Telugu News

క్షీరమా…కాలకోట విషమా..?

కల్తీ కమాల్ తో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు...

0
క్షీరమా కాలకోట విషమా..?
★రెచ్చిపోతున్న కల్తీ మాఫియా…
★కల్తీ కమాల్ తో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు…
★ప్రజా ఆరోగ్యాలను కాటేస్తున్న కల్తీ మాఫియా..
★కల్తీ జోరు పై చర్యలు తీసుకునే వారే లేరా…? 
(రిపోర్టర్ : చామంచుల క్రిష్ణ)
మణుగూరు సెప్టెంబర్ 12 (విజయం న్యూస్):
ప్రతి రోజు ఉదయం లేవగానే మొట్ట మొదట అవసరం వచ్చేవి పాలు. ఇంతగా వాడకం ఉండే పాలపై నియోజకవర్గ వ్యాప్తంగా కల్తీ మాఫియా కన్నేసింది. పాలకుండకు తూట్లు పొడుస్తూ ప్రజలు నిత్యం వాడే  పాలను,పెరుగును కల్తీ పాల తయారీ కోసం  కల్తీ పదార్థాలను వాడుతూ కల్తీ చేస్తున్నారు. ఈకేటుగాళ్లు పాల పౌడర్ ను వాడుతూ నిత్యం ప్రజల వినియోగించే పాలను కల్తీ చేసి  తమ వ్యాపారాలను దర్జాగా నిర్వహిస్తున్నారు.
పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా కల్తీ పాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతుంది. పాలపొడిలో  నీళ్లు కలిపి స్వచ్ఛమైన ఆవు పాలు, గేద పాలు అంటూ ప్రజలను నమ్మిస్తూ ప్రజా ఆరోగ్యాల తో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి లీటర్ పాలు 60 నుండి 70 రూపాయల వరకు ప్రజలు నమ్మించి స్వచ్ఛమైన పాలంటూ విక్రయాలు చేస్తూ రోజుకు వేలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. మణుగూరు ప్రాంతంలో పలు పాల కేంద్రాల దుకాణ యజమానులు విజయవాడ కేంద్రంగా పాలపొడి పాకెట్లను తెప్పించి స్వచ్ఛమైన పాలతో పాటు కల్తీ పౌడర్ ను  నీళ్లతో కలిపి  పాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజలకు నిత్యం అవసరమైన పాలను పెరుగును కూడా కల్తీ మయం చేస్తూ కేటుగాళ్లు తమ కల్తీ వ్యాపారాన్ని నిర్భయంగా కొనసాగిస్తున్నారు. పాలపొడి లో ఇస్టారీతిన నీళ్లను కలిపి ఇవే స్వచ్ఛమైన పాలంటూ విక్రయిస్తూ ప్రజా ఆరోగ్యలతో చెలగాటం ఆడుతున్నారు. ఏవి కల్తీపాలో ఏవి స్వచ్ఛమైన పాలో  తెల్లని వన్ని పాలే అని నమ్మి కొనుగోలు చేసిన ప్రజలు  కల్తీగాళ్ళ దందాతో  అనారోగ్యా పాలవుతున్నారు. ఈ పాలను తాగిన ప్రజలు చిన్నారులు రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి స్వచ్ఛమైన గేద పాలను తీసుకువచ్చామంటూ చెబుతూ ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పట్టణంలోని పలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని తమ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా మణుగూరు కేంద్రంగా జరుగుతున్న కల్తీ పాలు పెరుగు వ్యాపారాలపై జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దృష్టి కేంద్రీకరించి కల్తీగాళ్ళ మాయాజాలం పై విచారణ చేపట్టి కల్తీ కల్లోలం నుండి ప్రజలను ప్రజాఆరోగ్యాలను    రక్షించాలని పలువురు కోరుతున్నారు.