Telugu News

మతతత్వ బిజెపిని ఓడించాలి

సిపిఐ (యం.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా

0

బిజెపి గెలిస్తే.. రాజ్యాంగం రద్దు 

– మతతత్వ బిజెపిని ఓడించాలి
– ఇండియా కూటమిని గెలిపించాలి
– సిపిఐ (యం.యల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా

(ఖమ్మం-విజయం న్యూస్):

 

పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని సిపిఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు.

గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నూనవత్ వీరునాయక్ తో కలిసి రమేష్ రాజా మాట్లాడారు. బిజెపి 400 సీట్లు గెలిపించాలని అడుగుతుందని, 2/3 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారని చెప్పారు. ఓటమి భయంతో మోదీ అసహనంతో మాట్లాడుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఆయనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్యామ్యాన్ని గౌరవించని పార్టీ బిజెపి అని అన్నారు. దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు మోదీ, బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్ర జేస్తోందని విమర్శించారు. మనుస్మృతిని అమలుచేయాలని చూస్తోందని, ప్రజల మధ్య చీలిక తీసుకోచ్చి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ: తుమ్మల నాగేశ్వరరావు 

10 ఏండ్లకాలంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేసిందని, దేశ సంపదను, సహజ వనరులను అదానీ అంబానీలకు దోచి పెట్టిందని తెలిపారు. అవినీతి, నిరుద్యోగం, ధరలు పెరిగిపోయాయని, సామాన్య ప్రజానీకం బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అణగారిన ప్రజలపై దాడులు పెరిగాయని, మహిళకు రక్షణ లేదని, సామాజిక న్యాయం ఎండమావిగా మారిందని చెప్పారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఆర్థిక సూచిలో 111 స్థానంలో భారత్ ఉందని, మోదీ పాలనలో 30 కోట్ల మంది నిరుపేదలు పెరిగారని, పేదరికం నుంచి విముక్తి కాలేదని తెలిపారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు, అదనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని, వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని, కోత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ప్రశ్నించే గొంతుక లను అణచివేశారని, ప్రతిపక్ష నాయకులపై ఎన్నికల సమయంలో కేసులు పెట్టి జైలులో పెట్టారని దుయ్యబుట్టారు.

ఇది కూడా చదవండి:- హలో ఖమ్మం.. జయం మనదే: వెంకటేష్

దేశంలో ఇండియా కూటమి ఏర్పాటులో సిపిఐ (యంయల్) లిబరేషన్ కీలకపాత్ర పోషించిందని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రజల హక్కులను కాపాడేందుకు ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 17 సీట్లలో ఇండియా కూటమి (కాంగ్రెస్) ను బలపరుస్తున్నామని తెలిపారు. ఫాసిస్టు శక్తులను ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బానోత్ శ్రీను, దిగజర్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.