అక్రమ వెంచర్లతో అమాయక ప్రజలు బలి
♦ వెంచర్లకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
♦ అక్రమ వెంచర్లకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు
♦ నోకిసులతోనే సరిపెట్టుకుంటున్న పంచాయతీ అధికారులు
ఇచ్చోడ, జనవరి 23 (విజయం న్యూస్) :
రియల్ ఎస్టేట్ పేరిట దోపిడీ జరుగుతోంది. అధికారులు, నాయకుల అండదండలతో ఇచ్చోడ మండలం అడేగామ (కే) గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. అడిగే వారు లేకపోవడంతో అడ్డగోలుగా ప్లాట్లను విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లో సాగే స్థిరాస్తి వ్యాపారం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లు ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. వెంచర్లకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు నోటీసులతో సరిపెడుతుండడంతో అక్రమ వెంచర్ దారుల పంట పండుతోంది. ప్రస్తుతం భూములు రూ. లక్షలు పలుకుతుండడంతో అక్రమ వెంచర్లకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అక్రమ వెంచర్లకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొని ప్లాట్లు చేసి ఎక్కువకు అమ్ముతున్నారు. భూమి మార్పిడి రుసుము చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో నెలకొల్పే వెంచర్ల విస్తీర్ణంలో పది శాతం గ్రామపంచాయతీల పేర రిజిస్ట్రేషన్ చేసి, ఆ వెంచర్లలో కనీస సౌకర్యాలు డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, విద్యుత్, రోడ్లు లాంటి వసతులు కల్పించిన తర్వాతే ఆ వెంచర్లకు అనుమతులు ఇవ్వాలి కానీ
ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్’ పుల్ జోష్.. సీఎం ఖుషి
ఇవేవీ లేకున్నా రియల్టర్లకు కొమ్ము కాస్తూ వారు ఇచ్చే డబ్బులకు ఆశపడి అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.రియల్టర్లు ప్లాట్లు అమ్ముకుని చేతులు దులుపేసుకోగా చివరకు అందులో ప్లాట్లు కొన్న అమాయక ప్రజలు బలవుతున్నారు. కష్టపడి కూడబెట్టుకున్న మధ్య తరగతి ప్రజలు మోసపోయాక లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.