Telugu News

రైతులందరూ తస్మాత్ జాగ్రత్తా

నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి

0

రైతులందరూ తస్మాత్ జాగ్రత్తా
◆ నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి
◆ ఏఈఓ బాలబత్తుల శిరిణ్మయి

ఖమ్మం, మే 24(విజయం న్యూస్):

(ఖమ్మం ప్రతినిధి -పెండ్ర అంజయ్య)

నకిలీ విత్తనాలు విక్రయించేందుకు కొందరు వ్యాపారులు గ్రామాల్లోకి సైతం వస్తున్నారని అటువంటి వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం అర్బన్ ఏఈఓ బాలబత్తుల శిరిణ్మయి రైతులకు సూచించారు.
ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేట, ఖానాపురం హవేలీ గ్రామాలలో శుక్రవారం రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రైతుల అవసరాలను ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలతో మాటలు చెప్పి విక్రయించేందుకు వస్తున్నారని నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా ఇంటింటికి వెళ్లి విత్తనాలు విక్రయిస్తే వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
గుడ్డ సంచుల్లో గాని, నకిలీ లేబుల్ తో ప్యాకెట్లను విక్రయిస్తున్నారని అలాంటి వాటి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గ్రామాలలో తిరిగి విత్తనాల అమ్మే వారి దగ్గర నుంచి కొనుగోలు చేయొద్దని గుర్తింపు పొందిన, ఆదికృత డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాలకు విధిగా బిల్లులను, రసీదులను తీసుకొని భద్రపరచుకోవాలన్నారు. పంటకాలం పూర్తయ్యేంతవరకు వీటిని భద్రంగా దాచుకోవాలని సూచించారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి విత్తనాలన్నీ వారి సమాచారాన్ని వ్యవసాయ అధికారులకు అందించాలని అన్నారు. అనంతరం వేసవి దుక్కులు చేసుకోవాలని పచ్చి రొట్ట, జిలుగులు వేసుకొని కలియదున్నితే భూసారం పెరిగి పంట దిగుబడులు అధికంగా వస్తాయని రైతులకు అవగాహన కల్పించారు.