Telugu News

‘క్రాస్ ఓటింగ్’ బెడదా తప్పదా….!?

కారు, కమలంలోనూ ఇదే ఆందోళన

0

  ‘క్రాస్ ఓటింగ్’ బెడదా తపదా….!?
– కారు, కమలంలోనూ ఇదే ఆందోళన
– తల్లకిందులైయ్యే గెలుపు ధీమా అంచనాలు
– డబ్బుల పంపిణీ తెచ్చిన తంటాలు
– పార్టీ కార్యాలయాల వద్ద బాధితుల పడిగాపులు
– ఇంకా సమసిపోని కాసుల రగడ
(హుజురాబాద్ నుండి విజయం ప్రత్యేక ప్రతినిధి):

హుజురాబాద్ ఉప ఎన్నికలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీల్లో ఈ బెడద స్పష్టంగా గోచరిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీలోనూ ఇదే తరహా ఆందోళన ప్రస్ఫుటమవుతోంది. ఇటీవల మారిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఈ క్రాస్ ఓటింగ్ కు దారితీశాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తారస్థాయిలో సాగుతున్న ఉప ఎన్నికలలో ఓటర్లు సహజంగానే క్రాస్ ఓటింగ్ వైపు మొగ్గు చూపుతారా.. లేదంటే ఏవైనా సాంకేతిక అంశాలు ఇందుకు దారితీసే అవకాశాలు ఉన్నాయా అన్నది తేటతెల్లం కానుంది. కొత్తగా క్రాస్ ఓటింగ్ అంశం అనేది తెరపైకి వచ్చిన దరిమిలా వివిధ పార్టీ అభ్యర్థులు నెలకొన్న ఆందోళన అనుమానాలపై విశ్లేషణాత్మక కథనం నేటి ‘విజయం’లో…

ఉప ఎన్నికల సంగ్రామం సందర్భంగా క్రాస్ ఓటింగ్ తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో ఓటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశాలు కొంతమేరకు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం కావడం ఇందుకు కారణం. ప్రధానంగా తీసుకుంటే టీఆర్ఎస్ గెలుపు ధీమాలో ఉంది. నిన్న మొన్నటి వరకు తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ ఈ సెగ్మెంట్ నుండి కారు గుర్తు పై గెలిచారు. దీంతో ఈసారి సైతం రాజేందర్ ఎన్నికల బరిలో ఉన్నందున చాలావరకు ఓటర్లు ఆయనది ఇదే గుర్తుగా భావించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత ఆరు పర్యాయాలు ఇదే కారు గుర్తుకు ఓటు వేసిన నేపథ్యంలో సహజంగానే ఓటర్లు ఈసారి సైతం రాజేందర్ ది కారు గుర్తుగా భావించి దానిపై ఓటేసి అవకాశాలున్నాయని అంటున్నారు.

కారు పార్టీలో ఎనలేని ధీమా…
ఒక్కో రాజకీయ పార్టీ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో ధీమాతో ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రోజులుగా ఈ ధీమా మరింత ఎక్కువైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈటెల రాజేందర్ కు పడే ఓట్లు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు వేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆరు పర్యాయాలుగా కారు పైన ఓటు వేయడానికి అలవాటుపడ్డ నియోజకవర్గ ప్రజలు సైతం అదే గుర్తుపై ఓటు వేస్తే అది వన్ సైడ్ పోలింగ్ కాక తప్పదని చెప్పొచ్చు.

కమలంలో అదే ధీమా..?

ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి చెప్పాలంటే బీజేపీ పార్టీ గురించి..హుజురాబాద్ లో అనేక దపాలుగా కమలం గుర్తు పోటీ చేసినప్పటికి చాలా తక్కువ ఓట్లు పోలైన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఈటెల బీజేపీలో చేరడంతో పూర్తిస్థాయి బరిలో నిలిసింది కమలం గుర్తు. ఈటేల రాజేందర్  రాకతో ఆ గుర్తుకు మరింత బలం చేకూరినట్లైందనే చెప్పాలి.కారు గుర్తను ఢికొట్టే స్థాయికి కమలం గుర్తు వెళ్ళింది. ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తున్నామని బీజేపీ అభ్యర్థి.. బీజేపీ నాయకులు పుల్ ధీమాగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈటెల చర్మిష, అప్యాయత, అనురాగం, రాజీనామా చేశాడనే  కొంత సానుభూతి,కరీంనగర్ జిల్లాలో పార్టీ బలంగా ఉండటం, కేంద్రంలో పార్టీ ప్రభుత్వంలో ఉండటం.. కేంద్ర సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉండటంతో ఈటెల తప్పక గెలుస్తాడనే ధీమా ఉన్నట్లు కన్పిస్తోంది. అందులో భాగంగానే డబ్బుల పంపకంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుని పంచినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ 6 వేల నుంచి 10వేల వరకు పంపిణి చేస్తున్నట్లు తెలుస్తుండగా బీజేపీ మాత్రం 1500కే పరిమితం అయినట్లు తెలుస్తోంది. గెలుపు ధీమా వల్లనే డబ్బులు పంచే విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారనేది కన్పిస్తుంది..

 


ఇంకా సడలని కాసుల రగడ…

ఎన్నికల నిర్వహణకు సమయం ఆసన్నం అవుతున్నప్పటికీ పలు మండలాల్లో ఇంకా కాసుల రగడ సమసిపోలేదని తెలుస్తోంది. రెండు ప్రధాన పార్టీల నాయకులు ఇటీవల డబ్బుల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు సైతం పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు పంపిణీ చేయలేదని సమాచారం. కొందరికి ఇచ్చి మరికొందరికి పంపిణీ చేయకపోవడంతో కొన్ని చోట్ల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి.‌ చివరికి రోడ్డుపైన నిరసనలు చేపట్టేలా చేశాయి. కాగా స్వయంగా స్వంత పార్టీ కార్యకర్తలే అలకబూని పార్టీ కార్యాలయాల వద్ద డబ్బుల కోసం పడిగాపులు కాసిన ఘటనలు శుక్రవారం ప్రత్యక్షంగా కానరావడం విశేషం. డబ్బులు ఇస్తామని చెప్పిన ఒకరిద్దరు నాయకులు పార్టీ కార్యాలయాలకు ముఖం చాటేయడంతో సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించి నిరీక్షించి వెనుదిరిగిపోయారని సమాచారం.

also read:- మరో 24గంటలే..?