Telugu News

మూడు పార్టీలు.. ముమ్మర ప్రచారం…

రంజుగా మారిన రాజకీయాలు

0

మూడు పార్టీలు.. ముమ్మర ప్రచారం…
– బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ ల హోరాహోరి
– రంజుగా మారిన రాజకీయాలు
– ప్రచార పర్వంలో పోటాపోటీ
– ఎత్తులు పైయెత్తుల పటటోపం
– ‘త్రిముఖ బంధం’లో హుజురాబాద్

మట్టె రవీందర్
(హుజురాబాద్-విజయం ప్రత్యేక ప్రతినిధి)
హుజురాబాద్ ఉప ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. మూడు పార్టీలు.. ముమ్మర ప్రచారంగా.. ఇక్కడి రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రధాన పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ లు మరింతగా దూకుడు పెంచాయి. ప్రచార పర్వాన్ని, పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఒక విధంగా త్రిముఖ రాజకీయ బంధంలో హుజురాబాద్ చిక్కుకుపోయింది. ‘ఓట్ల కోసం ఫీట్లు’ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కేంద్ర స్థాయి నేతల నుండి గ్రామస్థాయి నాయకుల వరకు ప్రచారంలో లో పాల్గొన్న ఉండడం ఇందుకు నిదర్శనం. రసవత్తరంగా సాగుతున్న ఉప ఎన్నికల ప్రచారం ఇక్కడ నెలకొన్న తాజా రాజకీయ స్థితి గతులపై ‘విజయం’ ప్రత్యేక కథనం…

హుజరాబాద్ లో ఎన్నికల ప్రచారం మరింతగా వేడెక్కింది. అగ్రనేతలు, అమాత్యుల రాకయే ఇందుకు కారణం. జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయక గణమంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావడం ప్రచార హోరుకు ఊతమిస్తోంది. భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ లు తమతమ అభ్యర్థుల గెలుపు కోసం పరితపిస్తున్నాయి. ఇంటింటి ప్రచారం..బ్యాలెట్ నమూనాలతో ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులంతా ఫీట్లు పడుతున్నారు. ‘సంక్షేమ పథకాలే మా విజయానికి సోపానం అవుతాయన్న’ ధీమా అధికార టీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. అయితే బిజెపి, కాంగ్రెస్ లు మాత్రం టిఆర్ఎస్ పాలనలో సామాన్య ప్రజానీకానికి ఒరిగిందేమీ లేదని, సంక్షేమం అందని ద్రాక్షగా మిగిలిందని దుయ్యబడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమ మయ్యిందని, కనీసం నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు సైతం ఇచ్చే దిశగా కెసిఆర్ యత్నించడం లేదని ఆయా పార్టీలు వాపోతున్నాయి.

ప్రచారాస్త్రంగా ‘దళిత బంధు’..!
ఉప ఎన్నికల సంగ్రామంలో బంధు పథకం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దళిత బంధు పథకం నిలిచిపోవడానికి బిజెపి కుట్రపూరితంగా వ్యవహరించిందని టిఆర్ఎస్ ఘాటైన విమర్శలు చేస్తుండగా వీటిని బిజెపి, కాంగ్రెస్ లు తిప్పి కొడుతున్నాయి. ఎన్నికల కమిషన్ దళిత బందును నిలిపివేస్తే ఆ నెపాన్ని తమకు ఆపాదించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. పథకాన్ని ప్రవేశపెట్టడమే కాదు దాన్ని అమలు పరచడంలో విఫలమైనందునే దళితబంధు నిలిచిపోయిందని ఓటరు మహాశయులకు వివరిస్తున్నాయి. దీంతోపాటు గ్యాస్, పెట్రోల్ ధరలు టిఆర్ఎస్, బిజెపిలకు సవాలుగా మారాయి. గ్యాస్ సిలిండర్ భారం కేంద్రానిదేనని టిఆర్ఎస్ వాపోతుండగా.. పెట్రోల్ పాపం టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బిజెపి మండిపడుతోంది.

అన్ని సంక్షేమ పథకాల్లోనూ కేంద్రం వాటా..
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రతి సంక్షేమ పథకంలోనూ కేంద్రం వాటా ఉందని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివరిస్తోంది. ముఖ్యంగా రైతాంగానికి ప్రతి ఏటా అందిస్తున్న యూరియా డిపి లో 6 వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉందని ఆ పార్టీ చెబుతోంది. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాలు, హమాలీలకిచ్చే ఆర్థిక సాయంలోనూ కేంద్రం వాటా 90 శాతం ఉందంటోంది. చివరికి గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న కెసిఆర్ కిట్టు లోను 5 వేల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. అదేవిధంగా గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, సీసీ ఇ రోడ్ల లోనూ కేంద్ర వాటాలు ఉన్నాయని స్పష్టం చేస్తౌంది కూడా.

కాంగ్రెస్ ‘ప్రైవేటీకరణ’ మంత్రం…
సంక్షేమ పథకాలు చంద్రయాన్ అంటూ టిఆర్ఎస్ పథకాల్లో తమ వాటా ఉందంటూ బిజెపిలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఘాటైన స్థాయిలోనే విమర్శల దాడి చేస్తోంది. కేంద్రంలోని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమ పార్టీ హయాంలో స్థాపించిన కీలక పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు రంగానికి దారాదత్తం చేస్తున్నదని వాపోతోంది. అదేవిధంగా బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రతి పేదవాడి ఎకౌంట్లో 15 లక్షలు రూపాయలు వేస్తామని చెప్పిన మోడీ ఆనక ఆ హామీని తుంగలో తొక్కారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం సందర్భంగా దుయ్యబడుతుండడం విశేషం. మొత్తానికి పేదవాడి మీద అ దాడి జరుగుతోందని విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి రంగాలు నిర్వీర్యం అవుతున్నాయని చెబుతోంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు నిరుద్యోగ భృతిని అమలు చేయడం లేదని వివరిస్తున్నది. 2 వేల పింఛన్ కాదు 40 వేల వేతనాలు పొందే ఉద్యోగ అవకాశాలు కావాలని ప్రచారంలో పేర్కొంటోంది.

ప్రచార ‘స్టార్ డంలు’ వీరే..
హైదరాబాద్ ఉప ఎన్నికల పర్వంలో వివిధ పార్టీల నేతలు కీలకంగా మారారు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు ఎంపీ అరవింద్, మాజీ మంత్రి డీకే అరుణ, విజయశాంతి, బాబు మోహన్, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు ప్రచారానికి తోడు అవుతున్నారు. టిఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం మంత్రి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విస్తృతంగా ఫలితంగా కృషి చేస్తున్నారు. వీరితో పాటు పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు ప్రచారంలో పర్వంలో పాల్గొనడం విశేషం. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ నర్సింగరావు విజయం కోసం ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేత వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తానికి మూడు పార్టీలకు చెందిన అగ్ర నేతలంతా హుజురాబాద్ చుట్టూనే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్న దరిమిలా.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తికర రాజకీయాలు ఇక్కడ నెలకొన్నాయి.