Telugu News

పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా

రూ.31 లక్షల  దుర్వినియోగం చేసిన నేలకొండపల్లి పంచాయతీ కార్యదర్శి

0

పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా

== రూ.31 లక్షల  దుర్వినియోగం చేసిన నేలకొండపల్లి పంచాయతీ కార్యదర్శి

== పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎంపీడీవో

== కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

== ఎవరిదైనా పాత్ర  ఉందా..?పన్నులు వసూళ్లు చేసిన బిల్ బుక్స్ ఎక్కడివి..?

నేలకొండపల్లి, సెప్టెంబర్ 6(విజయంన్యూస్)

ఒక్క రూపాయి కాదు.. వంద రూపాయాలు కాదు.. ఏకంగా రూ.31 లక్షలు స్వాహా.. దుర్వినియోగం చేసిందేవ్వరో తెలుసా..? పంచాయతీ కార్యదర్శి.. వామ్మో అనుకోవద్దు. నిజమండి.. మేజర్ గ్రామ పంచాయతీ నిధులను ఇట్టే స్వాహా చేశాడు..వార్డు సభ్యులకు తెలిసి ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు.. చివరికి కటకటాల్లోకి వెళ్తున్నాడు.. ఈ సంఘటన ఎక్కడో జరగలేదు.. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మేజర్ పంచాయతీలో జరిగింది.. అయితే ఇంత పెద్ద మొత్తం నిధులను దుర్వినియోగం చేయడానికి సహాకరించిందేవరు..? ఒక్కడే చేశాడా..? అతినికి బుక్స్ ఎక్కడ నుంచి వచ్చాయి..? తెరవెనక ఎవరున్నారు..? అనే వివరాలు చూడాలంటే..?

ALLSO READ- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్

పూర్తి వివరాల్లోకి వెళ్తే  ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మేజర్ పంచాయతీ లో కార్యదర్శి దుర్వినియోగం కు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నేలకొండపల్లి మేజర్ పంచాయతీకి రామ్ నరేష్ 2019 నుంచి  మేజర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు.  ఈ ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగారు. ప్రస్తుతం బోదులబండ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. నేలకొండపల్లి పంచాయతీలో పని చేసిన కాలంలో ఇంటి పన్నులు ప్రజల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.31 లక్షలు పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా దుర్వినియోగం కు పాల్పడ్డారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మండల అధికారులు గత రెండు రోజుల క్రితం రామ్ నరేష్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

జిల్లా కలెక్టర్ (పంచాయతీ విభాగం) ఆదేశాల మేరకు ఎంపీడీఓ కె.జమలారెడ్డి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  కూసుమంచి సీఐ సతీష్ కేసు నమోదు చేశారు. ఈ విషయం పై జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఈ విషయం పై ఆరోపణలు ఎదుర్కుంటున్న కార్యదర్శి రామ్ నరేష్ ను వివరణ కోరగా…పంచాయతీలో లే అవుట్ స్థలాల రిజిస్ట్రేషన్లు, మురుగు కాలువ బాగు చేయటం, నర్సరీ ఏర్పాటు తదితర అభివృద్ధి పనుల కోసం వినియోగించినట్లు తెలిపారు. ఎలాంటి దుర్వినియోగంకు పాల్పడలేదని చెప్పుకొచ్చాడు.

ALLSO READ- టాస్ గెలిచిన శ్రీలంక.. బొలింగ్ పస్ట్

== పంచాయతీ జనరల్ ఫండ్ దుర్వినియోగం

పంచాయతీ కార్యదర్శి ప్రతి నెల వచ్చే జనరల్ పండ్స్ ను ఖర్చుల వివరాలను రికార్డులో చూపించలేకపోయాడు. ఇంటిపన్నులు, షాపు పన్నులు, ప్యాక్టరీల పన్నులు వసూళ్లు చేసిన పంచాయతీ కార్యదర్శి ఆ డబ్బులను లెక్కలు లేకుండా వినియోగించుకున్నాడు. ఫలితంగా ఆ డబ్బులకు సంబంధించిన వివరాలు ఎక్కడ రికార్డులో లేకుండా పోయింది. అలాగే లేఆవుట్  అనుమతుల విషయంలో పంచాయతీ కార్యదర్శి రియల్ వ్యాపారుల వద్ద నుంచి  భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కోక్క వెంచర్ వద్ద నుంచి సుమారు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు వెంచర్ ను భట్టి వసూల్ చేసినట్లు సమాచారం. కొన్ని వెంచర్లలో వార్డు నెంబర్ల పేర్లతో డబ్బులు వసూళ్లు చేసి ఆ వార్డు సభ్యులకు ఇవ్వకపోవడం, కొన్ని చోట్ల అధికారులకు ఇవ్వాలని డబ్బులు వసూళ్లు చేసి వాటిని పై అధికారులకు ఇవ్వకుండా తనే వాడుకున్నట్లుగా నేలకొండపల్లిలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటిపన్నులు వసూళ్లు చేసేందుకు ప్రత్యేకంగా డీపీఓ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా బుక్స్ తీసుకుని వచ్చి ఆ బిల్ బుక్ ద్వారా భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీ నుంచి ఉన్న బిల్ బుక్స్ కాకుండా స్వంతంగా అతని వద్ద ఉన్న బుక్స్ ద్వారా సుమారు మరో రూ.10లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బిల్ బుక్స్ అతను స్వంతంగా తయారు చేయించుకున్నాడా..? లేదంటే డీపీఓ ఆఫీసు నుంచి ఉద్యోగుల సహాకారంతో బిల్ బుక్స్ బయటకు వచ్చాయా..? తెలియాల్సి ఉంది.. ఈ కోణంలో మండలాధికారులు, జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి ఇంత పెద్ద మొత్తంలో పంచాయతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగానికి పాల్పడటం గమనర్హం.

ALLSO READ- ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. ప్రజలు, అభివృద్దే శాశ్వతం: తుమ్మల