Telugu News

రాజకీయ దుమారం.

మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కలకలం

0

రాజకీయ దుమారం..!
– మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ కలకలం
– కాంగ్రెస్ ను వీడుతానంటున్న ప్రేమ్ సాగర్ రావు
– ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన
– ఇది ‘అలకనా’ అధికారం కోసమా..?
– అయోమయంలో పార్టీ క్యాడర్
– ఉన్నట్టుండి తెరపైకి కొత్త పరిణామాలు

(మంచిర్యాల ప్రతినిధి- విజయం న్యూస్):
మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా ఆయనకు పేరుంది. అలాంటి ప్రేమ్ సాగర్ రావు ఎందుకనీ రాజకీయ సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు..? దీని వెనుక ఉన్న అసలు కహాని ఏంటి..? అన్నది నేను అందరి మెదళ్లను పీడిస్తోంది. ఎమ్మెల్సీగా జిల్లాలో ఒక రాచరికపు పాలనను అనుభవించిన ఆయన ఉన్నట్టుండి ఎందుకని కాంగ్రెస్ ను వీడుతున్నారో అవగతం కావడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీలో సముచిత స్థానం కల్పించినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సబబు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సంచలన నిర్ణయం ఆయన ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ‘విజయం’ ప్రత్యేక కథనం..

జిల్లా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు శనివారం చేసిన ప్రకటన పెను ప్రకంపనలు రేపింది. గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన పదవి కాలం ఆరేళ్ళు పూర్తి అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. ఆయన సతీమణి కొక్కిరాల సురేఖ సైతం పార్టీలోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం సైతం సురేఖకు మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెట్టింది. వారిద్దరికీ సముచిత స్థానం కల్పించడంతోపాటు అదే స్థాయిలో ప్రాధాన్యతను ఇస్తోంది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ఆగమేఘాల మీద ప్రకటన చేయడం రాజకీయ దుమారాన్ని రేపిందని చెప్పాలి.

ఎందుకీ నిర్ణయం..?!
కాంగ్రెస్ పార్టీ నేత ప్రేమ్ సాగర్ రావు తీసుకున్న నిర్ణయం వెనక ఉన్న రాజకీయ కోణం ఏమిటన్నది అవగతం కావడం లేదని వాపోతోంది. వాస్తవానికి కొన్ని నెలలుగా ఆయన స్థబుగానే ఉంటున్నారన్న అభిప్రాయాలున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా వచ్చిన నాటి నుండి ఆయన సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కరోనా వ్యాధిగ్రస్తులకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేశారు. దీంతోపాటు నిత్యావసర సరుకులు సైతం అందిస్తూ వచ్చారు. అదే విధంగా కరోనా బారినపడి మృతి చెందినవారి కుటుంబాలను ఆర్థికంగానూ ఆదుకోవడంలో ప్రేమ్ సాగర్ రావు ముందుండి వచ్చారు. అలాంటి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదంటున్నారు.

రాజకీయ ఎత్తుగడేనా..?!
కాంగ్రెస్ పార్టీని వీడుతానంటూ ప్రేమ్ సాగర్ రావు చేసిన ప్రకటన రాజకీయ ఎత్తుగడగానే పలువురు భావిస్తున్నారు. వాస్తవానికి ప్రేమ్ సాగర్ రావు రాజకీయ ఎత్తుగడ ఏమిటన్నది కొన్ని నెలలుగా అంతుపట్టడం లేదు. తన అనుంగు శిష్యుడైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును అనూహ్యంగా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేలా చేశారన్న ప్రచారం ఉంది. అప్పటి నుండే ప్రేమ్ సాగర్ రావు పై అనేక అనుమానాలు కాంగ్రెస్ లో మొదలయ్యాయి. శిష్యుని ముందుగా పంపి అనంతరం తాను టీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం బాహాటంగానే జరిగింది. అయినప్పటికీ కొన్ని నెలలపాటు మౌనంగానే ఉన్నారాయన. ఈ తరుణంలోనే ఆయన భార్య కొక్కిరాల సురేఖకు ఎట్టకేలకు సముచిత స్థానాన్ని కాంగ్రెస్ అధిష్టానం కల్పించింది. ఆమెను ఏకంగా డీసిసి పదవికి ఎంపిక చేసింది. దీంతోనే ఆయన కొంత మౌనంగా ఉన్నాడని తెలుస్తోంది.

కాగా ప్రేమ్ సాగర్ రావు పార్టీ వీడతానన్న నేపథ్యంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు ఎమ్మెల్యే టికెట్టు సైతం తాను సూచించిన వారికే ఇవ్వాలన్న డిమాండ్ ను ఆయన అధిష్టానం ముందు ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ పై తనకే పట్టు ఉండాలన్న ఆయన వాదాన్ని అధిష్టానం అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతోనే ఆయన కాంగ్రెస్ ను వీడుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన పార్టీ వీడీ వెళ్ళిన కాంగ్రెస్ కు ఏ మాత్రం నష్టం లేదని, మరిన్ని వర్గాలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుందో చూడాలి

.