Telugu News

నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్  కుట్ర : బండి

అందుకే ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించలేదు*

0

నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్  కుట్ర : బండి

== అందుకే ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించలేదు

== సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్ దే*

== మాస్టర్ వీవర్స్ కు బతుకమ్మ ఆర్డర్లను ఇచ్చి ఆసాములను కూలీలుగా మార్చారు*

== కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను ఎందుకు ఆదుకోవడం లేదు?

== రూ.270 కోట్ల బకాయిలుంటే రూ.50 కోట్లు చెల్లించడం కంటితుడుపు చర్యే..

== యూర్న్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది*

== కొన్ని కంపెనీల వద్దే కొనాలంటూ నేతన్నలను దోపిడీ చేస్తున్నారు

== ఈ వ్యవహారంపై విచారణ జరపాలి

== బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్

== సిరిసిల్లలో సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు

(కరీంనగర్ -విజయం న్యూస్)

తనను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్న బండి సంజయ్ నాటి మంత్రి కేటీఆర్ తాను ప్రతిపాదించిన కొన్ని కంపెనీల వద్దే యార్న్ కొనుగోలు చేయాలని షరతు పెట్టడంతో అధిక ధరకు యార్న్ కొనుగోలు చేసిన నేతన్నలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా.. యార్న్ కొనుగోలులో అక్రమాలపై విచారణ జరపాలని సవాల్ విసిరారు.

ఈరోజు సిరిసిల్ల విచ్చేసిన బండి సంజయ్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నుండి టౌన్ మొత్తం తిరుగుతూ శాంతినగర్ హనుమాన్ ఆలయ సమీపం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధూమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు…..

రాముడంటే భక్తి ఉండాలి తప్ప… బీఆర్ఎస్, కాంగ్రెసోళ్లకు రాముడి పేరు వింటేనే భయం పట్టుకుంది. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అనేటోళ్లను ఏమనాలె? వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. మహాలక్ష్మీ పథకం కింద మహిళల అకౌంట్లో నెలనెలా రూ.2500లు ఎందుకు వేయడం లేదు? రూ.4 పెన్షన్, రైతు భరోసా, పేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీ గుడిని మింగితే కాంగ్రెస్ గుడిలో లింగాన్ని కూడా మింగే టైపు..

బీఆర్ఎస్ అరాచకాలపై, అవినీతి, అక్రమాలపై బీజేపీ అలుపెరగని పోరాటాలు చేస్తే కాంగ్రెస్ కు ఓటేయడం ఎంత వరకు న్యాయం ఆలోచించాలి… గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు…ప్రజలు వాస్తవాలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు సిద్ధమైనరు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించనేలేదు… వీరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు.

సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభం సమసిపోలేదు. మీరంతా ఐక్యంగా ఉంటూ సమ్మె చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి నేను లేఖ రాసిన. అనేక రూపాల్లో సర్కార్ తీరును ఎండగట్టిన. అయినా స్పందించకపోవడంతో నేతన్నకు మద్దతుగా దీక్ష చేసేందుకు సిద్దమైతే తప్ప ప్రభుత్వం దిగిరాలేదు.. రూ.270 కోట్ల బకాయిలుంటే… కంటి తుడుపు చర్యగా రూ.50 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… ఎన్నికల కోడ్ పేరుతో ఆ నిధులను కూడా ఆపేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారు.. అదే జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు.. దీంతపాటు మిగిలిన బకాయిలన్నీ నేతన్నలకు చెల్లించాల్సిందే..

సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్సే. మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం వెంటనే పాత బకాయిలన్నీ చెల్లించాలి. ఏడాది పాటు ఉపాధి కి ఇబ్బంది లేకుండా కొత్త ఆర్డర్లు ఇవ్వాలే… పాత విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలే. 50 శాతం సబ్సిడీతో విద్యుత్ బిల్లులను పునరుద్దరించాలే.. కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలి. గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని కొనసాగించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నం. వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడానికి, నేతన్నలకు నేను ఎప్పుడూ అండగా ఉంటా. కేసీఆర్ మెడలు వంచి గద్దె దించిన చరిత్ర బీజేపీది.

కరీంనగర్ జిల్లాలో కేటీఆర్, జిల్లా మంత్రి కుమ్కక్కై పనిచేస్తున్నరు. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారు.. గతంలో కేటీఆర్ ప్రతిపాదించిన కంపెనీల వద్ద మాత్రమే యార్న్ కొనుగోలు చేయాలని నేతన్నలను బలవంత పెడుతూ భారీ ఎత్తున దోపిడీ చేస్తుంటే.. మంత్రి ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరపాలి. నేతన్నల సంక్షేమం కోసం పనిచేయకుండా వెధవ.. అంటూ బూతులు తిడుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నరు. కండకావరంతో వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ జిల్లాకు వస్త్తుంటే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి గ్రుహ నిర్బంధానికే పరిమితం చేసేవారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపినా వెనుకాడలే. గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరాడి కేసీఆర్ మెడలు వంచిన. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడిన. వాస్తవాలు ఆలోచించండి. దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మోదీకి మద్దతివ్వండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని వంద శాతం పోలింగ్ జరిగేలా చూడండి. పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా…