పేదలపై అధికారుల ప్రతాపం
== నిరుపేదల ఇండ్లను కూల్చేసే ప్రయత్నం
== కలెక్టర్ ఆదేశాలను బేకాతారు చేస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు
== గ్రీవెన్స్ డేలో కలెక్టర్ కి వినతి
ఖమ్మం ప్రతినిధి, జులై 5(విజయంన్యూస్)
నిరుపేదలపై అధికారులు తమ ప్రతాపం చూపించడం అనువాయితీగా కొనసాగుతుంది. ఖమ్మం రూరల్ మండల, నాయడుపేట గ్రామంలోని కస్తూరిభగాంధీ విద్యాలయం సమీపంలో నిరుపేదలకు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పదికుటుంబాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు సోమవారం ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే కార్యక్రమానికి వచ్చి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ పెద్దతండా పంచాయతీ సత్యనారాయఫురం గ్రామంలో సర్వే నెంబర్ 142/3 లో సుమారు 10మంది నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నామని తెలిపారు. ప్రభుత్వం 2008, జులై 7న లకావత్ లచ్చిరాంకు పట్టా ఇచ్చిందని, వారు ఇతర జిల్లాకు వెళ్లడం వల్ల వారి వద్ద నుంచి మేము కొనుగోలు చేశామని, మేము పేదవారిమే కాబట్టి నివాసాలు వేసుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పుడు దరకాస్తు చేసుకోగా అప్పటి తహసీల్దార్ మాకు నివాసం ఉండేందుకు అనుమతినిచ్చారని, ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క తహసీల్దార్ కూడా ఆ స్థలం వైపు రాలేదని తెలిపారు. కానీ ఇప్పటి తహసీల్దార్ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ మా ఇండ్లను కూల్చివేస్తామని నోటీసులు పంపిస్తున్నారని, పోలీసులు వచ్చి టైమ్ కానీ టైమ్ లో పోలీస్ స్టేషన్ కు రమ్మని బెదరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ను కలిసి వినతి చేసి నిరుపేదలమైన మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరగా ఆయన అక్కడ ఇండ్లను కూల్చివేసే ప్రక్రీయను విరమించుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. అయినప్పటికి రెవెన్యూ అధికారులు మూడు రోజులుగా మాపై కక్ష్యకట్టి మా ఇండ్లను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ కు, మంత్రి పువ్వాడ అజయ్ కు, కేటీఆర్ కు మనవి చేస్తున్నామని, మా నిరుపేదల భూములను వదిలేయాలని, మా ఇండ్లు కూల్చి రోడ్డున పడేయోద్దని వేడుకున్నారు.
ALLSO READ- పేదల నడ్డి విరుస్తున్న వారాల వడ్డీ..