పాలేరు నుండి షర్మిల పోటీ*
★★ స్పష్టం చేసిన షర్మిల
★★ కసరత్తు చేస్తున్న పార్టీ నేతలు
★★ ఈనెల 19న పాలేరులో విస్తృత సమావేశం
*ఖమ్మం ప్రతినిధి, జూన్ 15(విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం అసెంబ్లీ కీ తీవ్రపోటీ నెలకొనే అవకాశం కన్పిస్తోంది.. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాలేరు నియోజకవర్గం పై ప్రముఖుల కన్నుపడింది. జనరల్ స్థానమైన పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆయా పార్టీల ఆగ్రనేతలు సిద్దమవుతున్నారు.అధికార పార్టీలో వర్గపోరు బుసలుకోడుతుండటంతో ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న ఆయా పార్టీలకు చెందిన అగ్రనాయకత్వం పాలేరు వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారని పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున ఈనెల 19న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా పాలేరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ కు పట్టున్న స్థానం. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండడం ఆయా గ్రామ రాజకీయాలు రెడ్డి సామాజికవర్గం నేతల చేతిలో ఉండడం, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉండడం, రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ కు బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయన్న ఉద్దేశంతో షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు టీ.ఆర్.యస్ లోని వర్గ విభేదాలు కూడా తమకు లాభిస్తాయని షర్మిల పార్టీ భావిస్తోంది.
*కేసీఆర్‌ను మళ్లీ ఎన్నుకుంటే అంధకారమే:షర్మిల*
తనకో అవకాశం ఇవ్వాలని వైఎస్సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఓ హంతకుడని, నిరుద్యోగుల చావులకు ఆయనే కారణమని ఆమె ఆరోపించారు. ఉద్యోగ ఖాళీలున్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో నిర్వహించిన నిరుద్యోగ నిరహార దీక్షలో ఆమె ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ జీవితాలు బాగు పడతాయని ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు ఉద్యమం చేసి రాష్ట్ర సాధనకు కృషి చేశారన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ఖజానాను టీఆర్‌ఎస్ దోచుకుందని విమర్శించారు. మరోసారి కేసీఆర్‌ను ఎన్నుకుంటే చీకట్లో మగ్గినట్లేనని హెచ్చరించారు.