Telugu News

దాసరదీ.. కరుణాపయోనిది.. 

= గోపన్న నివాసంపై ఎందుకు నిర్లక్ష్యం

0

దాసరదీ.. కరుణాపయోనిది.. 

== గోపన్న నివాసంపై ఎందుకు నిర్లక్ష్యం

== రామదాసుని నివాసంలో కళ్యాణ వైభవం ఏది…?

== సాధాసీధాగా వేడుకలను నిర్వహించిన స్థానికులు

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్);-

దాశరదీ..కరుణాపయోనిది.. నువ్వే దిక్కని నమ్మడమా..? నా ఆలయమును నిర్మించడమా..? నిరతము నిన్ను భజియించడమా..? రామకోటి రచియించడమా..? సీతారామస్వామి..నేను చేసిన నేరమదేమి..? నీ దయచూపవదేమి..నీ దర్శనమియ్యవదేమి..? అంటూ రామున్ని దర్శనం కోసం ఆరాటపడిన భక్తదాసుడు, రామదాసుడు కంచర్ల గోపన్న ఆ నాడు ఎన్నో పాటలను పాడిన పరిస్థితి మనందరికి తెలుసు. ఆయన రాముడిపై ఉన్న భక్తితో భద్రాచలంలోని రామాలయంను నిర్మించి జైలుపాలైన పరిస్థితి ఉంది. ఎన్నో కష్టాలను అనుభవించి చివరికి శ్రీసీతారాముడు దర్శనమిచ్చిన సంగతి రామయణంలో చూశాము..

also read :-నేటి నుంచి భట్టి పాదయాత్ర

అలాంటి మహా గొప్ప భక్తుడు కంచర్ల గోపన్నను అంతారామమయం.. జగమంతా రామయయం అంటూ యావత్తు ప్రజానికాన్ని, భక్తజనాన్ని తట్టిలేపి..నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ అంటూ ఆ మహాసాధ్విని వేడుకుంటూ, రామచంద్రాయ జనక రాజమనోహారాయ అంటూ ఆలయం ను నిర్మించి గోల్కొండ చెరసాలలో గడిపిన భద్రగిరి నిర్మాత, నైజాముల పాల్వంచ పరగణాల తహసీల్దారు కంచర్ల గోపన్న నివాసం మనందరకి దేవాలయంతో సమానం. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆయన నివాసం శ్రీరామ భక్తజనానికి కోవెల లాంటింది.. అలాంటి కోవెలలో శ్రీరామనవమి ఉత్సవాలు, శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది.. భద్రాచలం తరువాత అంతటి వేడుకలను ఈ రామదాసుని సన్నిదానంలో జరుపుకోవాల్సిన బాధ్యత భక్తులపై, పాలకులపై, అధికారులపై కచ్చితంగా ఉందనే చెప్పాలి..

రామదాసుని పట్టించుకొని భక్తులు రాముడిని స్మరించిన ఫలితమేమి..? అన్నట్లుగా రామదాసులమైన మనం కూడా మొదటి రామదాసుడైన కంచర్ల గోపన్న నివాసంలో శ్రీరామనవిమి వేడుకలను ఘనంగా జరుపుకోవాల్సి ఉండే. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఆదివారం గొపన్న నివాసంలో  జరిగిన శ్రీరామనవమి వేడుకలు చాలా సాధాహరణంగా కొద్దిపాటి భక్తుల నడుమ జరిగాయి. అధికారిక కార్యక్రమాలు లేవు. పాలకులు ఎవరు పట్టించుకోలేదు.. కనీసం పాలించేవారు రావాల్సి ఉండగా, వారు కూడా తిరిగి చూడలేదు.. మొత్తానికి రామదాసుని నివాసంలో శ్రీరామనవమి వేడుకలు వెలవెల పోయాయనే చెప్పాలి.

also read :-ఢిల్లీలో తెలంగాణ భవన్ నందు రైతు దీక్ష ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నామ

కొద్ది మంది స్థానికులు, అరకొర దాతలతో కమనీయమైన శ్రీ రామ కళ్యాణం సాదాసీదాగా  కొనసాగించారు.  ఇక ప్రజా ప్రతి నిధులు, మహాప్రభువులు నేలకొండపల్లి వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితులలో భద్రాద్రి రామయ్య పంపిన పట్టువస్త్రాలు, బియ్యపు తలంబ్రాలు, మేళతాళాల నిధులతో, ఒక్కరిద్దరు అయ్యవార్లతో ఎంతో వేడుకగా నిర్వహించాల్సిన జగదభిరాముని కళ్యాణం ఆకాశమంత చలువ పందిళ్ళు, భూదేవి అంత పీఠం లేమితోనే  నిర్వహించారు. అయితే గోపన్న నిలయంలో జరిగే కళ్యాణానికి అందరూ పెద్దలే అయినప్పటికీ పదవులు అలంకరించిన పెద్దలందరూ మొహం చాటేసి రామదాసుని నిలయంలో సీతాసమేత శ్రీరామచంద్రునికి స్టేజీ మ్యారేజ్ తంతును మాత్రమే నిర్వహించటంతో అక్కడికి వచ్చిన భక్తులు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు…

== కంచర్ల గోపన్నే ప్రశ్నించాలా..? 

ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..? అంటూ రామున్ని ప్రశ్నించి, దాసరదీ.. కరుణాపయోనిధి.. కరుణించవా..? అని ప్రశ్నించిన రామదాసుడు ఆయనకు కంటపడే వరకు పాటల రూపంలో ప్రశ్నించాడు.. ఆనాడు ఆయన దాసుడిగా పాటపాడితే ఇప్పుడు కంచర్ల గోపన్న నివాసంలో శ్రీరాముడి కళ్యాణ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన భక్తులు పాటలు పాడాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది.. లేదంటే నా నివాసంలో వేడుకలను ఘనంగా చేయండి అని కంచర్ల గోపన్నే అడుక్కునే పరిస్థితికి వస్తుందేమో..? ఇదే విషయాన్ని స్థానిక భక్తులు కూడా ద్రువీకరిస్తున్నారు.. ఇప్పటికైనా పాలకులు, ప్రజాప్రతినిధులు స్పందించి భక్తరామదాసుడైన కంచర్లగొపన్న నివాసం ప్రాంగణంలో శ్రీరాముడికి సంబంధించిన ఏ కార్యక్రమానైన చాలా గొప్పగా చేసి ఆయన్ను స్మరించుకోవాలని శ్రీరామభక్తులు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, పాలకులు గోపన్న నివాసం పై కరుణ చూపుతారా..? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..? వేచి చూడాల్సిందే..?