Telugu News

హాస్టళ్లలో అరకొర తిండి ..పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం

ఆహారపట్టిక నుంచి ఈ ఏడాది మాంసం మాయం

0

హాస్టళ్లలో అరకొర తిండి ..పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం
ఆహారపట్టిక నుంచి ఈ ఏడాది మాంసం మాయం

అప్పట్లో వారానికి 5 రోజులు కోడిగుడ్లు… ఇప్పుడు

వారానికి  మూడే రోజులు 

** అల్పాహారం కూడా అంతంత మాత్రమే

(తిర్యాణి–విజయం న్యూస్)

2016 నుంచి తెలంగాణలోని ప్రభుత్వం ఆశ్రమ వసతిగృహాలు, గురుకులాల్లో సర్కారు ఆమోదించిన మెస్​ఛార్జీలే నేటికీ కొనసాగుతున్నాయి. దీంతో మూడు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికీ పూటకు రూ.10.55 అంటే మూడు పూటలకు కలిపి రూ.31.65 చొప్పున ఖర్చు చేస్తున్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకైతే రోజుకు రూ.36.22 మాత్రమే వెచ్చిస్తున్నారు.

ఇప్పటి మెనూ ప్రకారం.. ఒక్కో విద్యార్థికి వారానికి 70 గ్రాముల కోడిమాంసం, 21 గ్రాముల అటుకులు, మరో 14 గ్రాముల పుట్నాలు, 455 మి.లీ. పాలు మాత్రం దక్కుతున్నాయి. ప్రతి గురువారం ఉదయం ఇడ్లీ పెట్టాలి. 2016లో ఇడ్లీల తయారీకి ఆవిరి యంత్రాలు ఇచ్చారు. ఒక్కోదానికి రూ.5లక్షలు ఖర్చుచేశారు. నిర్వహణ లేక ఇవన్నీ ప్రస్తుతం మూలకు చేరాయి. మళ్లీ కొత్త యంత్రాల కోసం అధికారులు టెండర్‌ పిలుస్తున్నారు.

aslo read :-ఖమ్మం జిల్లా వాసికి పోలీస్ శాఖలో అరుదైన గౌరవం
రాష్ట్రవ్యాప్తంగా 326 ప్రభుత్వ వసతిగృహాల్లో ప్రస్తుతం 87,933 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా పాఠశాలల్లోనే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 18వేల విద్యార్థులు పౌష్టికాహారలోపంతో వయసుకు తగ్గట్టు ఎత్తు పెరగక, ఎత్తున్నా బరువు లేక, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా కట్టారు. 2019 ఆర్‌బీఎస్‌కే నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 11,174 మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అప్పట్లో వైద్యులు గుర్తించారు. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచే ఆర్‌బీఎస్‌కే వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి.

** మాంసం మాయం.. చికెనూ ఒక్కసారే..!

తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లోని 20 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, తక్కువ బరువు సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీరికి తప్పనిసరిగా బలవర్ధక ఆహారం అందించాలి. కానీ, అది అమలుకు నోచటం లేదు. ఆరేళ్లుగా మెస్‌ఛార్జీలు పెంచకపోవడంతో ఆహారపట్టిక నుంచి ఈ ఏడాది మాంసం(మటన్‌) మాయమైంది. అంతకు ముందు వారానికోసారి విద్యార్థులకు పెట్టేవారు. ప్రతి బుధ, ఆదివారాలు చికెన్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్క ఆదివారమే పెడుతున్నారు. వారానికి అయిదు రోజులపాటు కోడిగుడ్లు, అరటిపండ్లు అందించేవారు. ఇప్పుడు మూడు రోజులే ఇస్తున్నారు.