Telugu News

బైలుదేరుతుండు కేసీఆర్‌ .. బేజారవుతండ్రు ప్రతిపక్షం

తెలంగాణ వ్యాప్తంగా సీఎం టూర్

0

బైలుదేరిండు కేసీఆర్‌ .. బేజారవుతండ్రు ప్రతిపక్షం

== తెలంగాణ వ్యాప్తంగా సీఎం టూర్

== 15 నుంచే బీఆర్‌ఎస్‌ సమర శంఖారావం

==  17 రోజులు 42 సభల్లో హాజరుకానున్న సీఎం కేసీఆర్

==  నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో  నామినేషన్లు

(హైదరాబాద్ –విజయంన్యూస్)

 తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేయగా, అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు ఉంటాయని షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని పొందాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగులేస్తున్న ఈ సందర్భంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ పార్టీ మరింత జడ్ స్పీడ్ లో ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

ఇప్పటికే ఒక వైపు మంత్రి కేటీఆర్, మరో వైపు మంత్రి హరీష్ రావు జోడెద్దుల వలే తెలంగాణ రాష్ట్రంలో విస్తృత్తంగా పర్యటిస్తుండగా ఎన్నికల సమయం అసన్నమవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా పర్యటించేందుకు సిద్దమైయ్యారు. ఈనెల 15 నుంచి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ప్రకటించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాలో పర్యటించేందుకు సిద్దమైయ్యారు. అందులో భాగంగానే ఈనెల 15 నుంచి నవంబర్ 8 వరకు అన్ని జిల్లాలో బహిరంగ సభలను  ఏర్పాటు చేయగా, 9న  ఆయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్నారు. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ను  సీఎం కార్యాలయం నుంచి ప్రకటించారు.

== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభలకు హాజరుకానున్నారు. ఈనెల 27 మధ్యాహ్నం 1 నుంచి 2గంటల వరకు  పాలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం కేసీఆర్, నవంబర్ 1న మధ్యాహ్నం 1 నుంచి 2గంటల వరకు సత్తుపల్లి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఇల్లందులో పర్యటించనున్నారు. అలాగే నవంబర్ 5న మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖమ్మం నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

మొత్తం 10 నియోజకవర్గాలో 5 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అంతేకాకుండా మూడు జనరల్ స్థానాల్లో ఆయన పర్యటిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, అభ్యర్థులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు భారీ జనసమీకరణ పై ద్రుష్టి పెడుతున్నారు. గ్రామీణ స్థాయి నుంచి జనంను తరలించాలనే సంకల్పంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

== 17 రోజులు 42 నియోజకవర్గాలు

అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్‌ఎస్‌, ఇక అసలు సిసలైన పోరాటం మొదలుపెట్టనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణ గర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్ర్తాలుగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. కేసీఆర్‌ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్‌ అందజేసిన రోజు నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. స్వరాష్ట్రంలో జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రచార పర్వాన్ని హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభించినట్టే ఈ సారీ అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. తొలి విడతగా 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టే బాధ్యతను కేసీఆర్‌ నెత్తికెత్తుకున్నారు. 17 రోజుల షెడ్యూల్‌లో నవంబర్‌ 9న రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలుచేసి సభల్లో పాల్గొంటారు. 15వ తేదీన హుస్నాబాద్‌ సభతో ప్రచారం జోరు మొదలు కానున్నది. 15 నుంచి 18వ తేదీ వరకు 5 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. దసరా పండుగ తర్వాత 26 నుంచి తిరిగి ప్రచారం ప్రారంభిస్తారు.

ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా