జీవో 317 తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంః ఆప్ నేత ఇందిరాశోభన్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలలో గందరగోళం
జీవో 317 తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంః ఆప్ నేత ఇందిరాశోభన్
(హైదరాబాద్-విజయం న్యూస్)
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలలో గందరగోళం
స్థానికతకు సీనియారిటీ మెలిక
జీవో 317ను తెచ్చి కేసీఆర్ పచ్చి మోసం చేశారు
రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా కేటాయింపులు
జిల్లా, జోన్, మల్టీజోన్ కేటాయింపుల వల్ల స్థానికతకు ముప్పు
స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ , విడో ఉద్యోగులకు ప్రయారిటీ ఇవ్వాలి
జీవో 317ను అమలు చేస్తే నిరుద్యోగుల నోట్లో మట్టే
జీవో 317పై పునరాలోచన చేసి, సవరణలు చేయాలి
ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల కోసం తెచ్చిన జీవో 317 తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆప్ నేత ఇందిరాశోభన్ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు అనే అంశంపైనే తెలంగాణ ఉద్యమం జరిగిందనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జోన్ అంటేనే స్థానికత కానీ జీవో 317ను తెచ్చి ప్రభుత్వం స్థానికతకు అర్థం లేకుండా చేసిందన్నారు. స్థానికత నిర్ధారణ కోసం తీసుకువచ్చిన జీవో
317 అమలుకు సీనియారిటీతో మెలిక పెట్టడమంటే ఉద్యోగులు, ఉపధ్యాయులను కేసీఆర్ మోసం చేయడమేనన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాన్ లోకల్ అభ్యర్థులు 5 శాతం మించి ఉద్యోగాలు పొందడానికి అవకాశం లేనప్పటికీ, దానికి భిన్నంగా కేటాయింపులను జరుపుతున్నారని ఆరోపించారు.
also read;-మాస్క్ లేదా.. పైన్ కట్టు.. సిద్దిపేట జిల్లాలో పోలీసుల తనిఖీలు
రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జరుగుతున్న ఈ బదిలీలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. జిల్లా, జోన్, మల్టీజోన్ కేటాయింపులు చేయడం వల్ల అనేక మంది స్థానికత కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికే సీనియారిటీ జాబితాలు, కొత్త జిల్లాలకు పోస్టింగ్ లతో తమకు తీవ్ర నష్టం జరిగిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలకు దిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ , విడో ఉద్యోగుల అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకొని, వారిని ఎలా సర్దుబాటు చేస్తారో అధికారులు క్లారిటీ ఇవ్వాలని కోరారు. అసలు ఏ జిల్లాకు ఏ కేటగిరిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగులను అక్కడ సర్దుబాటు చేయాలి? ఖాళీలు ఎన్ని ఉన్నాయనే వివరాలను బయటపెట్టకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో గందరగోళానికి దారితీస్తోందని అన్నారు. తెలంగాణ ఏర్పడితే స్థానిక, స్థానికేతర ఉద్యమాలు తప్పవని ఉమ్మడి ఆంధ్ర పాలకులు హెచ్చరించిన వ్యాఖ్యలను ప్రస్తుత ప్రభుత్వం నిజం చేస్తున్నట్టుగా ఆమె విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవో 317కు సవరణలు చేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని ఇందిరాశోభన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.