Telugu News

అసైన్డ్ భూములు గుంజుకుంటే ఆందోళన తప్పదు

అసైన్డ్ భూముల రియల్ వ్యాపారం ఆలోచన విరమించుకోండి

0

అసైన్డ్ భూములు గుంజుకుంటే ఆందోళన తప్పదు

—అసైన్డ్ భూముల రియల్ వ్యాపారం ఆలోచన విరమించుకోండి

—-బయ్యారంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే..

—-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

—-పాదయాత్రకు తెలుగుదేశం సంఘీభావం

(ఖమ్మం  -విజయం న్యూస్);-
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు వ్యవసాయ భూములిస్తే వాటిని గుంజుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించడం దుర్మార్గమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం భూ పంపిణీ చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను రియల్ వ్యాపారం కోసం రైతుల నుంచి బలవంతంగా గుంజుకునే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

also read;-సీతలాదేవి ప్రతిష్ఠ మహోత్సవంలో పొంగులేటి

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర మండలం లోని ఆల్లీనగరం నుంచి బయ్యారం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బయ్యారం లో అంబేద్కర్ విగ్రహం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమిని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వమపేదలకు పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో కొండలు, గుట్టలు ఉంటే చదును చేసుకొని లబ్ధిదారులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారని అన్నారు.

భూమికి రైతుకు ఎడతెగని అనుబంధం ఉంటుందని, అలాంటి భూమిని ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని ఎకరానికి 400 గజాల స్థలం ఇస్తామని అనడం సమంజసం కాదని అన్నారు. నిరుపేదలకు ఉపాధి నిమిత్తం అప్పటి ప్రభుత్వాలు అసైన్మెంట్ కమిటీల ద్వారా ఐదు ఎకరాల లోపు భూములను పంచితే అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మా హబ్, గ్రీన్ ఫీల్డ్ రహదారి విస్తరణ, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట ఇప్పటికే రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజు కోవడం వల్ల వారు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం పేదల పట్ల మరీ నిరంకుశంగా, నిర్దయగా, అమానవీయంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు.

also read;-బీజేపీ నాయకుడు ఆత్మహత్యయత్నం

అసైన్డ్ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రజాగ్రహనికి గురికాక తప్పదన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి పేదల భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ప్రతిపాదనని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుంటే పేదల పక్షాన యుద్ధం చేస్తామని వారి భూములు వారికి దక్కే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ, ఏ వ్యాపారి కానీ ఆ భూములు కొంటే భవిష్యత్ లో నష్టపోతారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఆ భూములు తిరిగి పేదలకు ఇస్తామని అన్నారు.

also read;-హైదరాబాద్‌ నగరానికి భారీ వర్షసూచన

ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇల్లు, ఫించన్, ఇండ్ల స్థలాలు, ఉద్యోగాలు రేషన్ కార్డులు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పాలనలో అభయ హస్తం రద్దు చేశారని, చెల్లించిన డబ్బులు తిరిగి వాపసు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఏడాది దాటుతున్నా ఇంకా మహిళా సంఘాలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఇస్తున్న అలసత్వం పై పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అనేక సమస్యలతో ప్రజలు ప్రతి గ్రామంలో ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడం కోసమే ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

బయ్యారంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే..
మధిర మండలం బయ్యారంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్పా ఈ 8 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఆల్లినగరం నుంచి బయ్యారం మీదుగా మోటమర్రి గ్రామానికి రోడ్డు వేయించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ప్రకటించారు. బయ్యారం యేటీ మాముల వద్ద చెక్ డ్యామ్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. మధిర మున్సిపాలిటీ లో కలిసిన మడిపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అల్లినగరం, బయ్యారం గ్రామాలకు సపరేట్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించి పాస్ పుస్తకాలు రైతులకు వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని వెల్లడించారు. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి, గ్రామాల్లో తదితర అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తారని వెల్లడించారు.

పాదయాత్రకు తెలుగుదేశం సంఘీభావం
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శనివారం మధిర మండలం ఆల్లీనగరంలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భట్టి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.