Telugu News

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట లక్షల వసూళ్లు.

ముగ్గురి అరెస్ట్‌.

0

ప్రభుత్వ ఉద్యోలోల పేరిట లక్షల వసూళ్లు.

ముగ్గురి అరెస్ట్‌.
పట్నా వ్యక్తితో కలిసి మోసాలు.
రాష్ట్రవ్యాప్తంగా 241 మంది బాధితులు!

నిందితుల (ముసుగులోని వ్యక్తులు) వివరాలు వెల్లడిస్తున్న పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి

వరంగల్‌: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా వందల మంది నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన కీలక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సోమవారం కమిషనరేట్‌లో సీపీ తరుణ్‌జోషి ఈ వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన చల్లా వినయ్‌పాల్‌రెడ్డి, జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లికి చెందిన పోరిక అనసూయ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన లావుఢ్యా నవీన్‌సాకేత్‌లు పట్నాకు చెందిన రాజ్‌ కేపీ సిన్హాతో కలిసి ఈ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

పలు జిల్లాల్లో 241 మంది నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.3-10 లక్షల వరకూ వసూలు చేసినట్లు తెలిపారు. వీరి మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా 34 కేసులు నమోదయ్యాయన్నారు. రాజ్‌ కేపీ సిన్హా దిల్లీలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా సుమారు రెండు వేల మంది నిరుద్యోగులను ఇలా మోసం చేసినట్లు సీపీ అనుమానం వ్యక్తంచేశారు. దిల్లీ పరిసర ప్రాంతాల్లో అతడిపై పలు కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల నుంచి రూ.21.70 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

also read :- ఆటో డ్రైవర్‌ ఆహ్వానం.. ఆటోలో ఇంటికెళ్లి భోజనం చేసిన సీఎం