Telugu News

ఖమ్మంలో చలి పంజా

-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

0

ఖమ్మంలో చలి పంజా
-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
– ఏజెన్సీని వణికిస్తున్న చలి
– కప్పెస్తున్న మంచు.. కలవరపెడుతున్న ఈదురుగాలులు.
— రోజంతా చలితో ఇబ్బందులు పడుతున్న జనం
– పొంచివున్న రోగాలు.. రాత్రి సమయంలో జరుగుతున్న ప్రమాదాలు
— జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
— డ్రైవర్లు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలంటున్న అధికారులు

చలిపులి ప్రజలను వణికిస్తోంది.. ఒకవైపు ఈదురుగాలులు, మరో వైపు చల్లటి వాతావరణంతో జనంపై చలి పంజా విసురుతోంది.. దీంతో జనం వణికిపోతున్నారు.. ఉమ్మడి ఖమ్మంలో జిల్లలో చలిపులి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు జంకుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర లోనే అత్యల్ప కనిష్ఠ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగలు చలి తక్కువగా ఉన్నప్పటికీ రాత్రిళ్లు పరిస్థితి దారుణంగా ఉంటున్నది.అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని చలిపంజా విసురుతోంది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో మంచు కమ్మేస్తున్నది. ఉదయం ఎనిమిదైనా మంచుతెరలు తొలగిపోవడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటే స్వెటర్లు, జర్కిన్లు ధరిస్తున్నారు.

(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల్లోపు ఉన్నప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. 14 నుంచి 12 ఢిగ్రీలకు పడిపోతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలిపులి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈరోజు 9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదిలాబాద్ జిల్లా తరువాత ఖమ్మం జిల్లా రెండవ స్థానంలో ఉంది.ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. 24గంటల పాటు చలివీస్తునే ఉంది. ఏ వస్తువును చూసిన చల్లగా ముట్టుకుంటేనే ఇబ్బంది పడే విధంగా తయారైయ్యాయి. ఇక రోజంతా వాతావరణం చల్లగా ఉంటోంది. సూర్యుడు కనిపించి కనిపించనట్లుగా వస్తూపోతున్నాడు. దీంతో ఎండ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా రాత్రి సమయంలో చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే మంచు తీవ్రతరంగా పల్లెలను కప్పెస్తుంది. రోడ్లన్ని బ్లాక్ అయిపోతున్నాయి. రాత్రి 6 గంటలైందంటే మంచుతో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక తెల్లవారుజామున 4గంటల నుంచి 8గంటల వరకు మంచుకప్పెస్తుండటంతో రోడ్లన్ని మంచుతో నిండిపోతున్నాయి. ఉదయం 8గంటలైనప్పటికి వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వీటికితోడు పొగమంచు దట్టంగా అలుముకుంటుండడంతో చలి తీవ్రమవుతున్నది. ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. డిసెంబర్ రెండవ వారంలోనే చలితీవ్రత ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

చలి కాలం పొంచివున్న రోగాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలిపంజా విసురుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా వణికిపోతునే ఉన్నారు. ఈ చలిపులికి ప్రజలు అనారోగ్యాల బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధు లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. పెరుగుతున్న చలి తీవ్రత నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెచ్చని దుస్తులు, చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు. జిల్లాలో ప్రతి యేటా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో ఈ ప్రాంతంలో ఉన్ని దుస్తులు,స్వెట్టర్లు, బ్లాంకెట్లు, మఫ్లర్‌లకు డిమాండ్‌ ఎక్కువ ఉంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు వెచ్చని నేస్తాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారు.
చలికాలంలో జాగ్రత్తలు తప్పని సరి అంటున్న వైద్యులు
ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయి చలి తీవ్రత కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులతో మానవులపై వ్యాదుల దాడి పొంచివుంటుందని వైద్యులు అంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. చలికాలంలో న్యూమోనియా, డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ, చర్మ వ్యాధుల భారిన ఎక్కువగా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శ్వాస కోశ వ్యాధులు, ఆయాసం ఎక్కువగా ఉన్నవాళ్లు చల్లటి గాలులకు తిరగక పోవడమే మంచిది. దుమ్ము, దూళీ, పొగ మంచులో బయటకు వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు. ప్రయాణాలు చేసేప్పుడు గాలి త్రీవత ఇబ్బందులకు గురిచేయనుంది. చలిగాలులు సోకడం ద్వారా రక్తనాళాలు మూసుకుపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చల్లగాలినుంచి రక్షణకు చెవులు, నోరు, ముక్కు కప్పిపుచ్చే విధంగా మాస్క్‌లు, స్వేట్టర్లు, మఫ్లర్లు ధరించడం ఎంతో మేలు. చలి ఎక్కువగా ఉంటే కరోనా వైరస్‌ కూడ విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో తేమ వైర్‌సకు శక్తిని ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు కూడ తీవ్రమైతాయని అంటున్నారు. జలుబు, దగ్గు జ్వరం ఉంటే ఏమాత్రం అశ్రద్ద చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.

also read :-సత్తుపల్లిలో విషాదం.. మొన్న కొడుకు.. నేడు తండ్రి మృతి.