ఖమ్మంలో పర్యటించిన గవర్నర్ తమిళసై
== కిట్స్ కాలేజీలోని వై 20 సదస్సులో పాల్గొన్న గవర్నర్
== ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, కళాశాల యజమాన్యం
ఖమ్మం, మే 17(విజయంన్యూస్):
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. భద్రాచలంలో పర్యటించిన ఆమె భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పొన్నేకల్ లో బుధవారం నిర్వహించిన వై20 సదస్సులో రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందర్య రాజన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ విద్యార్థుల యొక్క వై ట్వంటీ సదస్సుకు సంబంధించిన ముఖ్య అంశాలతో ముడిపడినటువంటి కొన్ని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ప్రాజెక్ట్స్ ను ఆమె సందర్శించి వాటిని రూపొందించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్ట్స్ లో అగ్రికల్చరల్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ నందు విద్యార్థులు చూపించినటువంటి శ్రద్ధకు విద్యార్థులను గవర్నర్ అభినందించారు. ఎస్ సిఐటి ఇన్నోవేషన్ సెంటరను ఈ సందర్భంగా గవర్నర్ ప్రారంభించారు. అందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు చేసే ప్రయోగాలు, శాస్త్ర సాంకేతిక పరిశోధనపై గవర్నర్ అధ్యాపకులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడ చదవండి: గవర్నర్‌కు మరోసారి ఘోర అవమానం..
అనంతరం సదస్సులో గవర్నర్ విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ, అంకితభావంతో ఉండాలని, దేశం పట్ల, భద్రత పట్ల మరింత శ్రద్ధగా వ్యవహరించాలని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన తర్వాత, దేశంలో ఇంత తొందరగా సమాజం పూర్వస్థితి కొనసాగడానికి సాంకేతిక పరిజ్ఞానము, డాక్టర్ల సహకారము, కృషిని కొనియాడారు. భారతదేశంలో మరి ముఖ్యంగా తెలంగాణలో తయారైనటువంటి వ్యాక్సినేషన్ వల్లనే ఇదంతా సాధ్యమైందని, దీనికి సంబంధించిన ప్రతి వాళ్ళ యొక్క కృషిని గవర్నర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఫార్మా హబ్ గా రూపుదిద్దుకుందని, మన దేశానికే కాకుండా, 150 దేశాలకు పైగా కరోనా వ్యాక్సిన్ అందించిందని అన్నారు. ప్రపంచం అంతటా వృద్ధులు ఎక్కువగా కరోనా బారిన పడగా, మన దేశంలో యువత ఎక్కువగా గురైనదని, ఇందుకు కారణం పోషకాహార లోపమే నని అన్నారు. యువత సాంప్రదాయ పోషకాహారాన్ని తీసుకోవడం లేదని, రోగనిరోధక శక్తి తగ్గి ఎక్కువగా కరోనా బారిన పడ్డారని అన్నారు. సాంప్రదాయం తో పాటు ఆవిష్కరణల సమతూకం పాటించాలన్నారు. విద్యార్థులు మరింత అంకితభావంతో వారి యొక్క చదువు పట్ల చూపాలని, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటూ గడపాలని తమ యొక్క విద్యను నేర్చుకోవాలని తెలిపారు.
ఇది కూడా చదవండి: గవర్నర్ హక్కులను హరిస్తున్న కేసీఆర్: గోనే ప్రకాష్
సంతోష జీవితంలో రాజీపడవద్దని గవర్నర్ అన్నారు. నిరాశ, నిస్పృహలతో జీవితాన్ని బాధమయం చేసుకోవద్దని, జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవాలని తెలిపారు. జీవితంలో చిన్న చిన్న సవరణలతో గొప్ప అవకాశాలను పొందవచ్చని, ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని ఏకాగ్రతతో సాధించాలని గవర్నర్ అన్నారు. జీవితంలో ఎప్పుడు గమనంలో ఉండాలని, ఒకేచోట ఉంటే అభివృద్ధి చెందలేమని గవర్నర్ తెలిపారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్యలు గవర్నర్ యొక్క ఆగమనం పట్ల వారి యొక్క సంతృప్తిని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
శ్రీ చైతన్య విద్యాసంస్థను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని తీసుకొస్తూ విద్యార్థులు విద్యయే కాకుండా విద్యతోపాటు రీసెర్చ్, స్పోర్ట్స్, కల్చరల్ ఆక్టివిటీస్ తో పాటు ఈ యొక్క విద్యాసంస్థలను త్వరలోనే ఉన్నత సాంకేతిక విద్యా సంస్థలు, యూనివర్సిటీగా చేయుటకు అంకితమై ఉన్నామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సాయి గీతిక, సీఈవో శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.