Telugu News

వణికిస్తున్న “గులాబ్”

రాష్ట్రంలో జోరు వర్షం.. అప్రమత్తమైన అధికారగణం

0

వణికిస్తున్న “గులాబ్”

** రాష్ట్రంలో జోరు వర్షం

** రెండు రోజులుగా ఎడతెరపలేకుండా కురుస్తున్న వర్షం..

** అప్రమత్తమైన రాష్ర్ట ప్రభుత్వ అధికారులు

** కలెక్టర్లతో మాట్లాడిన సీఎస్

** గ్రామస్థాయిలో అప్రమత్తమైన అధికారులు

** అలుగులు పారుతున్న చెరువులు

** మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం

(హైదరాబాద్-విజయం న్యూస్)

తెలంగాణ ను “గులాబ్” వణికిస్తోంది. తీరందాటనున్న తరుణంలో అల్పపీడనంగా, బారీ తుపాన్ గా ఏర్పడటంతో  తెలంగాణ రాష్ట్రంలో జోరుగా  వర్షాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపలేకుండా వర్షం కురుస్తోంది.   మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు.
సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఆదివారం రాత్రి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్‌ తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

** రెడ్ అలార్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు తీసుకోవాలన్నారు.

also read : చెవిటి,మూగ యువతి పై అత్యాచారం …?

ప్రస్తుతం వరంగల్‌, హైదరాబాద్‌, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని పేర్కొన్నారు.
జల దిగ్భంధంలో వన దుర్గా భవానీ ఆలయం
భారీ వర్షాలు, వరదలతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మధ్యతరహా ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది గుడిని మూసివేశారు. ఆలయం వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి శాఖ అధికారులు సూచించారు. భక్తుల దర్శనార్థం రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది.

** తుపాన్ గా మారిన  గులాబ్

శనివారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

also read : వానోచ్చిన వదులుడే లేదు