Telugu News

రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం: సీఎల్పీ నేత భట్టి

ధాన్యం కొనేంత వరకు పోరాటం చేస్తాం..ముదిగొండ కాంగ్రెస్ ప్లీనరీలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క

0

రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం

** ధాన్యం కొనేంత వరకు పోరాటం చేస్తాం

** బీజేపీ, టీఆర్ఎస్ ఒకతల్లి బిడ్డలే

** రైతులను ముంచేందుకే రెండు ప్రభుత్వాల హైటెక్ డ్రామా

** రాష్ట్ర సంపదనంతా ఆ కుటుంబమే దోచుకుంది

** కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తినదంతా కక్కిస్తాం

** రాబోయేది కాంగ్రెస్ సర్కార్.. ఎవరాపిన ఆగదు

** ఇంటింటికి కాంగ్రెస్ జెండా ఎగరాలి

** సభ్యత్వ నమోదులో కార్యకర్తలందరు కష్టపడి పనిచేయాలి

** ముదిగొండ కాంగ్రెస్ ప్లీనరీలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యమని, రైతుల పక్షాన నిలిచింది, రైతుల మేలు కోరింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడున్నది రైతుల నడ్డి విరిచే ప్రభుత్వాలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర నియోజవకర్గంలోని ముదిగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎల్పీనేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికే బిజెపి టిఆర్ఎస్ కుట్ర పన్ని, దాన్యం కొనాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలోని ఏ రాష్ర్టంలో లేని సమస్య తెలంగాణ రాష్ట్రానికే ఎందుకు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీని పలచన చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్నో చేసిందని అన్నారు. ఒకే సారి రుణామాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, రైతులకు అనేక సంక్షేమ పథకాలను, వ్యవసాయ యాంత్రీకరణ పథకం, యంత్రాలు, ఎరువులు సబ్సీడి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు. రైతులకు సకాలంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దేనని అన్నారు. కానీ ఈ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తరువాత రైతులకు యంత్రాలు లేవు, సబ్సీడి లేదు, ఎరువులు లేవని, కార్పోరేట్ శక్తులు మాత్రం ఉన్నారని అన్నారు.  యాసంగిలో వరి కొనకుంటే బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలకు ఉరి వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా ఊపిరి ఉన్నంత వరకు వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటా ఉంటామని అన్నారు.  కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటామని, కాంగ్రెస్ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు.  రాష్ట్ర సంపదను జలగల్లా పీల్చి పిప్పి చేసిన కేసీఆర్ కుటుంబం, దోచుకున్న రాష్ట్ర సంపదను కెసిఆర్ కుటుంబంతో కక్కిస్తామని తెల్చి చెప్పారు. నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్తో  ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా ఇంకా ఎన్నిరోజులు నిర్మిస్తారో చూడాలని పేర్కొన్నారు. బీసీ సస్ ప్లాన్ చట్టం సాధనకై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బీసీల గొంతుక గా గళం వినిపిస్తానని అన్నారు. దళితుల కోసం పోరాటం చేసి దళితబంధు వచ్చే విధంగా అసెంబ్లీలో పోరాటం చేశానని, కాంగ్రెస్ పోరాట ఫలితంగానే దళితులు దూరం అవుతారేమోననే ఆలోచనతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అర్హులైన దళితులందరికి దళితబంధు పథకాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మధిర నియోజకవర్గంలో విస్తృతంగా కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

** పూలవర్షంతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు..

ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల మూడవ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర  శాసన సభ్యులు  మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు భట్టి విక్రమార్కకి  మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహనీయులు అంబేద్కర్,   స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు భట్టివిక్రమార్క పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్క పై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు అధ్యక్షతన ప్లీనరీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గప్రసాద్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు.. ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు..