ఆథ్యాత్మిక వైభవంగా రోటరీనగర్ ‘ధర్మశాస్త’
రోటరీనగర్ లో 10 ఏళ్లుగా మండలం రోజులపాటు అయ్యప్పలకు నిత్య అన్నదానం
ఆథ్యాత్మిక వైభవంగా రోటరీనగర్ ‘ధర్మశాస్త’
== రోటరీనగర్ లో 10 ఏళ్లుగా మండలం రోజులపాటు అయ్యప్పలకు నిత్య అన్నదానం
== ప్రతిరోజూ 1000 మంది స్వాములకు అన్నప్రసాద వితరణ
== అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి ప్రయత్నాలు
ఖమ్మం, నవంబర్ 8(విజయంన్యూస్):
అయ్యప్పమాలధారణ స్వాములకు నిత్యం అన్నదానమంటే మాటలా..? ఎంత ఖర్చుతో కూడిన విషయం.. అయినప్పటికి ధర్మశాస్త అన్నదానం ట్రస్ట్ నిత్యం అన్నదానం చేస్తోంది.. మండలి వరకు ప్రతిరోజు సుమారు 1000 మంది స్వాములకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు.. ఇప్పుడే కాదు.. గడిచిన 10ఏళ్లుగా అన్నదానం కొనసాగుతూనే ఉంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలోని రోటరీనగర్ రాధాకృష్ణాకాలనీలో 2012లో ధర్మశాస్త అన్నదానం ట్రస్ట్ ను స్థానిక భక్తులు ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ లో 90 మంది భక్తులు ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు ప్రతి ఏడాది మాలదారణలో ఉన్న అయ్యప్పస్వాములకు అన్నదానం చేస్తున్నారు. కార్తికమాసం నుంచి అయ్యప్పమాలదారణలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అప్పటి నుంచి మండలి వరకు అన్నదానం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి నుంచే కాకుండా 10ఏళ్ల నుంచి వీరు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
== ఆథ్యాత్మిక కేంద్రంగా రోటరీనగర్‌లో
ఖమ్మం నగరంలోని రోటరీనగర్ ఆథ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతుంది. ప్రత్యేకంగా 18 మెట్లతో ఏర్పాటు చేసిన అయ్యప్పపీఠం వేదికగా రోజూ ఆథ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తున్నది. ఉదయం నుంచి రాత్రి వరకు అయ్యప్పస్వాములు ప్రత్యేక భజనలు, కీర్తనలు, అయ్యప నామాస్మరణతో ఈ ప్రాంతమంతా ఆథ్యాత్మిక చింతనను చాటుతున్నది. కేరళకు చెందిన పెరికమన శ్రీనాధ్ స్వామి పర్యవేక్షణలో ఈ పీఠం వద్ద నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళ భక్తులు వంటల తయారీలో స్వచ్చందంగా తమ సహకారాన్ని అందిస్తున్నారు. ట్రస్ట్ చైర్మన్ మేకల హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి అట్లూరి మధు, కోశాధికారి టి.వి.పుల్లంరాజు ఆధ్వర్యంలో అన్నదాన ట్రస్ట్ ద్వారా అయ్యప్పలకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు.
== 10 ఏళ్లుగా మాలదారణ స్వాములకు సేవలు అందిస్తున్నాం : మేకల హనుమంతురావు, ట్రస్ట్ చైర్మన్
ధర్మశాస్త అన్నదానం ట్రస్ట్ ద్వారా అయ్యప్పలకు ప్రతియేటా మండలం రోజులపాటు అన్నదానం నిర్వహిస్తున్నాము. కన్నేస్వాములు మొదలుకొని గురుస్వాముల వరకు ఈసారి 1000 మందికి పైగా అన్నదానములో పాల్గొంటున్నారు. తమ ట్రస్ట్ కు చెందిన 90 మంది సభ్యుల సహకారంతో ప్రతియేటా అన్నదానం, ఇతర సేవలు చేస్తున్నాము. కన్నేస్వాములకు ఒక్కొక్కరికి శబరిమలై వెళ్లేందుకు రూ.1000లు అందిస్తున్నాము. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు కావాల్సిన పుస్తకాలు, ప్లేట్లు, బల్లలు వితరణ చేస్తున్నాము.
== అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నాము : అట్లూరి మధు, ప్రధాన కార్యదర్శి
రోటరీనగర్‌లో ధర్మశాస్త ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం చేస్తుండగా, అతి త్వరలోనే అయ్యప్ప ఆలయాన్ని నిర్మాణం పూర్తి చేయాలని కృషిచేస్తున్నాము. వివిధ రంగాలకు చెందిన భక్తులు తమ సహకారాన్ని అందించేందుకు ముందుకు వ
స్తున్నారు. ఆలయ నిర్మాణానికి కావాల్సిన భూమి కోసం విరాళాలు సేకరించడంతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతి చేస్తున్నాము. అవసరమైన స్ధలం దొరికిన వెంటనే నిర్మాణ పనులు మొదలుపెడతాం.
== నిత్య అన్నదానంకి విశేష స్పందన : ఊట్ల మురళి , కన్నె స్వామి
రోటరీనగర్ లోని ధర్మ శాస్త అన్నదానం ట్రస్ట్ ద్వారా స్వాములకు అన్న ప్రసాద వితరణ కు విశేష స్పందన వస్తుంది.. మునుముందు కూడా ఇంకా ఎంతో మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ చేయడానికి కృషి చేస్తున్నాం.
== నిత్యం అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది :సరిపూడి నాగేశ్వరరావు, భక్తుడు
నిత్యం ఎంతో మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఆసేవ చేసుకునే బాగ్యం కల్గడం చాలా అద్రుష్టం. ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. ఆ అయ్యప్ప దయ వల్లే ఇదంతా చేస్తున్నాము. ఆ స్వామి దీవెనలతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతాము