Telugu News

ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 సీట్లతో ఈ ఏడాది ప్రారంభం: మంత్రి

పాత కలెక్టరేట్ భవనంను పరిశీలించిన మంత్రి

0
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 సీట్లతో తరగతులు ప్రారంభం: మంత్రి
== పాత కలెక్టరేట్ భవనంను పరిశీలించిన మంత్రి
ఖమ్మం, జూన్ 28(విజయంన్యూస్):
 ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి 100 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పాత కలెక్టరేట్ భవనంలో ఈ సంవత్సర ప్రభుత్వ మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కలసి మంత్రి  కొనసాగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్‌ కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయని, అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసి తరగతులు నిర్వహిస్తామన్నారు.

తరగతి భవనాలు, అందులో సౌకర్యాలు, ప్రయోగశాలలు, అధ్యాపక బృందం, విద్యుత్, వివిధ విభాగాల ల్యాబ్ లు, తరగతి గదులు, లైబ్రరీ, టాయిలెట్స్, త్రాగునీరు, పార్కింగ్, గ్రీనరీ, ఇతర మౌళిక సదుపాయాలను కలియ తిరిగి  పరిశీలించారు. పాత కలెక్టరేట్ భవనం 5 ఎకరాలు, రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం 3 ఎకరాలు, మొత్తం 8 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వైద్య కళాశాల నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎదురుగా మెడికల్‌ కళాశాల, విద్యార్థులు, అధ్యాపకుల వసతి గృహాలు ఉండాల్సి ఉందని, అందుకోసం ప్రభుత్వం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న పాత కలెక్టరేట్ భవనం లో రూ. 9 కోట్లతో ఆధునీకరించి అక్కడ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కళాశాల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.166 కోట్లను మంజూరు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో వందసీట్లతో వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే అనుమతిస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఆదేశాలు జారీచేసిందని, దీంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రి వైద్య కళాశాలగా సేవలు అందించబోతోందన్నారు. ఇప్పటికే ఖమ్మం ఆసుపత్రిలో ఉన్న అధునాతన పరికరాలు, సౌకర్యాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని సరిహద్దు జిల్లాల నుంచి కూడా వైద్యం కోసం రోగులు వస్తున్నారని, దీంతో ఖమ్మం మెరుగైన వైద్యానికి కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందిందని, రానున్న రోజుల్లో ఖమ్మం వైద్య రంగానికి హబ్ గా నిలువనుందన్నారు. కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం ప్రకారం అనుమతి లభించిన దరిమిలా తరగతుల నిర్వహణకు సిద్దంగా ఉందన్నారు.      ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.