కష్టంతో కాదు ఇష్టంతో చదవితే విజయం మీదే
== యువతలో ఆత్మవిశ్వాసం చాలా అవసరం
== తనపై తనకు నమ్మకం కలగాలి
== యువతను ఉత్తేజ పరిచిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్థసారథి
== భక్తరామదాసు కళాక్షేత్రంలో గ్రూపు ఉద్యోగాలకు శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఈసీ
ఖమ్మంప్రతినిధి, జులై 26(విజయంన్యూస్)
కష్టంతో కాదు ఇష్టంతో చదివితే గ్రూప్ ఉద్యోగం సాధించటం సులభమే :: రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి.
కష్టంతో కాదు, ఇష్టంతో ప్రణాళికాబద్ధంగా చదివితే గ్రూప్ ఉద్యోగాలు సాధించటం చాలా సులభమేనని విశ్రాంత ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి అన్నారు. మంగళవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గ్రూప్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రేరణ తరగతులకు ముఖ్య అథితిగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో మంకీఫాక్స్ లక్షణాలు లేవు : డీఎంఅండ్ హెచ్వో
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా విధి నిర్వహణలో ఉంటూ, తన వంతు ఉడతా భక్తిగా అన్ని జిల్లాలను తిరిగి యువతకు తనదైన శైలిలో స్ఫూర్తినిస్తూ ఉద్యోగాలు పొందేందుకు ఆచరించాల్సిన పద్దతులు, సూచనలు, సలహాలు, పోటీ పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలో తెలియజేస్తూ యువతలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర జిల్లాలలో ఆయన ఉద్యోగార్థులకు ప్రేరణ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మంగళవారం ఖమ్మం జిల్లాలో గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగులకు శిక్షణ పొందుతున్న 600 కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఏర్పాటుచేసిన ప్రేరణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులలో ఆత్మసైర్యాన్ని, ప్రేరణను కల్పిస్తూ మెళకువలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ ఉద్యోగాలతో పాటు, పోలీస్, ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 8 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని యువత ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలన్న తపనతో, కసితో పట్టుదలతో చడవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి వారు కొలువులు సంపాదించేలా ఆయా శాఖల ద్వారా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నిష్ణాతులైన అధ్యాపకులు, నిపుణుల ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
తాను స్వయంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో తెలుగు మీడియంలోనే చదివి ఉద్యోగం సాధించి ఐఏఎస్ స్థాయికి చేరుకున్న స్వీయ అనుభవాన్ని అభ్యర్థులకు ఆయన తెలియజేశారు. ఉద్యోగంతో సమాజంలో గౌరవప్రదమైన స్థానం, గుర్తింపు వస్తుందని, ఆయన అన్నారు. ప్రతి అభ్యర్థి వద్దకు వెళ్లి అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారికి ప్రేరణ కల్పించారు. బంగారు తెలంగాణ సాధనకు యువత ముఖ్యమని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, అలాంటి యువత పరిపాలనా రంగంలో రాష్ట్రంలో మార్గ నిర్దేశకులుగా రావాలంటే మంచి ఉన్నత పదవులైన గ్రూప్ ఉద్యోగాలు పొందాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి : అరెంజ్ అలార్ట్ హెచ్చరిక
ఉద్యోగం సాధించేందుకు చదువు ఒక్కటే సరిపోదని ,పట్టుదల, కృషి, ప్రణాళిక కావాలని, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, ఎలాగైనా ఉద్యోగం సాధిస్తాం అనే దృఢ సంకల్పం ఉంటే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని ఆయన తెలిపారు. ఇందుకు అభ్యర్థులు ఇష్టంతో చదవాలని, “రీడింగ్, రికార్డ్, రివిజన్ “పద్ధతి అనుసరించాలని, 360 డిగ్రీల కోణంలో ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకోనెలా కృషి చేయాలని, అందుకు సరైన సమయ పాలన పాటిస్తూ సిలబస్ కు అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు. పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించుకోవాలని, పరీక్షలో ప్రతీ ప్రశ్న, ప్రతీ మార్కు కీలకమేనని, ఏకాగ్రతతో, స్థిరత్వంతో, విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ సిద్ధం కావాలని ఆయన సూచించారు. పరీక్షా సమయం దగ్గర పడుతున్నందున సెల్ ఫోన్ కు, సినిమాలకు, చాటింగ్ లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. బద్దకం, వాయిదా వేయడం, భయం, నిరాశ, నిందారోపణలు, మొహమాటం, ఆత్మ న్యూనతా విడనాడాలని ఆయన ఉద్భోదించారు. ఈ విడత గ్రూపు ఉద్యోగాల ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేయనుందని, ఇంటర్వ్యూ, సిఫారసులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నిరుపేద అభ్యర్థులు కూడా సులభంగా ఉద్యోగం పొందేందుకు ఒక మంచి అవకాశమని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా తను, తన కుటుంబం అభివృద్ధి చెందడమే కాక, ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాడని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరిలో తనకు తెలియని శక్తి, సామర్థ్యాలు ఎన్నో ఉంటాయని, వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత వస్తుందని, అందువల్ల అభ్యర్థులు నిరాశ చెందకుండా పట్టుదలతో చదివి, చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకొని, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. ఆత్మ విశ్వాసమే ఉద్యోగ సాధన కు తొలి మెట్టని, మీ భవిష్యత్తుకు మీరే మార్గ నిర్దేశకులని, ఏకాగ్రతతో చదివి సిలబస్ ను ఆకళింపు చేసుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్న ఖాళీలలో ఖమ్మం జిల్లా నుండి ఎక్కువమంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాలు సంపాదించి ఈ ప్రాంత ప్రతిష్టని పెంచాలన్నారు. మళ్లీ జిల్లాకు వస్తానని, ప్రభుత్వ కొలువులు సాధించిన విద్యార్థులతో మాట్లాడి వారికి సన్మానం చేస్తానని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి :- భద్రాచలం భవిష్యత్తేమిటి?
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఇది ఒక మారథాన్ ప్రయాణమని, ఒడిదుడుకులు వుంటాయని, సమర్థవంతంగా నడుచుకోవాలని అన్నారు. లక్ష్యం పై గురిపెట్టి, సాధనకు కృషి చేయాలని అన్నారు. గ్రూప్ వన్ పరీక్షల సన్నద్ధం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఉద్యోగార్థులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా యువతకు స్ఫూర్తి నిచ్చేందుకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలెక్టర్, మునిసిపల్ కమీషనర్ లు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్న్ సురభిలు స్వాగతం పలికి మొక్కలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్న్ సురభి, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి సత్యనారాయణ, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కృష్ణా నాయక్, బిసి స్టడీ సర్కిల్ ప్రత్యేక అధికారిణి శ్రీలత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.