Telugu News

ఖమ్మంలో ‘ప్రెస్ క్లబ్’ లొల్లి షూరు

ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు తప్పదా..?

0

ఖమ్మంలో ‘ప్రెస్ క్లబ్’ లొల్లి షూరు

==  వేరువేరుగా ప్రెస్ క్లబ్ కమిటీలను నియమించిన ఆయా సంఘాలు

== ఎన్నో ఏళ్లుగా పెరుగుతున్న లొల్లి

== ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు తప్పదా..?

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం ప్రెస్ క్లబ్ పంచాయతీ తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది.. ఏళ్ల తరబడి ఎన్నికలకు నోచుకోకుండా, నూతన కమిటీలు లేకుండా పెండింగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ కు ఇప్పుడు పోటీలు పడి ఆయా యూనియన్లు కమిటీలు వేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.. గతంలో జర్నలిస్టుల మధ్య అంతర్గతంగా ఉన్న ఈ ప్రెస్ క్లబ్ పంచాయతీ కాస్త ఇప్పుడు బహిర్గతమైంది.. ఉన్నట్లుండి ఒక్కరోజు వ్యవధిలోనే రెండు యూనియన్లకు ఏర్పాటు కావడంతో జర్నలిస్టుల మధ్య వర్గపోరు భగ్గుమన్నట్లే కనిపిస్తోంది.. అసలు ప్రెస్ క్లబ్ ఎవరిది..? ప్రెస్ క్లబ్ కమిటీ ఉండాలంటే నిబంధనలు ఎలా ఉంటాయి..?

ప్రెస్ క్లబ్ బాధ్యత ఎవరు నిర్వర్తించాలి.. కమిటీలో బాధ్యులుగా ఎవరు ఉండాలి..? ఎవరికి హక్కులుంటాయి..? అనే విషయాలపై కొంత మంది సీనియర్ పాత్రికేయులు వివరాలు వెల్లడిస్తున్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఎందుకు రెండు వర్గాలు ఏర్పడ్డాయి.. రెండు కమిటీలను ఎందుకు ప్రకటించారో తెలుసుకోవాలంటే ఈ దిగువ వార్తను చదవాల్సిందే..

ఖమ్మం పట్టణంలోని జర్నలిస్టులందరు కలిసి గత 20ఏళ్ల క్రితం ఒక పత్రిక జర్నలిస్ట్ కు ఓ నాయకుడికి జరిగిన సంఘటనలో ఆనాడు ఉన్న జర్నలిస్టులందరు ఐక్యమై నాయకుడిపై పోరాటం చేసి విజయం సాధించారు. అది చిన్న పంచాయతీ అయినప్పటికి జర్నలిస్టుల ఐక్యమత్యం ఆనాడు పార్టీలపై పై చెయ్యి సాధించేలా చేసింది. ఆనాడు వేరే సంఘాలు లేవు.. ఏపీడబ్ల్యూజే సంఘం మాత్రమే ఉండేది.  విలేకర్లు చాలా తక్కువ ఉన్నారు.. జిల్లాకు స్టాఫర్లు మాత్రమే ఉండేవారు.. అతితక్కువ మంది పనిచేశారు. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన జర్నలిస్ట్ సంఘం ఏర్పడింది. అయితే ఆ సంఘం మొదటి నుంచి ఆ పార్టీలకే పరిమితమైంది.. ఐజేయు సంఘంతో ఏనాడు పోటీ పడలేదు. కాగా ఆ తరువాత  ప్రస్తుతం విధుల్లో ఉన్న జిల్లా స్టాఫర్లు, పట్టణంలోని అన్ని విభాగాల జర్నలిస్టులతో, ఖమ్మం పట్టణంకు సమీపంలో మండలాల జర్నలిస్టులను పిలిచి మున్సిపల్ భవనంలో సమావేశం నిర్వహించి ఆనాడు తాత్కాలిక కమిటీని ఫామ్ చేశారు. అనంతరం 1997లో ఐక్యకమిటీని ఏర్పాటు చేశారు. అది కాస్తా 1998లో ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీగా నామకరణం చేసుకుని ఆనాడు ఎంపీగా ఉన్న తమ్మినేని వీరభద్రంతో మాట్లాడి ప్రెస్ క్లబ్ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో స్పందించిన తమ్మినేని వీరభద్రం ఎంపీ పండ్స్ నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయగా, స్థలం కోసం ఆనాటి కలెక్టర్ గిరిదర్ ను కలిసి జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తమ్మినేని వీరభద్రం మాటిచ్చారు. ప్రభుత్వం నుంచి స్థలం ఇస్తే నిర్మాణం చేసుకుంటామని కోరడంతో స్పందించిన కలెక్టర్ స్థలం చూపించి, ఆ స్థలం కేటాయించిందేకు కావాల్సిన నిబంధనలను జర్నలిస్ట్ కమిటీకి సూచించారు. అనంతరం బస్టాండ్ కు అతి దగ్గర్లో ఉన్న ఆర్అండ్ బీ గ్రెస్ హౌజ్ వద్ద స్థలాన్ని కేటాయించారు.  దీంతో ఆనాడు ఉన్న జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ నూతన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణం కావడం, ఆ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. కొద్ది సంవత్సరాల పాటు ఐక్యంగా ప్రెస్ క్లబ్ ను నడిపించారు. కాగా కొద్ది సంవత్సరాల తరువాత జర్నలిస్టుల మధ్య కొంత మనస్పర్థలు రావడంతో ప్రెస్ క్లబ్ వైపు చూసే పరిస్థితి లేకుండాపోయింది. కొంత మంది కమిటీ బాధ్యులు ఉన్నప్పటికి పెద్దగా పట్టించుకునే వారు కాదని పలువురు ఆభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో అల్లం నారాయణ నాయకత్వంలో టీజేఎఫ్ యూనియన్ రావడం, ఆ యూనియన్ తరుపున ఖమ్మంలో కొంత నాయకత్వం ఏర్పాటు కావడం, నూతన కమిటీ రావడం జరిగింది. ఈ సందర్భంలో ఒకానోక దశలో అన్ని యూనియన్ల బాధ్యులందరు కలిసి ప్రెస్ క్లబ్ పున:ప్రారంభించాలని అనుకుని పనులు చేసే క్రమంలో కొంత గ్యాఫ్ ఏర్పడింది. దీంతో మల్లి మొదటికి వచ్చిందనుకుంటున్న సందర్భంలో ఆనాడు కొంత మంది స్టాఫ్ రిపోర్టలు కల్పించుకుని ప్రెస్ క్లబ్ ను పున:ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ కు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. కాలక్రమేనా నడుస్తోంది. ఇటీవలే కొంత వరకు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ల సంఖ్య పెరిగింది. నిర్వాహణ బాగుండటం వల్ల ప్రెస్ మీట్లు పెరిగినట్లు పలువురు జర్నలిస్టులు చెబుతున్నారు.

== ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు ఐదేళ్లుగా ప్రయత్నాలు..?

ప్రెస్ క్లబ్ ను కొంత మంది ఒపెన్ చేయించారు కానీ ఆ క్లబ్ కు దశనిర్దేశం చేసేవారు కరువైయ్యారు. రెండు, మూడు యూనియన్ల బాధ్యులు వాళ్ల మీటింగ్ లను నిర్వహించుకోవడం వెళ్లిపోవడం మినహా ఏ రోజు ప్రెస్ క్లబ్ గురించి పట్టించుకోలేదనే విమ్మర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు జర్నలిస్టులు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమైయ్యాయి. ఒకరినోకరు నమ్మకపోవడం, జర్నలిస్టుల మద్య నమ్మకాలు లేకపోవడం, యూగో అనే ట్యాగ్ ఉండటంతో నూతన కమిటీ ఏర్పాటు జరగలేదు. దీంతో ప్రెస్ క్లబ్ కు ఇన్ చార్జ్ లను నియమించి ఆ ప్రెస్ క్లబ్ ను కొనసాగిస్తున్నారు.

== రెండు యూనియన్లకు రెండు కమిటీల ఏర్పాటు

ఏళ్ల తరబడి ప్రెస్ క్లబ్ ఏర్పాటు గురించి పట్టించుకుని యూనియన్ల బాధ్యులు ప్రస్తుతం కమిటీల పై కమిటీలు వేసుకుంటు పత్రిక ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇటీవలే టీజేఎఫ్ కు సంబంధించిన యూనియన్ నూతన ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయగా, రెండు రోజుల్లోనే ఐజేయు సంఘం వారు మరో ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏర్పాటు చేయడం గమనర్హం. అంతేకాకుండా బహిరంగంగా ప్రకటించుకున్న పరిస్థితి.. ఆ కమిటీ, ఈ కమిటీ కలిసి మంత్రులను, ఎంపీలను, అధికారులను కలుస్తున్నారు. అంత వరకు భాగానే ఉన్నా..? అసలు ప్రెస్ క్లబ్ ఎవరిది..? ఏదైనా ఒక్క సంఘానికి సంబంధించిందా..? ఒక వర్గానికి సంబంధించిందా..? అంటూ కొంత మంది న్యూట్రల్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడింది.

== ప్రెస్ క్లబ్ ఎవరిది..? దానికి కమిటీ బాధ్యులుగా ఎవరుండాలి..?

ప్రెస్ క్లబ్ అంటే అందరికి బాధ్యతను అందించి,పుచ్చుకునే కేంద్రం. జర్నలిస్టుల నివాస కేంద్రం.. అందరు ఆ నివాస కేంద్రంలోనే ఉంటారు. ప్రతి ఒక్క జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ కమిటీపై బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పత్రిక స్టాఫ్ రిపోర్టర్ కు, పట్టణంలో పనిచేసే జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది. కచ్చితంగా ఏదైనా పత్రికలో జర్నలిస్టుగా రెగ్యూలర్ వార్తలు రాస్తూ, పనిచేస్తు ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. ఈ కమిటీ బాధ్యుడికి అక్రిడేషన్ తో సంబంధం లేదు. ప్రభుత్వ గుర్తింపు లేదా రిజిస్ట్రర్డ్ గుర్తింపు కల్గిన పత్రిక ప్రతినిధులకు అవకాశం కల్పించేవారు. పత్రికల్లో మానేసిన, పత్రికల్లో తొలగించిన వారు కచ్చితంగా ప్రెస్ క్లబ్  పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.  గతంలో కూడా జర్నలిస్టులు అదే చేస్తుండేవారు. కానీ ఇప్పుడు కొత్త కమిటీలు ఎలా ఏర్పాటు జరిగాయో అందరికి తెలిసిందే..?

== అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా..? అసలు అక్రిడేషన్ ఎందుకు..?

గతంలో చాలా తక్కువ పత్రికలు ఉండేవి.. తక్కువ మంది జర్నలిస్టులు ఉండేవారు. కచ్చితంగా సంస్థ ఇచ్చిన ఐడీ కార్డు ఉండేది.. ఇప్పటిలా కాకుండా అప్పుడు సంస్థ ఐడీ కార్డు రావడానికి కూడా చాలా సమయం పట్టేది. అక్రిడేషన్ నాటి నుంచే ఉన్నప్పటికి అక్రిడేషన్లను పెద్దగా పరిగణంలోకి తీసుకునేవారు కాదు. జర్నలిస్ట్ గానే చూసేవారు. ఎక్కడ చూసిన మర్యాద ఉండేది. అయితే ఇప్పుడు సంస్థలు పెరిగిపోవడం, రిపోర్టర్లు పెరగడంతో ఎవరు జర్నలిస్టో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. అక్రిడేషన్లు సంతలో బ్యారంగా మారిపోయాయి. రూ.20వేలు కట్టిన వారికి, రూ.30 వేలు కట్టిన వారికి రెండు సంవత్సరాలు అంటూ వేలంపాట వేసి మరి అక్రిడేషన్లను సంస్థలు అమ్ముకున్నాయి.. ఈ సంగతి అన్ని యూనియన్ల జర్నలిస్టులకు తెలుసు. తద్వారా రియల్ ఎస్టేట్స్ లో పనిచేసేవారు, ప్రైవేట్ ఉద్యోగస్తుడు, పురుగుమందులు, విత్తనాల విక్రయదారులు, డబ్బులు చెల్లించి అక్రిడేషన్ పొందారు.. ఇందులో నియంత్రణ లేకుండా పోయింది. అలాగే నిజాయితీగా ఇప్పటికి జర్నలిస్టుగా పనిచేస్తున్న కొందరికి పత్రికలు మారడంతో వారికి అక్రిడేషన్ రాలేదు. 30ఏళ్ల అనుభవం కల్గి, నేటికి జర్నలిస్ట్ గా పనిచేసిన శనగపాటి మురళీ తన అక్రిడేషన్ కోసం ఒక చిన్న పాటి యుద్దమే చేయాల్సి వచ్చింది.. అయినప్పటికి ఇద్దరు జర్నలిస్టుల పైరవీతో ఆయనకు అక్రిడేషన్ వచ్చింది. అయితే నిజంగా జర్నలిస్టులు ఎవరో యూనియన్లు గుర్తించారా..? ఫీల్డ్ పై పనిచేస్తున్న జర్నలిస్టు ఎవరు..? పైసలతో అక్రిడేషన్ తెచ్చుకున్న జర్నలిస్టులేవ్వరో గుర్తించే వారేవ్వరైనా..? ఉన్నారా..? అంతటి అక్రమాలు జరుగుతున్న పట్టించుకుని యూనియన్లు, ఇప్పడు ప్రెస్ క్లబ్ కు మేమంటే మేమే బాధ్యులమంటూ కమిటీలు వేసుకుంటుంటే చూసేవారికి చిన్నచూపైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సీనియర్ జర్నలిస్టులు స్పందించి అందర్ని ఐక్యం చేసి ఒక ప్రెస్ క్లబ్ కు ఒక్కటే కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు. మరీ ఇప్పటికైనా  ఖమ్మం జిల్లా జర్నలిస్టులు మారతారా.?