Telugu News

బీఆర్ఎస్ మేనిఫెస్టో జిమిక్కులు నమ్మొద్దు: పొంగులేటి 

కౌరవ సైన్యం డబ్బులు తీసుకొని... పాండవ సైన్యానికి ఓట్లు వేయండి

0
బీఆర్ఎస్ మేనిఫెస్టో జిమిక్కులు నమ్మొద్దు: పొంగులేటి 
== కౌరవ సైన్యం డబ్బులు తీసుకొని… పాండవ సైన్యానికి ఓట్లు వేయండి
== కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోడు భూములకు పట్టాలు ఇస్తాం*
= = తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
== ఇల్లందు మండలంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు*
(ఇల్లందు -విజయం న్యూస్)
పన్నుల రూపంలో ప్రజల దగ్గర దోచుకొని దాచుకున్న డబ్బులో కొంత మొత్తం తిరిగి వారికే ఇచ్చేందుకు కౌరవ సైన్యం లాంటి బీఆర్ఎస్ సిద్ధమైందని  ఆ డబ్బులు తీసుకొని పాండవ సైన్యం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దీవించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజలను కోరారు. ఇల్లందు మండలంలోని 13 గ్రామ పంచాయితీలకు చెందిన సుమారు 500లకు పైగా కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలోకి ఆదివారం చేరారు. మండలంలోని రొంపేడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోతో ఎన్నికల జిమిక్కును రెండు, మూడు రోజులలో ప్రకటించేందుకు సిద్ధమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నమ్మొదని అవన్నీ ఎన్నికల జిమ్మికులు మాత్రమేనని ప్రజలకు సూచించారు.
గతంలో రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి దానిని తుంగలోకి తొక్కారని విమర్శించారు. ఇప్పుడు అదే హామీని మేనిఫెస్టోలో పొందుపరిచి మభ్యపు హామీతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఓ కొత్త ఎత్తుగడ వేస్తున్నాడన్నారు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి వారిని కూడా బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి బీదవానికి పోడు భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో 50 రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. ఆ తరువాత ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు,  జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు,  వివిధ సొసైటీల అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.