Telugu News

ఎన్నికల క్రతువులో అధికార యంత్రాంగం

ఇప్పటికే మొదలైన పోస్టల్ బ్యాలెట్ ల పంపిణీ

0

ఎన్నికల క్రతువులో అధికార యంత్రాంగం
– కౌంటింగ్ కేంద్రానికి చేపట్టిన సన్నాహాలు
– కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ లో విస్తృత ఏర్పాట్లు
– ఇప్పటికే మొదలైన పోస్టల్ బ్యాలెట్ ల పంపిణీ
– 822 మంది వృద్ధులు, దివ్యాంగుల గుర్తింపు
– ఈవీఎం మిషన్ లపై శిక్షణకు
కసరత్తు
– 306 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
(హుజురాబాద్ ప్రత్యేక ప్రతినిధి-విజయం న్యూస్)

హుజురాబాద్ ఉప ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికల క్రతువును ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి.కర్ణన్ నేతృత్వంలో హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వృద్ధుల, దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియను చేపట్టిన అధికారులు తాజాగా కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు చేపడుతున్న సన్నాహక చర్యలపై ‘విజయం’ ప్రత్యేక కథనం ఇది…

ఈనెల 30వ తేదీన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధికారులు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆర్ వి.కర్ణన్ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలతోపాటు కౌంటింగ్ కేంద్రాలను ఎక్కడెక్కడ, ఎన్ని ఏర్పాటు చేయాలన్నది అధికారులతో సమీక్షించారు. ఎన్నికల సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్ లకు వివిధ వసతులు కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కళాశాల ప్రాంగణంలో షామియానాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి వసతితో పాటు వైద్య సిబ్బందిని, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

** పోస్టల్ బ్యాలెట్ ల పంపిణీకి చర్యలు…
హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వృద్ధులు దివ్యాంగులు ఉన్న నేపథ్యంలో వారికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పంపిణీ చేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను 80 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులను, పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సజావుగా ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ల పంపిణీ ప్రక్రియ విసృతంగా కొనసాగుతోంది.

** 822 పోస్టల్ బ్యాలెట్ ల గుర్తింపు…
హుజరాబాద్ నియోజకవర్గం మొత్తంగా 822 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికార యంత్రాంగం పంపిణీ చేస్తోంది ది హైదరాబాద్ మండల పరిధిలో 69 ఇది వయోవృద్ధుల ఓట్లు ఉండగా 54 దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నాయి. అదేవిధంగా ఇల్లంతకుంటలో 137 వృద్ధుల ఓట్లు మరో 88 దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా జమ్మికుంటలో 85 వృద్ధాప్య, 149 దివ్యాంగుల బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటితో పాటు ఉ వీణవంక మండలంలో 85 వృద్ధాప్య 165 దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా కమలాపూర్ మండల పరిధిలో 46 వృద్ధుల మరో 29 దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే నియోజకవర్గం పరిధిలో 422 వయోవృద్ధుల, 400 దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయన్న మాట.

** పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సైతం…
హుజరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణకు గానూ అధికారులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటును సైతం పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 306 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తయింది. మండలాల వారీగా తీసుకుంటే హుజరాబాద్ లో 79 పోలింగ్ కేంద్రాలు ఇల్లంతకుంటలో 29, జమ్మికుంటలో 78 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా వీణవంక మండలంలో 55, కమలాపూర్ మండల పరిధిలో 65 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తయింది. వెరసి 306 కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసినట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి దశకు చేరుకున్న తరుణంలో ఓటరన్న ఆశీస్సుల కోసం అభ్యర్థులు పడే తిప్పలే ఇక మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

** హుజూరాబాద్ నియోజకవర్గం లోని వయోవృద్ధ, దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ ల వివరాలు ఇలా ఉన్నాయి..
మండలం వృద్ధాప్య దివ్యాంగ
హుజురాబాద్. 69. 54
ఇల్లంతకుంట. 137. 88
జమ్మికుంట. 85. 149
వీణవంక ‌‌. 85. 169
కమలాపూర్. 46 . 29
—————–. ——–. ——–
మొత్తం. 422. 400
—————–. ———. ———