతిరేక పోరాటంలో ఆయన కూడా నిలిచారని తమ్మినేని తెలిపారు.అందరం ఏకం కావడం, బిజెపిని బొందపెట్టడం ఖాయమని తమ్మినేని స్పష్టం చేశారు.ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్ రెడ్డి, యద్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణికుమార్, కొండపర్తి గోవిందరావు, పుచ్చకాయల కమలాకర్, అజ్మీర రామ్మూర్తి, మిడికంటి వెంకటరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెరుకుపల్లి భాస్కర్, పుచ్చకాయలు సుధాకర్, పగిళ్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.