Telugu News

ఎమ్మెల్యే కందాళను నిలదీసిన రైతులు

రుణమాఫీ ఏది అంటూ ప్రశ్న

0

ఎమ్మెల్యే కందాళను నిలదీసిన రైతులు

== రుణమాఫీ ఏది అంటూ ప్రశ్న

== ఏం జరిగిందని పండుగ చేస్తున్నారని ఎమ్మెల్యేని ప్రశ్నించిన రైతులు

== రైతుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే..సమాధానమిస్తున్నప్పటికి వినని రైతులు

== నియోజకవర్గ వ్యాప్తంగా రైతు విజయోత్సవ సంబురాలు

(కూసుమంచి/నేలకొండపల్లి-విజయంన్యూస్)

ఎమ్మెల్యే కందాళ కు చేదు అనుభవం ఎదురైంది.. రైతు విజయోత్సవ సంబురం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేనపై రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులకు ఏం చేశారని పండుగ చేసుకుంటున్నారని, రైతు రుణమాఫీ ఎక్కడ అమలు చేశారని, వడ్డీలు కట్టలేక చచ్చిపోతుంటే మీరు సంబరాలు చేసుకుంటారని ప్రశ్నించారు. దీంతో రైతు సంబురం కాస్త రైతుల ఆందోళనగా మారిపోయింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే హాజరైన కార్యక్రమంతో పాటు అన్ని రైతు సంబురాల కార్యక్రమాలకు నిజమైన రైతులు గైరాజరైయ్యారు. నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తప్ప రైతులు అంత పెద్దగా ఇంట్రస్ట్ చూపించినట్లు కనిపించలేదు.

ఇది కూడా చదవండి: మీరుండగా వాళ్లు నన్నేం పీకలేరు..: మంత్రి పువ్వాడ

పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు ఉత్సవాలను జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొదటి రోజున జెండా అవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించిన అధికారులు, ప్రభుత్వం, రెండవ రోజు రైతు విజయోత్సవ సంబరాలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు పాలేరు నియోజకవర్గంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో రైతు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో జరిగే రైతు సంబురాల్లో పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి గ్రామంలో జరుగుతున్న రైతు సంబరాలలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.ఆయన మాట్లాడుతుండగా గ్రామానికి చెందిన రైతులు కందాళ ఉపేందర్ రెడ్డిని ప్రశ్నించారు. రుణమాఫీ ఎక్కడ అమలు చేశారని, పాస్ పుస్తకాలు అందరికి ఎందుకు ఇవ్వలేదని, ఎరువులు ఉచితంగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్నలు మూలుగుతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా కనీసం రైతులపై కనీకరంగా చూసే వారే కరువైయ్యారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్నలు మూలుగుతున్నాయని, కొనే నాథుడే లేడన్నారు.

ఇది కూడా చదవండి: రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి పువ్వాడ

వర్షానికి తడిసి ముద్దవుతున్నాయని ఆరోపించారు. రైతులకు ఏం మేలు చేశారని సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కొంత అసహానికి లోనై రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయన సర్థి చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో గొడవ పెరిగే అవకాశం ఉందని భావించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

== కూసుమంచిలో కనిపించని రైతులు

కూసుమంచి మండల కేంద్రంలో రైతు విజయోత్సవ సంబురం కార్యక్రమం జరుగుతుండగా ఈ కార్యక్రమానికి రైతులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేకపోయారు. కూసుమంచి మండల కేంద్రంలోని రైతు వేదికలో సమావేశం జరుగుతుండగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. కూసుమంచి మండల కేంద్రం నుంచి ఎడ్ల బండ్లపై రైతు వేదిక వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సమావేశం జరుగుండగా చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.