ఖాకీలపై డేగ కన్ను
వనమా రాఘవకు సహకరించిన పోలీసులపై అంతర్గత విచారణ
పాల్వంచ పట్టణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
పాతపాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో ఏ2గా ఉన్న వనమా రాఘవేంద్రరావును మంగళవారం ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. అతనిపై పోలీసులు ఏడు పేజీలతో సవివరంగా రాసిన రిమాండ్ రిపోర్టు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ రిపోర్టులో 2006 నుంచి 2021 వరకు మొత్తం 12 కేసులు అధికారికంగా రాఘవపై ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. | రాజకీయ ఒత్తిళ్లతో గతంలో రాఘవపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని కేసుల్లో అయితే అసలు ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసులు ఆసక్తి చూపలేదు. మరికొన్నింటిలో ఏకంగా బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించి రిమాండుకు తరలించారు. తర్వాత బెయిల్పై బాధితులు బయటకు వచ్చారు. ఆ కేసులకు సంబంధించిన విషయాల్లోనే నేటికీ బాధితులు వాయిదాలతో అటు స్టేషన్.. ఇటు న్యాయస్థానాల ఎదుట హాజరవుతున్నారు. పోలీసులను ప్రభావితం చేయడం, బాధితులను భయపెట్టడం, సాక్షులను ప్రలోభపెట్టడం వంటి అంశాలు రాఘవకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు రాజకీయ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు
కాల్ డేటా ఆధారంగా..
also read :-పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన ఖమ్మం డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు
నాగ రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసులో వనమా రాఘవేంద్రరావుపై ఐపీసీ 302, 307, 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రణాళికలు, ఉన్నతాధికారుల నుంచి వస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు కొంతమంది పోలీసులు రాఘవకు చేరవేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ సారి వనమా రాఘవ హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడనే వార్త మీడియాలో వైరల్ అయింది. రాఘవ లొంగిపోయిన వార్త కేవలం మీడియా సృష్టేనని ఏఎస్పీ కొట్టి పారేశారు. ఉన్నట్టుండి మరుసటి రోజు రాత్రే దమ్మపేట మండలం మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద రాఘవ, మరో ఇద్దరు కారులో పారిపోతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా రాఘవ ఎలా పట్టుబడ్డాడు? అంత కచ్చితంగా పోలీసులు రాఘవ ఉన్న ప్రదేశాన్ని ఎలా గుర్తించగలిగారు? అన్న సందేహాలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఏంటనే చర్చ జిల్లాలో సాగుతోంది. రాఘవ ఆచూకీని ఖాకీలు పసిగట్టడానికి జిల్లాలోని ఓ పోలీసు ఉన్నతాధికారే కారణమంటూ పోలీసులు చర్చించుకుంటున్నారు. రాఘవ కాల్ డేటాను బయటకు తీయగా అందులో కొంతమంది పోలీసులు రాఘవకు సమాచారం అందించినట్లు గుర్తించారనే వాదనలు వినిపిస్తున్నాయి.