Telugu News

రాయల’ దైర్యమేంటి..?

** బలం లేకున్నా ఎమ్మెల్సీ బరిలో ఎందుకు..?

0

‘రాయల’ దైర్యమేంటి..?
** బలం లేకున్నా ఎమ్మెల్సీ బరిలో ఎందుకు..?
** కాంగ్రెస్ కు అంతర్గత మిత్రడేవ్వరు..?
** మిత్రపక్షాలు కలిసి వస్తున్నాయా..?
** గెలుపుఖాయమేనా..? మేకపోతు గాంభీర్యమా..?
** భట్టి వ్యూహ్యమేంటి…?ఆగ్ర నేతల దారేటు..?
** ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో ఏం జరుగుతోంది…?
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
గెలిచేందుకు కావాల్సిన బలం లేదు..కానీ గెలుస్తారనే నమ్మకం మాత్రం బలంగా ఉంది.. అది ఎలా సాధ్యం..? కమ్యూనిస్టులు కలవనూలేదు.. కాంగ్రెస్ లో ముఖ్యనేతలు కనిపించనే కనిపించరు..? అయిన గెలుపుసాధ్యమేలా..? ఎన్నికలంటే ఒక్క ఓటు కూడా చాలా అవసరం.. అలాంటిది అధికారపార్టీకి అత్యధిక ప్రజాప్రతినిధులు ఉండగా కాంగ్రెస్ గెలుపు ఎలా సాధ్యం..? రాయల ధైర్యమేంటి..? ఆయనకు ఎవరైనా అంతర్గతంగా సహాకరిస్తున్నారా..? మిత్రపక్షాల మద్దతు కూడగడతున్నారా..? సహాకరిస్తున్న అంతర్గత మిత్రుడేవ్వరు..? గెలుపు ఖాయమేనా..? మేకపోతే గాంభీర్యమేనా..? ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరుగుతోంది..? ‘విజయం’ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. అందుకు గాను ఆయా పార్టీల నాయకులు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. . కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ నుంచి తాతామధుసూధన్, స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీధర్, సుధారాణి బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా పోటీ నేలకొంది. అయితే ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షం కావాల్సి ఉండగా , అందుకు పూర్తి బిన్నంగా జరుగుతోంది. అత్యధికంగా ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వైపు ఉండగా, అతితక్కువ ప్రజాప్రతినిధులు ఉన్నకాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఓట్లు ఉండగా, అందులో టీఆర్ఎస్ పార్టీకి 497, బీజేపీకి 1, కాంగ్రెస్ కు 116, సీపీఐకి 34, సీపీఎంకు 26, టీడీపీకి 19, న్యూడెమోక్రసీకి 15, స్వతంత్రులు 60 మంది ఉన్నారు. ఇందులో 53 మంది ఇతర పార్టీలు, స్వతంత్రులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా టీఆర్ఎస్ కు 550 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కు కేవలం 68 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇంత పెద్ద భారీ మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉంది. కానీ 68 ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసి సంచలనం సృష్టించారు. ఓడిపోయిన పర్వాలేదు ప్రతిపక్షంగా నామినేషన్ దాఖలు చేయాలనుకుంటే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ అక్కడ జరుగుతుంది మాత్రం అదికాదు.. అధికార పార్టీకి పట్టపగలే చెమటలు పట్టిస్తున్నట్లు తెలుస్తోంది.. అసలు ఎలా సాధ్యం..?
** కాంగ్రెస్ ముఖ్యనాయకులేక్కడ..?
కాంగ్రెస్ పార్టీకి సరైన క్రమంలో ఓట్లు లేకపోయినప్పటికి ఆ పార్టీ తరుపున నామినేషన్ వేసేందుకు నలుగురు నాయకులు పోటీ పడ్డారు. అందులో రాయల నాగేశ్వరరావుకు పార్టీ అదిష్టానం టిక్కెట్ ఖరారు చేసింది. అయితే రాయల నాగేశ్వరరావు స్వయనా మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి వర్గీయుడు. అలాగే మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ కి అత్యంత సన్నిహితుడే. ఇక రాయల నాగేశ్వరరావు స్వగ్రామం ముదిగొండ మండలం కావడం, ఆ మండలం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వంత నియోజకవర్గంలో ఉండటం ఫలితంగా భట్టి విక్రమార్కకు సన్నిహితుడిగానే మెలుగుతున్నారు. అయితే రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి నేటి వరకు భట్టి విక్రమార్క ఒక్కరే రాయలకు అండగా ఉంటున్నారే తప్ప రేణుకచౌదరి, సంభాని చంద్రశేఖర్ ఇప్పటి వరకు ప్రచారం చేసిన దాఖలాలు కనిపించలేదు. సంభాని చంద్రశేఖర్ స్వంత నియోజకవర్గం సత్తుపల్లిలో ఉన్న ఎంపీటీసీలను, కౌన్సిలర్లను కాంగ్రెస్ క్యాంప్ కు తరలించారు. అయితే క్యాంఫ్ కార్యాలయానికి ఈ ఇద్దరు నేతలు తిరిగి చూడలేదనే విమ్మర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికకు మరో నాలుగు రోజుల సమయం ఉండటంతో వారు క్యాంఫ్ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందా..? అంటే అందులో స్పష్టత లేదు. రాయల నాగేశ్వరరావుకు సపోర్టు చేస్తూ ఒక ప్రకటన చేయలేదు, కనీసం ఎన్నికల ప్రచారం కూడా చేసినట్లు కనిపించలేదు. మరీ వీరు ఇరువురు రాయల నాగేశ్వరరావును బలపరుస్తూన్నట్లేనా..?
** మిత్రపక్షాల దారేటు..?
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన బలం మిత్రపక్ష పార్టీలు.. ఎందుకంటే సీపీఐకి 34, సీపీఎంకు 26, టీడీపీకి 19, న్యూడెమోక్రసీకి 15, స్వతంత్రులు 60 ఉన్నాయి. వారందరు రాయల నాగేశ్వరావుకు మద్దతునిస్తే 154 ఓట్లు అవుతాయి. కానీ సీపీఐ పార్టీ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక సీపీఎం, టీడీపీ, న్యూడెమోక్రసీ పార్టీలు ఊగిసలాడుతున్నాయి. ఇప్పటి వరకు ఆయా పార్టీలకు సంబంధించిన హామి అటు టీఆర్ఎస్ కు , ఇటు కాంగ్రెస్ కు అందలేదు. ఓటు ఎటు వేస్తారో తెలియని పరిస్థితి ఉంది.
** భట్టి వ్యూహం ఫలిస్తుందా..?
కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన రాయల నాగేశ్వరరావు కు ముందు నుండి పూర్తి బాధ్యత మీదేసుకుని పనిచేస్తున్న నాయకుడు భట్టి విక్రమార్క. ఆయన సలహాల మేరకు రాయల నాగేశ్వరరావు అడుగులేస్తున్నారు. నామినేషన్ వేసి నాటి నుంచి క్యాంఫ్ చత్తీస్ గడ్ సరిహద్దులో ఏర్పాటు చూసే వరకు అంతా పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తన్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క రాజకీయ చాణిక్యుడు అనడంలో సందేహమే లేదు. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భట్టి విక్రమార్క పోటీ చేసినప్పుడు టీడీపీ పార్టీకి అద్బుతమైన బలమున్నప్పటికి, పోట్ల నాగేశ్వరరావుపై భట్టి విజయం సాధించారు. అదే విధంగా నేడు ఉన్న పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. భట్టి వ్యూహం చాలా పదునైనట్లుగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎలా పట్టుకోవాలనే విషయంలో భట్టి విక్రమార్కది అందిన చెయ్యి. అలాంటి వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. అందుకే భట్టి వ్యూహం ఫలించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
** ‘రాయల’ ధైర్యమేంటి..?
స్థానిక సంస్థల ఓట్లు పెద్దగా లేవు. అధికారం లేదు.. మిత్రపక్షాల నుంచి క్లారిటీ లేదు.. కానీ రాయల నాగేశ్వరరావు మాత్రం కచ్చితంగా గెలుస్తాననే దైర్యంగా ముందుకు సాగుతున్నారు.. అది ఎలా సాధ్యం అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకుల అండదండలతోనే రాయల నాగేశ్వరరావు ముందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. రాయల నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పాత మిత్రుల సంపూర్ణ సహాకారం ఉందని విశ్వసనీయ సమాచారం. రాయల నాగేశ్వరరావుతో కలిసి తిరిగి ఇతర పార్టీలలో కూడా కలిసి పనిచేసిన మిత్రుల సహాకారం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నాయకత్వం సహాకరిస్తారేమోననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. అలాగే రాయల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిచయం ఉన్న వ్యక్తి కావడం, సౌమ్యుడు, వివాహరహితుడు కావడం వల్ల తనకు ఓటర్లు సహాకరిస్తారేమోననే ఆలోచనలో కూడా రాయల నాగేశ్వరరావు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ కూడా కలిసివచ్చే అవకాశం ఉందని, అందుకేనేమో..? రాయల నాగేశ్వరరావు గెలుపుపై అంత ధీమాగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎదేమైనప్పటికి రాయల నాగేశ్వరరావు ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి అందర్ని ఆశ్ఛర్య పరిస్తే, ఆయన గెలిస్తే మాత్రం రాజకీయ చరిత్రలో ఇది ఒక మైలు రాయిగా రికార్డు కెక్కే అవకాశం ఉంది. చూద్దాం.. రాయల నాగేశ్వరరావు ధీమా సక్సెస్ అవుతుందా..? ఓటర్లు ప్రభుత్వ ఓటింగ్ వేస్తారా..? చూడాల్సిందే..?

also read :-తిరుపతి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. ముగ్గురికీ గాయాలు

 

 

please subscribe this channel smiling chaithu