Telugu News

క్రాస్ ఓటింగ్ జరిగిందా..?

** రానురాను అంటూనే ఓటింగ్ కు వచ్చిన కమ్యూనిస్టులు

0

క్రాస్ ఓటింగ్ జరిగిందా..?
** రానురాను అంటూనే ఓటింగ్ కు వచ్చిన కమ్యూనిస్టులు
** ఓటింగ్ వేసేందుకు మక్కువ చూపిన స్వతంత్రులు
** ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ
** క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్న రాజకీయ విశ్లేషకులు
** ఓటర్ నిర్ణయం ఎటువైపు..?
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ లో ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకే వేశారా..? క్రాస్ ఓటింగ్ జరిగిందా..? రానురాను అంటూనే కొందరు ఓటర్లు అందరికంటే ముందే ఓట్లేసి పోవడం వేనక రహస్యమేంటి..? ఓటింగ్ కోసం ఆరాట పడిన స్వతంత్రులు ఎవర్ని గెలిపిస్తున్నారు..? ఓటర్ నిర్ణయం ఎటువైపు..? ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.. రాష్ట్రంలోనే 12 స్థానాలకు నోటిఫికేషన్ రాగా, 9 స్థానాలు ఏక్రగీవం అయ్యాయి.

మూడు స్థానాలకు పోటీ నెలకొనగా అందులో ఖమ్మం జిల్లా ఒక్కటి. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి తాతామధుసూధన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్రులుగా కొండపల్లి శ్రీనివాస్, కొండ్రు సుధారాణి బరిలో నిలిచారు. అయితే ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చాలా స్వల్ప స్థానాలు ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు, అగ్రనాయకత్వానికి కాకుండా తాతామధు సూధన్ కు సీటు కేటాయించడంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కొంత మంది నాయకులు తీవ్ర అసంతప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలో పల్లా రాజేశ్వరర్ రెడ్డి పర్యటించి అన్ని తానై పనిచేస్తుండటం కూడా ఉమ్మడి జిల్లాలో కొంత మంది నాయకులు జీర్ణుంచుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఇరు పార్టీలకు చెందిన నాయకులు నువ్వంటే నువ్వన్నట్లు ఓటర్లకు డబ్బుల పంపిణి చేశారు. మొదటి నుంచి క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉందని భావిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి దైర్యంగా ముందుకు అడుగు వేసి కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు సీపీఎం, సీపీఐ, టీడీపీ, స్వతంత్రులకు అలాగే టీఆర్ఎస్ ఓటర్లకు కూడా డబ్బులు పంపిణి చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఇరు పక్షాల ఓటర్లకు భారీగానే డబ్బులు పంపిణి చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమయంలో జరిగిన పోలింగ్ కొంత ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ జరుగుతుండగానే క్రాస్ ఓటింగ్ జరుగుతోందనే ప్రచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంలో పోలింగ్ కేంద్రం పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. రాజకీయ విశ్లేషకులు,సీనియర్ జర్నలిస్టులు, నాయకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంటిలిజెన్సీ అధికారులు కూడ అదే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.
** రానురాను అంటూనే ఓటింగ్ కు
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ లో మరో విచిత్రకరమైన అంశం జరిగింది. రానురాను అనుకున్న కొన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముందుండి ఓట్లు వేసి వెళ్లారు. ప్రతి ఎన్నికలకు ధూరంగా ఉండే సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇక పాము విరగోద్దు, కప్పచావోద్దు అన్నట్లుగా వ్యవహరించే తీరులో ఉన్న సీపీఎం పార్టీ ఈ సారి పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కానీ ఆ పార్టీకి చెందిన ఓటర్లు మాత్రం అందరికంటే ముందు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇక స్వతంత్రంగా గెలిచిన ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వని సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ మద్దతు దారులు ఓట్లు వేయడంతో అసలు టెన్షన్ మొదలైంది. ఈ పార్టీలకు చెందిన ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసి ఉంటారా..? అనేదే రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి కాంగ్రెస్ వారికి కూడా డబ్బులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారు డబ్బులు తీసుకున్నది నిజమే అయితే క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందా..? అనే ప్రశ్న ఆ పార్టీని బయపెడుతుంది.

ఇదిలా ఉంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రెండు వైపుల డబ్బులు తీసుకున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్పీచైర్మన్లు బాధ్యత తీసుకుని గోవా తీసుకెళ్లి శిక్షణ ఇచ్చినప్పటికి, వారికి భవిష్యత్ పై భరోసా కల్పించినప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వద్ద డబ్బులు తీసుకున్నారంటే..? అసలు డబ్బులు ఇచ్చింది.. తీసుకుంది నిజమేనా..? నిజమే అయితే..? క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందా…? అంటే అసలేం జరిగిందో ఈనెల 14న జరిగే లెక్కింపు తరువాతనే తెలనుంది. అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది అనే విషయం మాత్రం జిల్లా వ్యాప్తంగా ముమ్మర ప్రచారం జరుగుతోంది. మరీ అసలు క్రాస్ ఓటింగ్ జరిగిందా..? ఓటర్లు ఎవర్ని గెలిపిస్తారు..? ఎవర్ని ఓడిస్తారో..? ఈనెల 14న జరిగే లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే..?

also read :- ఓటర్ల తీర్పు ఎటు.. షూరు అయిన పోలింగ్