బీజేపీ పాలనలో ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం: విజయ్ రాఘవన్
పెట్టుబడిదారులు పైపైకి... పేదలు మరింత దిగువకు...
బీజేపీ పాలనలో ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం: విజయ్ రాఘవన్
== లౌకిక, రాజ్యాంగ తిలోదకాలు
== ఎన్‌ఆర్‌ఈజీఎస్ వంటి పథకాలు నిర్వీర్యం
== పెట్టుబడిదారులు పైపైకి… పేదలు మరింత దిగువకు…
== సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజయ్ రాఘవన్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం : బీజేపీ పాలనలో ఆర్థిక, లౌకిక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజయ్ రాఘవన్ పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కొవిడ్`19 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువైందన్నారు. పెట్టుబడిదారులు పైపైకి ఎదుగుతుంటే పేదలు మాత్రం మరింత దిగువకు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కలిసివచ్చే పార్టీలతో సీపీఐ(ఎం) ముందుకు సాగుతుందన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి విజయ్ రాఘవన్ మాట్లాడారు.
ఇది కూడా చదవండి : గుజరాత్‌లో బీజేపీదే హవ్వా
దేశంలో ధరల పెరుగుదల అధికంగా ఉందని పట్టణాలతో పోలిస్తే పల్లెలపై దీని ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం మరింతగా పన్నుల భారం మోపుతుందన్నారు. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తుందని ధ్వజమెత్తారు. విచ్చలవిడిగా డబ్బులు వినియోగించి ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను కూలదోస్తుందన్నారు. మైనారిటీ దళితులపై వివక్ష అధికం అవుతుందని అర్బన్ మావోయిజం పుంజుకోంటుందని ఆరోపించారు. విద్య, ఆరోగ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పోరాడి సాధించుకున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. ఓవైపు అధిక పనిదినాల కోసం డిమాండ్లు లేవనెత్తుతున్న పరిస్థితుల్లో ఉపాధి కల్పన పథకాలను నిర్వీర్యం చేయడం తగదన్నారు. లేబర్ కోడ్స్, వర్కర్స్ చట్టాలు అమలు కాకపోగా పెట్టుబడిదారి విధానాలు మరింతగా పుంజుకుంటున్నాయని తెలిపారు. సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సంఫ్‌ు వంటి సంఘాలను కలుపుకుని వ్యవసాయ కార్మికుల సమస్యలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ దే : మంత్రి పువ్వాడ అజయ్
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎన్. చంద్రన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, కల్యాణం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.