Telugu News

పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ : మంత్రి హరీశ్‌రావు

విజయం: పటాన్ చెరువు ,ప్రతినిధి

0

పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ : మంత్రి హరీశ్‌రావు

విజయం: పటాన్ చెరువు ,ప్రతినిధి

పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, చుట్టుపక్క ప్రాంతాల ప్రజల కోసం సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు సత్వరమే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం బీఆర్‌కే భవన్‌లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. రూ.150కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నందున అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి, త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు.

పారిశ్రామిక ప్రాంతంలో వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలను, వైద్య నిపుణులను ఏర్పాటు చేయాలన్నారు. వైద్యసేవలు పరిశ్రమల్లో పని చేసే కార్మికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు అందుతాయన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ దవాఖాన నిర్మాణ పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునికి వైద్యసేవల విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 20 ఆస్పత్రుల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు

రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టీమ్స్, నీలోఫర్ సహా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణలో రాజీపడకుండా పరిశ్రుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రి వ్యర్థ జలాలను శుద్ధి చేసి బయటకు వదలాలని సూచించారు. ఇందు కోసం ప్రభుత్వం ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

సుమారు 59.25 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు వైద్యాధికారులు మంత్రికి వివరించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వెంటనే ఏర్పాటు చేసే దిశగా పనులు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి టెక్నాలజీతో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారో పరిశీలించాలన్నారు. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఎక్కడైనా ట్రీట్మెంట్ ప్లాంట్లు పని చేస్తున్నయో పరిశీలించాలని, పనులు నాణ్యతలో రాజీ పడొద్దని చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్‌డీ గంగాధర్, టీఎస్ ఎంఎస్ఐ డీసీ ఎండీ చంద్ర శేఖర్‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, వాణిజ్య పన్నుల శాఖ అధికారి నీతుకుమారి ప్రసాద్, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

also read :- రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి పువ్వాడ..