ఖమ్మంపొలిటికల్ లో ఇదేమీ విచిత్రమో..?
== జిల్లా ఉద్దండులకు నో టిక్కెట్
== తుమ్మల, జలగంకు మొండిచెయ్యి
== బీజేపీ వైపు జలగం చూపు
== కాంగ్రెస్ లోకి వెళ్లాలని తుమ్మలపై ఒత్తిడి
== మౌనం వహిస్తున్న ఇద్దరు బడా నేతలు
== ఖమ్మం రూరల్ లో అత్యవసర సమావేశన తుమ్మల వర్గీయులు
== హైదరాబాద్ నుంచి కొత్తగూడెం బయలుదేరనున్న జలగం
== రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కీలక నాయకులు, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ఉద్దండులు.. అభివద్ది ప్రధాతగా పేరుగాంచి, అనేక దఫాలుగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒకరైతే, మరోకరు ఖమ్మం జిల్లా పేరు ఖండాంతరాలను దాటించిన మరో మహానాయకుడి కుమారుడు.. సీనియర్ ఎమ్మెల్యేలే. అంతే కాదు ఇద్దరు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన వారే కావడం, సత్తుపల్లి శాసనసభ్యులుగా పనిచేసినవారు, ఆ ఇద్దరు దశాబ్దం పాటు వేరువేరు పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ పడిన వారే. ఇద్దరికి ఖమ్మం జిల్లాలో జనబలం ఉంది. రాజకీయాలను శాసించే స్థాయి కల్గిన నాయకులు. అలాంటి ఇద్దరు బడా నేతలను సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారు. వారికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది. అంతే కాదు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జనబలం కల్గిన నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకుడు కావడం గమనర్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై..?
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి సంచలన ప్రకటన చేసింది.. ఎవరు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కేవలం 7స్థానాల్లో మార్పులు జరగ్గా, 4 స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టారు. అయితే రాష్ట్రంలోనే అత్యంత కీలకంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలను ప్రకటించడం జరిగింది. అందులో వైరా నియోజకవర్గంను మాత్రమే మార్చిన సీఎం కేసీఆర్ మిగిలిన 9 స్థానాల్లో సిట్టింగ్ లకే టిక్కెట్లను ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు టిక్కెట్ అశీస్తూ పార్టీలో కొనసాగిన సీనియర్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావ్ లకు సీఎం కేసీఆర్ మొండిచెయ్యి చూపించారు. పాలేరు నియోజకవర్గ టిక్కెట్ ను ఆశించిన తుమ్మల నాగేశ్వరావు, కొత్తగూడెం టిక్కెట్ ఆశీంచిన జలగం వెంకట్రావ్ కు టిక్కెట్ల విషయంలో భంగపాటు తప్పలేదు. సోమవారం ప్రకటించిన టిక్కెట్ల జాబితాలో వారి పేర్లు రాలేదు. అంతేకాకుండా కనీసం వారి గురించి పట్టించుకోకపోవడం గమనర్హం.
== తుమ్మల దారేటు..?
సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ మరోసారి నిరాశపరిచారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావును పిలిచి పార్టీలో చేర్చుకున్న సీఎం కేసీఆర్, ఆ తరువాత మంత్రి పదవిని అందించి, పాలేరు ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చి గెలిపించే విధంగా ప్రయత్నం చేశారు. కేబినెట్ లో సీఎం తరువాత సీఎం అన్నంతగా సమప్రాతినిధ్యం కల్పించిన సీఎం కేసీఆర్, 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత తుమ్మల నాగేశ్వరరావు ఓటమిని తట్టుకోలేకపోయారు. ఆయనను మన పార్టీ వారే ఓడించారని బహిరంగంగా చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత పక్కన పెట్టుకుని తిరిగారు. అయితే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తరువాత మారిన రాజకీయ పరిణామాలు తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ కు దూరం చేసేలా కనిపించాయి.
ఇది కూడా చదవండి: మట్టాదయానంద్ కు బిగ్ షాక్
తుమ్మల సంగతి నేను చూసుకుంటాను, సమ ప్రాథాన్యత కల్పిస్తాను అంటూ నాన్చుకుంటూ ఊరించుకుంటూ వచ్చిన సీఎం కేసీఆర్ ఆ తరువాత ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఇదిగో, అదిగో అంటూ ఊరించారే తప్ప అవకాశం కల్పించలేదు. ఈ సందర్భంలో పార్టీ మారతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ ప్రచారాలను ఖండించుకుంటూ వచ్చాడు. పార్టీ మారే యోచనలేదని, సీఎం కేసీఆర్ తోనే ఉంటానని చెప్పారు. అలాంటి తుమ్మల నాగేశ్వరరావును సీఎం కేసీఆర్ మర్చిపోయారు. కనీసం పట్టించుకోలేదు. సీట్ల కేటాయింపు విషయంలో తనతో చర్చించకుండానే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. జిల్లా నేతలు ఆయన ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన సంగతి నేను చూసుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ కీలక నేతకు టికెట్ నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది . పైగా గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తుమ్మల వర్గీయులు రగిలి పోతున్నారు. తమకు అవమానం జరిగిన తర్వాత గులాబీ పార్టీలో ఎందుకు ఉండాలని ఆయనపై వత్తిడి తెస్తున్నారు. పార్టీ ఏదైనా ఎట్టి పరిస్థితిల్లో పాలేరు నుంచి పోటీచేసిన సత్తా చాటాలని కోరుతున్నారు. దీంతో ఆయన తన ముఖ్య అనుచరులతో హైద్రాబాద్ లోని తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జిల్లా నేతలే కాకుండా ఆయనకు స్నేహితులుగా ఉన్న పలువురు ముఖ్యనేతలు హాజరైనట్లు సమాచారం. దీనిలో వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా తుమ్మల ఆలోచనలు చేస్తున్నారని సమాచారం. జిల్లా ఎన్నికల భద్యతలను తీసుకుంటే ప్రయోజనం లేకపోగా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుందని తుమ్మలను ఆయన అనుచరులు హెచ్చరిస్తున్నారు … 2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమికి కారణాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకున్నప్పటికీ అదిజరగలేదు …పైగా సీనియర్ నేతకు అవమానం జరిగినట్లుగా భావిస్తున్నారు ..ఫలితంగా తుమ్మల అడుగులపై ఆసక్తి నెలకొన్నది …
== తుమ్మలపై తీవ్ర ఒత్తిడి
తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలని ఆయన అనుచరులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్ల తెలుస్తోంది. టిక్కెట్ రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న తుమ్మల అనుచరులు, అభిమానులు హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయన్ను కలిసి తాడోపేడో తెల్చుకుందామని బయలుదేరి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు తుమ్మలను కలిసి తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.. అలాగే పాలేరు నియోజకవర్గానికి చెందిన తుమ్మల వర్గీయులు అత్యవసర సమావేశం నిర్వహించగా, సుమారు 500మందికి పైగా హాజరైయ్యారు.
ఇది కూడ చదవండి: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పువ్వాళ్ళ
అందరు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని లేకుంటే తలోదారి చూసుకోవాల్సి వస్తుందని మాట్లాడినట్లుగా తెలుస్తోంది.. ఇంకా నాన్చుడు దోరణి పనికిరాదని తెల్చిచెప్పినట్లుగా సమాచారం. అయితే నాయకులు మాత్రం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
== జలగం దారేటు..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు పరువు నిలబెట్టిన నాయకుడు జలగం వెంకట్రావ్. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడైన జలగం వెంకట్రావ్ సత్తుపల్లి, కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేశారు. తండ్రితో పాటు కొడుకు కూడా జిల్లాలో మంచి పేరు ఉంది. ఇప్పటికి జలగం కుటుంబం అంటే జిల్లా ప్రజలకు ఎనలేని గౌరవం ఉంటుంది. అందులో భాగంగానే 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకవిధమైన ఫలితాలు వస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన జలగం వెంకట్రావ్ విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన ఒక్కరు మినహా ఎవరికి డిపాజిట్లు దక్కలేదు. దీంతో జలగం వెంకట్రావ్ కు మంత్రి పదవి ఖాయం అని అనుకున్నారు. కానీ కులప్రాతినిధ్యంలో తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవిని ఇవ్వాల్సి వచ్చింది.. అప్పుడు అవమానంగా భావించిన జలగం వెంకట్రావ్ కు మంత్రి హారీష్ రావు నచ్చజెప్పారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయగా స్వల్ప తేడాతో ఓటమి చెందారు. వెంటనే హైకోర్టును ఆశ్రయించిన జలగం వెంకట్రావ్ కు నాలుగున్నరేళ్ల తరువాత అనుకూల తీర్పు వచ్చిన నిరాశగానే మిగిలింది.
ఇది కూడా చదవండి: హరిప్రియకు టిక్కెట్.. పెదవి విరుస్తున్న అసంతృప్తి వాదులు
అయితే వనమా వెంకటేశ్వరరావు పార్టీలో చేరిన అనంతరం వెంకట్రావ్ ను పార్టీలో పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. పార్టీ అనేక రకాలుగా అవమానాలకు గురిచేసింది. అయినప్పటికి పార్టీని అంటిబెట్టుకున్న జలగం వెంకట్రావ్ కు సీఎం కేసీఆర్ టిక్కెట్ విషయంలో మొండి చెయ్యి చూపించారు. దీంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని, తమ ప్రతాపాన్ని నిరూపించాల్సిన అవసరం ఎంతైన ఉందని జలగం వెంకట్రావ్ పై అభిమానులు, అనుచరులు ఒత్తిడి తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉండగా బుధవారం ఉదయం నాటికి ఆయన కొత్తగూడెం చేరుకుని కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే కార్యకర్తలందరు కాంగ్రెస్ కు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ఆయన ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాల్సిందే..?
== బీజేపీ కా..? కాంగ్రెస్ కా..?
కొత్తగూడెం నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయాలని భావించిన జలగం వెంకట్రావ్ కు బీఆర్ఎస్ టిక్కెట్ రాకపోవడంతో ఆయన మరో దారి చూసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన అనచురులందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చెబుతుండగా, ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు జలగం వెంకట్రావ్ కు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తో పాటు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని, ప్రభుత్వం వస్తే మంత్రి పదవి ఇస్తామని హామినిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జలగం వెంకట్రావ్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
== రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిక్కెట్లు దక్కని నాయకులను బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ మంత్రి హారీష్ రావుకు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావ్ లతో పాటు భద్రాచలంలోని బుచ్చయ్య, వైరాలో రాములు నాయక్ లతో మాట్లాడి సర్ది చెప్పాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రంగంలోకి దిగిన మంత్రి హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావ్, బుచ్చయ్యలతో పోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎంపీ సీటు ,జిల్లా బాధ్యతల ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది. తుమ్మలకు ఎంపీ సీటు, జలగం వెంకట్రావ్ కు ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తామని, బుచ్చయ్య కార్పోరేషన్ చైర్మన్ లేదంటే జడ్పీచైర్మన్ అవకాశం కల్పిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. రాములు నాయక్ కు మంచి పదవి ఇస్తూనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనేక అవమానాలు, మాటలను ఎదుర్కోన్న నాయకులు కేసీఆర్ మాటలు నమ్మడానికి వీల్లేదని అందువల్ల పోటీచేయడంపై వెనక్కు తగ్గవద్దని డిమాండ్ చేస్తున్నట్లు తెలస్తోంది.