Telugu News

నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..ఎవరంటే..?

ఏఐసీసి నుంచి భట్టి, పొంగులేటికి పిలుపు

0

నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..ఎవరంటే..?

==  ఏఐసీసి నుంచి భట్టి, పొంగులేటికి పిలుపు*

*@ బెంగళూరుకు రావాలని ఆదేశం*

*@ ఇరువురితో చర్చించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే*

*@ ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్న పొంగులేటి*

*@ మరికొద్దిసేపట్లో బెంగళూరుకు భట్టి విక్రమార్క*

*@ ఖమ్మం టికెట్ విషయంపై ఇరువురు నేతలతో చర్చించి అభ్యర్థిత్వం ఖరారు చేయనున్న సిఈసీ*

(పెండ్ర అంజయ్య, సీనియర్ జర్నలిస్ట్)

ఒకవైపు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు విడతల వారిగా జరుగుతుండగా, తెలుగు రాష్ట్రాలలో నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఈనెల 25 తారీఖున నామినేషన్ దాఖలకు గడువు ముగిస్తున్నాడు తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా మరో మూడు నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి.  సునాయాసంగా గెలిచే స్థానం కావడంతో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంకు ఆశావాహులు ఎక్కువగా ఉండగా, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు సామాజిక వర్గాల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో అధిష్టానం ఆ సీట్లను పెండింగ్ పెట్టింది. ఖమ్మం పార్లమెంట్ సీటు పై ఆ రెండు సీట్లు ఆధారపడి ఉండటంతో మూడు స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే ఖమ్మం పార్లమెంట్ కు డజన్ కొద్ది ఆశావాహులు ఉండటం, మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడటం, ఎవరికి వారు గట్టిగా ప్రయత్నించడంతో అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి కత్తిమీద సామైంది. ఎవర్ని ఎంపిక చేసిన మరోకరి నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని భావించిన అధిష్టానం టిక్కెట్ కేటాయింపులో ఆలస్యం చేస్తోంది. కర్ర విరగోద్దు..పాము చావోద్దు  అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారా..? అనే ఉత్కంఠ పెరిగిపోయింది. అంతేకాదు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం మొదలైంది. అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది.  అలాగే నామినేషన్ దాఖలు గడువు కూడా ముగించే సమయం దగ్గర పడటంతో అధిష్టానం చొరవ తీసుకున్నట్లే కనిపించింది. ఎవర్నో ఒకర్ని తెల్చేయాలని భావించిన అధిష్టానం సోమవారం మధ్యాహ్నం నాటికి అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించింది..

== రంగంలోకి అధ్యక్షుడు

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో నేడు ప్రకటన వెలవడం ఉంది. అభ్యర్థి ఎంపిక రోజురోజుకు ఆలస్యం అవుతున్న తరుణంలో ప్రజల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే అభ్యర్థి ఎంపికను సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కు  బాధ్యతను అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఖర్గే ఖమ్మం జిల్లా కు చెందిన అగ్రనేతలను బెంగుళూరు రావాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బెంగుళూరు వెళ్ళాల్సి ఉంది. అయితే ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించుక వస్తానని, అధిష్టానానిదే తుది నిర్ణయం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెల్చి చెప్పినట్లుగా సమాచారం. కాగా తన సోదరుడికి టిక్కెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే బెంగుళూరు వెళ్ళగా, తన భార్యకు లేదంటే పాత కాంగ్రెస్ వాళ్ళకు టిక్కెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న భట్టి విక్రమార్క ఈ రోజు బెంగుళూరు బయలుదేరారు. అయితే ఈ ఇద్దరు నేతలతో సమావేశం అయిన తరువాత మధ్యాహ్నం నాటికి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

== PPR or RRR.. టిక్కెట్ ఎవరికి..?

ఖమ్మం జిల్లా లో కీలక నేత గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి(PPR) కు టిక్కెట్ ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలోనే అత్యదిక మెజారిటీ తీసుకరావాలంటే ప్రసాద్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అతనికి కాకపోతే రామసహాయం రఘురాంరెడ్డి(RRR)కి టిక్కెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఆర్ఆర్ఆర్ కూడా నామినేషన్ పత్రాలను తయారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రచార సామాగ్రి కూడా సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కుల సమీకరణాల రిత్యా రెడ్డి సామాజిక వర్గానికి టిక్కెట్ వస్తుందా..? లేదంటే కమ్మ సామాజిక వర్గానికి టిక్కెట్ కేటాయింపు జరుగుతుందా..? అర్థం కావడం లేదు. కమ్మ సామాజిక వర్గానికి టిక్కెట్ కేటాయింపు జరిగితే అందులో ఎవరికి టిక్కెట్ ఇస్తారనే విషయంలో తర్జనభర్జన జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉండి పాలేరు టిక్కెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావు, పార్టీ జనరల్ సెక్రటరీ గా పని చేస్తున్న జెట్టి కుసుమ కుమార్, తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్, పోట్ల నాగేశ్వరరావు పోటీ పడుతుండగా, ఇటీవలే నిజామాబాద్ కు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, వీవీసీ రాజా పేరు తెరపైకి వచ్చింది. ఇందులో మండవ వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీ నినాదం కూడా తెరపైకి వచ్చింది. బీసీ నేతలకు టిక్కెట్ కేటాయింపు జరగలేదని అందుకే సీనియర్ నాయకుడు హనుమంతురావు, లేదంటే ఓయూ నేత లోకేష్ యాదవ్ కు టిక్కెట్ కేటాయించాలనే డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఎవరికి టిక్కెట్ కేటాయిస్తారా అనే విషయం పై ఈ రోజు బెంగుళూరు లో మల్లిఖార్జున ఖర్గే, జిల్లా నేతలతో చర్చించి ఫైనల్ చేయనున్నారు.