Telugu News

ఖమ్మంలో 19న సీపీఎం భవన్ ప్రారంభోత్సవం

ప్రారంభకులు కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా టీచర్

0

ఖమ్మంలో 19న సత్తెనపల్లి భవన్ ప్రారంభోత్సవం

* ప్రారంభకులు కేరళ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా టీచర్
* ముఖ్య అతిథి సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
* రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు – ప్రదర్శన
* ఖమ్మం హవేలీ అభివృద్ధిలో సీపీఐ (ఎం) కీలకపాత్ర
* సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

 (ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):
ఖమ్మం ఖానాపురం హవేలీ ప్రాంత అభివృద్ధిలో సీపీఐ (ఎం) కీలక భూమిక పోషించిందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లో విలీనానికి ముందు దాదాపు 20 ఏళ్ల పాటు హవేలీ సర్పంచ్, ఎంపీటీసి పాలనా బాధ్యతలను నిర్వహించిన సీపీఐ (ఎం) హయాంలో ఆ ప్రాంతం ప్రగతి పథంలో నడిచిందన్నారు. అటువంటి సీపీఐ (ఎం) హవేలీ కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి చెందిన పోరాట యోధుడు సత్తెనపల్లి రామకృష్ణ పేరుతో స్థానిక ఇందిరానగర్ సెంటర్లో నిర్మించిన సీపీఐ (ఎం) ఖానాపురం హవేలీ కమిటీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ భవనాన్ని కేరళ రాష్ట్ర శాసనసభ్యులు , ఆ రాష్ట్ర మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ టీచర్ ప్రారంభిస్తారని తెలిపారు.‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు హాజరవుతారని వివరించారు. ఆఫీస్ పక్కనే ఉన్న వినియోగదారుల ఫోరం స్థలంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

* సీపీఐ (ఎం) హయాంలో కార్పొరేషన్ కు దీటుగా హవేలీ అభివృద్ధి
సీపీఐ (ఎం) హయాంలో కార్పొరేషన్ కు దీటుగా ఖానాపురం హవేలీ ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు. పార్టీ ప్రస్తుత జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలుగా ఉన్న బుగ్గవీటి సరళ ఆనాడు సర్పంచ్ గా ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. సీపీఐ (ఎం) పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంత పేదలకు ఇళ్ల స్థలాలు సమకూరాయని తెలిపారు. ఫ్లోరైడ్ రహిత మంచినీటి సరఫరా ప్రారంభమైందన్నారు. రస్తోగినగర్, వేణుగోపాల్ నగర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందన్నారు. వైయస్సార్ నగర్ స్థలాలు కూడా నాడు సీపీఐ (ఎం) చేసిన పోరాట ఫలితంగానే సిద్ధించాయని పేర్కొన్నారు. హవేలీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల కాలనీలు కూడా తమ పోరాట ఫలితంగానే ఏర్పడ్డాయని, ఈ పోరులో భాగంగా 250 మందికి పైగా సీపీఐ (ఎం) కార్యకర్తలు అరెస్టై జైలు పాలయ్యారని తెలిపారు. ఖమ్మం నగరానికి తలమానికంగా ఉన్న అపార్ట్మెంట్ నిర్మాణాలు కూడా హవేలీ ప్రాంతం నుంచే ప్రారంభమయ్యాయని అన్నారు. సిసి రోడ్లు, లింకు రోడ్ లు ఇలా అనేకం హవేలీ ప్రాంతంలొ సీపీఐ (ఎం) కృషి ఫలితంగా ఏర్పడ్డాయని అన్నారు. ఖమ్మం నగరానికి తలమానికంగా హవేలీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే దాంట్లో సిపిఎం పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు.

* అకడమిక్ గ్రంథాలయం… వైద్య శిబిరం
సీపీఐ (ఎం) హవేలీ కార్యాలయం కేవలం పార్టీ కార్యకలాపాలకే కాకుండా కార్యాలయంలో అకాడమిక్ గ్రంథాలయంతో పాటు ప్రతినెలా ఓ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో జిల్లాలో ఆరు మెడికల్ క్యాంపులు నడుస్తున్నాయని, ఏడో క్యాంపు హవేలీ కార్యాలయంలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా రూ.3000 విలువచేసే మందులను రూ.100కు అందిస్తామని తెలిపారు. సత్తెనపల్లి భవన్ నిర్మాణానికి కృషిచేసిన సీపీఐ (ఎం) జిల్లా నాయకులు బుగ్గ వీటి సరళ, డి. తిరుపతిరావు, మిగిలిన నాయకులను నున్నా ప్రత్యేకంగా అభినందించారు.

* సన్నరకం వడ్లకే రూ.500 బోనస్ సరికాదు..
సన్న రకం ధాన్యానికే రూ.500 బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సరికాదన్నారు. దాదాపు 80 శాతం ధాన్యం దొడ్డు రకాలే ఉంటాయని అన్నారు. ఏ రకమైన ధాన్యమైనా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షానికి దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఆదాయం పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. సామాన్య ప్రజలపై భారం వేసే చర్యలు సరికాదన్నారు. సంపద సృష్టించి ప్రజలకు ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి తప్ప ప్రజలపై భారం వేసే దిశగా ఆలోచన చేయడం సరికాదని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గ వీటి సరళ, వై. విక్రమ్, హవేలీ కార్యదర్శి తిరుపతిరావు పాల్గొన్నారు.