Telugu News

సమతా విశ్వరూపం..నేడే జాతికి అంకితం..

వేలమంది భక్తుల నడుమ వైభవంగా వైనతేయ ఇష్టి

0

సమతా విశ్వరూపం..నేడే జాతికి అంకితం..

వేలమంది భక్తుల నడుమ వైభవంగా వైనతేయ ఇష్టి
శ్రీరామ నగరంలో శ్రీమన్నారాయణ నామ స్మరణ
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

శంషాబాద్‌లో స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌, డీజీపీ సమీక్ష
ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు
8 వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత
విష్ణు సహస్రనామ పారాయణంలో కేసీఆర్‌ సతీమణి శోభ
తానొక్కడికి నరకం ప్రాప్తించినా సరే, అనేక మందికి మోక్షం లభిస్తుందనే ఔదార్యంతో గుడి గోపురంపై నుంచి తిరుమంత్రాన్ని బహిరంగంగా ఉపదేశించిన పరమ గురువాయన.

వర్ణ భేదాలకు తావు లేకుండా భక్తులందరికీ ఆలయ దర్శనం గావించిన పరివర్తనా సారథి ఈ పరివ్రాజకుడు. యథాతథ శక్తుల ప్రతిఘటనలు, దాడుల మధ్య- ప్రాణ భీతికి అతీతంగా – భగవత్తత్తాన్ని విశ్వవ్యాప్తం చేసిన సాహసికుడు ఈ యతిరాజు. భారతీయ తాత్విక చింతనలో ఉన్నత శ్రేణి భావధారయైన విశిష్టాద్వైత ప్రవచకులు, మహోన్నత సంఘ సంస్కర్త శ్రీమత్‌ రామానుజుల విగ్రహావిష్కరణ నేడు.

శ్రీమద్రామానుజుడి సహస్రాబ్ది సందర్భంగా జరుగుతున్న ఈ విరాట్‌ విగ్రహావిష్కరణ.. సమతా భావనను భావితరాలకు ప్రసరించే సమున్నత సందేశం. విశ్వ కల్యాణం కోసం సాగించే వినమ్ర కృత్యం.

రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన సమతా మూర్తి విరాట్‌ విగ్రహాన్ని జాతికి అంకితం చేసేందుకు ముహూర్తం ఆసన్నమైంది. ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం సాయంత్రం ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు శ్రీరామనగరం శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగిపోతున్నది. అష్టాక్షరీ మంత్ర జపంతో పులకించిపోతున్నది. రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు. వేలాది మంది వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ వైనతేయ ఇష్టిని చేపట్టగా, భక్తులు భారీగా తరలివచ్చి యాగంలో పాలుపంచుకొన్నారు. యాగ విశిష్టతలను రుత్విక్కులు వివరించారు. పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం భక్తులకు చిన జీయర్‌స్వామి అనుగ్రహ భాషణం చేశారు.

భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది
సనాతన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని చినజీయర్‌ స్వామి కొనియాడారు. సంస్కృతి గొప్పదనాన్ని వివరించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత సంస్కృతి ప్రత్యేకతను చాటిచెప్పిందని పేర్కొన్నారు. షేక్‌ హ్యాండ్‌లు ఇవ్వడం మాన్పించి, నమస్కారం ప్రాధాన్యాన్ని తెలిపిందని, అనాదిగా భారతీయులు ఆచరిస్తున్న సంప్రదాయ నియమాల వైశిష్ట్యాన్ని ప్రపంచానికి తెలియజేసిందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా సంప్రదాయాలను నిరంతరం పాటించాలని పిలుపునిచ్చారు.

అనంతరం యాగశాలలో ఏర్పాటు చేసిన భోగ, పుష్ప, జ్ఞాన, త్యాగ మండపాల విశిష్టతను, వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పొందే పుణ్యఫలాన్ని భక్తులకు తెలియజేశారు. శనివారం నిర్వహించబోయే రామానుజాచార్య సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ విచ్చేయుచున్నారని, ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు, రామానుజాచార్య కీర్తిని నలుదిశలా చాటేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సెక్యూరిటీ కారణాల రీత్యా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయని, ప్రముఖుల పర్యటన అనంతరం భక్తులందరూ రావచ్చని వివరించారు. అనంతరం యాగంలో పాల్గొన్న రుత్విక్కులకు, భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం ప్రవచన మండపంలో విష్ణు సహస్రనామ పారాయణాన్ని చినజీయర్‌ స్వామి ప్రారంభించారు. భక్తులకు విష్ణునామ స్తోత్రం ఇతి వృత్తాంతాన్ని, ప్రాధాన్యాన్ని, పారాయణంతో పొందే పుణ్యఫలాన్ని వివరించారు.

విష్ణు సహస్రనామ పారాయణంలో సీఎం సతీమణి శోభ
రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ సతీమణి శోభతోపాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవచన మండపంలో చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన విష్ణుసహస్రనామ పారాయణంలో, యాగశాలలో లక్ష్మీనారాయణ పూజల్లో పాల్గొన్నారు.

also read :-112 కోట్ల కేంద్ర నిధులను ప్రక్కదారి పట్టించిన కేసీఆర్ సర్కార్.

ప్రధానికి స్వాగతం పలుకనున్న సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంషాబాద్‌ విమానాశ్రయంలో శనివారం స్వాగతం పలుకనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో కూడా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌కు, ఇక్రిశాట్‌ నుంచి ముచ్చింతల్‌కు వెళ్లనున్నారు. ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ సుమారు మూడుగంటలపాటు గడపనున్నారు. రాత్రి 8 గంటలకు మోదీ ముచ్చింతల్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి, అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

also read :-సుడా చైర్మన్ పై అసత్య ఆరోపణలు తగదు

అన్ని ఏర్పాట్లు చేశాం: సీఎస్‌
సమతామూర్తి విగ్రహావిష్కరణ నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేశామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ప్రధాని మోదీ శనివారం సమతామూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో శుక్రవారం పర్యటన ఏర్పాట్లను డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీఎస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని, రాష్ట్రపతి ఇతర ప్రముఖుల పర్యటనలతోపాటు ఈ నెల 12 వరకు జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసిందని వివరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్‌ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతిలేదని, ప్రత్యేక పాసులు ఉన్నవారినే అనుమతిస్తామని స్పష్టంచేశారు. 8 వేల మంది పోలీసు అధికారులతో బందోబస్తును ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశామని తెలిపారు. ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్‌ను, ప్రధాని బసచేసే గెస్ట్‌హౌస్‌ను సీఎస్‌, డీజీపీ పరిశీలించారు.