Telugu News

వ్య‌వ‌సాయ అభివృద్ధిలో గోదాముల పాత్ర కీల‌కం : ఖమ్మం ఎంపీ నామా

== క‌ర్ష‌క బిడ్డ‌గా రైతాంగ స‌మ‌స్య‌లు తెలుసు

0

వ్య‌వ‌సాయ అభివృద్ధిలో గోదాముల పాత్ర కీల‌కం : ఖమ్మం ఎంపీ నామా

== క‌ర్ష‌క బిడ్డ‌గా రైతాంగ స‌మ‌స్య‌లు తెలుసు

== నాగుల‌వంచ‌లో గోదాం శంకుస్థాప‌న‌లో ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు

(ఖ‌మ్మం, చింతకాని- విజయంన్యూస్);-

దేశంలో వ్య‌వ‌సాయం చేసి ధాన్యం పండించ‌డం ఎంత కీల‌క‌మో దాన్ని నిల్వ చేయ‌డం కూడా అంతే కీల‌క‌మ‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు పేర్కొన్నారు. చింత‌కాని మండ‌లం, నాగుల‌వంచ గ్రామంలో నాబార్డు నిధుల‌తో సహ‌కార సంఘం గోదాము నిర్మాణానికి ఆయ‌న సోమ‌వారం శంకుస్థాప‌న చేశారు. క‌ర్ష‌క బిడ్డ‌గా త‌న‌కు రైతాంగ స‌మ‌స్య‌లు పూర్తిగా తెలుస‌ని వెల్ల‌డించారు. గోదాములు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌తో వ్య‌వ‌సాయం వృద్ధి చెంది… దేశంలోని గ్రామాల‌న్నీ ప్ర‌గ‌తి బాట‌న ప‌డ‌తాయ‌ని చెప్పారు. చైనా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్ర‌తి గ్రామంలో గోదాం, ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయ‌ని గుర్తు చేశారు. మ‌న దేశంలో కూడా కేసీఆర్ వంటి ప‌ట్టుద‌ల నాయ‌కుడు ఉంటే రైతాంగం ఏద‌యినా సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఈ విష‌యానికి సంబంధించి ప్ర‌గ‌తికి త‌న వంతు కృషి చేస్తాన‌ని ఎంపీ హామీనిచ్చారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో ధాన్యం ఇంత స్థాయిలో ఎలా పండుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌న‌ని అడిగార‌ని తెలిపారు. త‌మ రైతుల క‌ష్టం, సీఎం కేసీఆర్ కృషితో సాధ్య‌మైంద‌ని తాను చెప్పిన‌ట్టు పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ‌పై అక్క‌సు ఉంద‌ని అన్నారు. ఇంత‌కుముందు పంజాబ్‌లో ధాన్యం అధికంగా పండేద‌ని, తెలంగాణ చిన్న రాష్ట్ర‌మైన ఇంత స్థాయిలో పండ‌టంపై కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. అందుకే త‌మ పంట కొన‌డంలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాంతోపాటు, రాష్ట్రంలో పండిన పంట‌కు గౌడ‌న్లు అవ‌స‌రమ‌ని గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్రంలో గౌడోన్ల సంఖ్య పెరిగింద‌న్నారు.

తాను ఆదివార‌మే ఢిల్లీ నుంచి వ‌చ్చాన‌ని వివ‌రించారు. త‌మ పంట కొనాల‌ని కేంద్రాన్ని విజ్ఞ‌ప్తి చేస్తే బీజేపీ ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌న్నారు. త‌మ రాష్ట్ర రైతులు ఎంతో క‌ష్ట‌ప‌డి పంట పండించార‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు వివ‌రించిన‌ట్టు గుర్తు చేశారు. కానీ, కేంద్రం ద్వంద నీతితో ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని మండిప‌డ్డారు. దేశంలో ఉన్న ధాన్యంతో పోల్చితే స‌గం కూడా గోడౌన్లు కూడా లేవ‌ని చెప్పారు. వాటి పెంపుపై కేంద్ర ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు అందుచేత‌నే, నేడు రైతాంగానికి ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంద‌ని చెప్పుకొచ్చారు. తాను ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన నేప‌థ్యంలో త‌న‌కు వ్య‌వ‌సాయంలో ఉన్న ఇబ్బందులు తెలుస‌ని అన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి నీళ్ళు, క‌రెంటు ఇవ్వ‌డం వ‌ల్ల రాష్ట్రంలో పంట పెరిగింద‌ని అన్నారు.

30 ఏండ్ల క్రితం తాను విదేశాల‌కు వెళిన‌ప్పుడు అప్పుడే అక్క‌డ వ్య‌వ‌సాయం ఎంత‌గానో ప్ర‌గ‌తి సాధించింద‌ని చెప్పారు. అయితే, భార‌తదేశంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింద‌ని చెప్పుకొచ్చారు. 24 గంట‌ల ఉచిత క‌రెంటు, రైతు బంధు వంటివి దేశంలో ఏ రాష్ట్రంలో లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ పూర్ణయ్య, మండల జడ్పీటిసి పర్సగాని తిరుపతి కిషోర్, నాగులవంచ సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, సర్పంచ్ నాగమణి గారు, ఎంపీటీసీలు సరోజిని, నాగరత్నమ్మ, డీసీసీబీ సీఈవో వీరబాబు, జిల్లా సహకార అధికారి విజయకుమారి, పెంట్యాల పుల్లయ్య, వంకాయలపాటి లచ్చయ్య, వైస్ ఎంపీపీ హనుమంతరావు, మంకెన రమేష్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

also read :-యాదాద్రిలో బాలయ్య… కేసీఆర్ పై ప్రశంసలు