ప్రజల కోసమే ‘పాదయాత్ర’
* * అవినీతి పాలనను బొందపెట్టేందుకే ఈ మార్చ్
* * ప్రజా సంపదను ఒక కుటుంబమే కొల్లగొడుతోంది
* * బంగారు తెలంగాణ అంటే కుటుంబం బాగుపడటం కాదు
* * ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే
* * బంగారు భారత్ చేస్తాననడం హాస్యస్పదమే
* * పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వంపై విరుచుకపడ్డా భట్టి విక్రమార్క
* * మూడవ రోజు ముదిగొండ మండలంలో కొనసాగిన పాదయాత్ర
* * అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న జనం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ప్రజా సంపదను కొల్లగొడుతూ ప్రజాధనంతో కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకుంటున్న సీఎం కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు.. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న తెలంగాణ సర్కార్ గురించి ప్రజలకు వివరించి మోసాన్ని తెలియజేసేందుకే ‘పిపుల్స్ మార్చ్’ చేపట్టానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనం కోసమే పాదయాత్ర చేపట్టానని, పాదయాత్ర అనంతరం ప్రజా సమస్యలను ప్రజా గొంతుకై అసెంబ్లీలో వినిపిస్తానని తెలిపారు. గత రెండు రోజుల క్రితం మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం యడవల్లి గ్రామం నుంచి ప్రారంభించిన పాదయాత్ర మంగళవారం మూడవ రోజు ముమ్మరంగా సాగింది.. మూడవ రోజు ముదిగొండ మండలంలోని చిరుమర్రి గ్రామం నుంచి పాదయాత్ర సువర్ణపురం, న్యూ లక్ష్మీపురం, ఖానాపురం గ్రామాల్లో విజయవంతంగా కొనసాగింది
. ఈ క్రమంలో మహిళలు, రైతులు, నిరుద్యోగులు తమ సమస్యలను సీఎల్పీ నేత కు విన్నవించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బంగారు తెలంగాణ అంటే పాలకులు బాగుపడడం కాదని, ప్రజా సంపద అందరికీ సమానంగా పంచినప్పుడే బంగారు తెలంగాణ అవుతుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి బంగారు భారత్ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన హాస్యాస్పదంగా యద్దేవా చేశారు. సోనియమ్మ ఇచ్చిన ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి పదిహేను లక్షల కోట్ల బడ్జెట్ ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజానీకానికి దక్కాల్సిన తెలంగాణ సంపదను నలుగురు పాలకులు పందికొక్కుల్లా తింటున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణలో మీ దోపిడీ సాగదు. మీ అవినీతి అంతం కావాల్సిందేని పేర్కొన్నారు.
ప్రజల సంపద ప్రజలకు చెందడం కోసమే తెలంగాణ సర్కార్ పై సమర యాత్ర( పీపుల్స్ మార్చ్) చేస్తున్నాని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులతో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు చేసే నర్సరీ, వైకుంఠధామాల పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టడమేనా …? అభివృద్ధి అంటే…..? అని ప్రశ్నించారు. పేద ప్రజలు మూడు పూటలా తినడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మహస్తం పథకాన్ని కెసిఆర్ ప్రభుత్వం ఆటకెక్కిచ్చిందని ఆరోపించారు. రేషన్ దుకాణాలను బియ్యం దుకాణాలుగా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది అని ఎద్దేవా చేశారు.
also read :-జన సంద్రంగా మారిన తీర్దాల
* * ఎన్నికల్లో హామిలైమైనట్టు..?
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటైన అమలు చేశారా? ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఏది? లక్షల ఎకరాలకు సాగునీరు ఏది? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏవి? కేజీ టు పీజీ విద్య ఏమైంది? రెసిడెన్షియల్ స్కూల్లు ఏమైనాయి? ఇంటికో ఉద్యోగం ఏది? దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ఎప్పుడు? వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బంగారు తెలంగాణ ఎలా అయ్యింది అని కేసీఆర్ ను ప్రశ్నించారు. రైతుబంధు ఎకరానికి ఐదు వేలు ఇచ్చి రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు ప్రోత్సాహకాలు బందు చేసి, ఎరువులు విత్తనాలు డీజిల్ ధరలు పెంచి, మద్దతు ధరకు పండించిన పంట కొనుగోలు చేయకుండా ఉంటే రైతులు ఎట్లా సంతోషంగా, ఆనందంగా ఉంటారో చెప్పాలని ప్రశ్నించారు.
నిరాశ నిస్పృహలతో ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు, పేద, సామాన్య ప్రజలు ఉన్నారని అన్నారు.
* * అభయహస్తమేమనట్లు..?
2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి అభయ హస్తం పథకాన్ని తీసుకురావడంతో 23, 38, 014 మంది మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి 365 చెల్లిస్తే అంతే మొత్తంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు నాటికి 2.20 లక్షల మందికి అభయ హస్తం పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ స్కీమ్ పెట్టీ 1,33, 415 మంది అభయ హస్తం సభ్యులను ఆసరా పరిధిలోకి మార్చారన్నారు. మిగతా 86 585 మందికి 2016 అక్టోబర్ నుంచి అభయహస్తం పెన్షన్ నిలిచిపోయిందని వివరించారు.
ఐదున్నర ఏళ్లుగా అభయహస్తం పెన్షన్ దారులకు ఎలాంటి పెన్షన్ రాక దీన స్థితిలో ఉన్నప్పటికి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 2014 సంవత్సరం వరకు డ్వాక్రా మహిళలు చెల్లించిన అభయహస్తం ప్రీమియం డబ్బులు రూ.1500 కోట్లు సర్కార్ వద్దనే ఉన్నాయని, వీటిని వాపస్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా తిరిగి చెల్లించే లేదన్నారు. ఈ పదిహేను వందల కోట్లు సర్కారు దగ్గరే ఉన్నాయా లేక డ్రా చేసి ఇతర పథకాలకు మళ్ళించారా?
అన్నది ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకాన్ని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా అటకెక్కించడం వల్ల సమ భావన సంఘాల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వీరి సమస్యల సాధన కోసమే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
also read :-జీళ్ళచెరువులో నవదంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు
* * సీఎల్పీ నేతకు సమస్యల ఏకరువు
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదని చిరుమర్రి గ్రామంలో సీఎల్పీ నేత విక్రమార్క నిర్వహించిన పాదయాత్ర వద్దకు కృషి సంఘ బంధం డ్వాక్రా మహిళా సభ్యులు వచ్చి తమ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. పావలా వడ్డీ రుణాలు కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం లేదని, అధికార పార్టీలో ఉన్న వారికి మాత్రమే రుణాలు ఇస్తున్నారని సంఘ బంధం లీడర్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 50 వేల రుణం తీసుకుంటే ఇప్పుడు 20 వేల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు.
స్త్రీ నిధి కింద ఇచ్చే రుణానికి రూపాయి చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారని, తీసుకున్న రుణానికి వడ్డీ సరిసమానం కావడంతో నెల, నెల కిస్తులు చెల్లించడానికి మళ్లీ అప్పు చేస్తున్నామన్నారు. చిరుమర్రి గ్రామం నుంచి గత ఐదేళ్ల లో అభయ హస్తం ప్రీమియం డబ్బులు ఐదు లక్షల రూపాయలు చెల్లించిన తమకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. తాము చెల్లించిన ప్రీమియం డబ్బులు అడిగినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా గ్రామ దీపికలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. చాలీచాలని గౌరవ వేతనం ఇచ్చి తమతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటున్నదని ఏకరువు పెట్టారు. ఈ క్రమంలోనే లక్ష్మి అనే మహిళ వచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకుని నాలుగేళ్లు అవుతున్న ఇంతవరకు రాలేదని, తనకు ఇళ్లు ఇప్పించాలని వేడుకుంది. ఆనంద్ రావ్ అనే రైతు ప్రత్యేకంగా నాగలిని తయారుచేయించి భట్టివిక్రమార్క కు బహుకరించారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు.
పీజీ పూర్తి చేసిన ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకపోవడంతో ఆరేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి…ఎదురుచూసి కుటుంబ సభ్యులకు భారమవుతున్న క్రమంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నానని శ్రీకాంత్, రోడ్డుపైన వెల్డింగ్ షాప్ పెట్టుకుని బతుకుతున్నానని సువర్ణపురం లో మరో నిరుద్యోగి భట్టి విక్రమార్క ముందు వాపోయారు. “మీ అందరి సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నామని, ప్రతి సమస్యను అసెంబ్లీలో ప్రజల గొంతుకగా తన గళం వినిపిస్తానని” భట్టి విక్రమార్క వారికి భరోసా ఇచ్చారు.
also read :-రైతుల దగా పై చర్చకు సిద్ధమా? : భట్టి విక్రమార్క
* * పోటెత్తిన జనాభిమానం
మూడవరోజు మంగళవారం చిరుమర్రి, సువర్ణపురం, న్యూ లక్ష్మీపురం, ఖానాపురం గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్ర జనాభిమానంతో పోటెత్తారు. దారి పొడవునా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పై బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు తిలకం దిద్ది హారతులిచ్చారు.. వందలాధి మందిజనం తరలిరావడంతో పాదయాత్ర జనయాత్రగా మారింది.. యువత సెల్పీల కోసం ఆరాటపడ్డారు.. భట్టి విక్రమార్క యువత, చిన్నారులను, పెద్దలను ఆప్యాయతగా పలకిరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
* * ఎన్టీఆర్ విగ్రహానికి భట్టి నివాళి
ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ నినాదాలు చేశారు.
also read :-బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ : తమ్మినేని
చిరుమర్రి గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభించిన సీఎల్పీ నేత ఆయా గ్రామాల్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ. జావీద్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మొక్కాశేఖర్ గౌడ్, బొడ్డుబొందయ్య, దొబ్బల సౌజన్య, నాయకులు రాయల నాగేశ్వరరావు, పెండ్ర అంజయ్య, బుల్లెట్ బాబు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, కిషోర్ తదితరులు హాజరైయ్యారు.