Telugu News

కన్నతండ్రి పైశాచికం ..! మూడవ బిడ్డపుట్టిందని చంపేసిన తండ్రి

నెల రోజుల పసికందును హతమార్చిన తండ్రి

0
కన్నతండ్రి పైశాచికం ..!
** మూడో సారి ఆడపిల్ల పుట్టిందని కోపం 
** నెల రోజుల పసికందును హతమార్చిన తండ్రి
(తిర్యాణి/కాగజ్ నగర్–విజయం న్యూస్)
ఆడపిల్లకు తల్లి కడుపులో పడినప్పటి నుంచి.. కట్టె కాలే వరకు ఏ వైపు నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆఖరికి రక్తం పంచిన తండ్రి నుంచి సైతం ముప్పును ఎదుర్కొంటున్నారు. లింగ భేదం లేకుండా బాధ్యతగా మెలిగి.. ఉన్నంతలో చదివించి మంచి జీవితాన్ని అందించాల్సింది పోయి.. పెంపకం, కట్నాలకు భయపడి వారి ఉసురు  తీస్తున్నారు. వరుసగా మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందనే కోపంతో అమానవీయంగా కన్నకూతురిని హతమార్చాడు ఓ తండ్రి. కుమురం భీం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
మొదటి రెండు కాన్పుల్లో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. మూడోసారైనా అబ్బాయి పుడతాడని అనుకున్నాడు ఆ తండ్రి. కానీ ఈ సారి కూడా అమ్మాయే పుట్టింది. ఎవరైతే ఏంటి.. తన పిల్లలే కదా అనుకోలేదు. పేదరికం, పనికెళ్తే కానీ పూట గడవని పరిస్థితి గుర్తొచ్చిందేమో.. ముగ్గురు ఆడపిల్లలను ఎలా పెంచాలి అనుకున్నాడో ఏమో.. ఆ అసహనం అంతా భార్య మీద చూపించి రోజూ గొడవ పెట్టుకునేవాడు.
*రక్తమోడుతూ..*!!
పాపం ఈ విషయాలన్నీ ఇంకా నెలలు కూడా నిండని పసికందుకు తెలియదు. ఆకలేసినప్పుడు అమ్మ పాలిస్తే.. హాయిగా తాగి నిద్రపోతుంది. మధ్యమధ్యలో తన అక్కలు ఎత్తుకుని ఆడిస్తుంటే సంబరపడిపోయింది. కానీ అమ్మ ఒడిని, అక్కాచెల్లెళ్ల అనురాగాన్ని ఆస్వాదించకముందే.. తండ్రి కోపాన్ని చవిచూసింది. నిద్రపోతున్న తనను.. దభేలున ఎవరో లాగి బయటపడేసినట్లుగా అనిపించింది. కళ్లు తెరిచే లోపే మరో బండరాయి వచ్చి మీద పడింది. ఎవరు ఇది చేశారా అని చూసే లోపే.. ఆ పసికందు శ్వాస గాల్లో కలిసిపోయింది. తన తండ్రి కిరాతకానికి.. విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. ఇలా చంపేదానికి నన్ను కనడం ఎందుకు అని ఆ శిశువు ఆత్మ రోదిస్తోంది.
*పేగు బంధాన్ని మరిచి*
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పేగు బంధాన్ని మరిచిన కన్నతండ్రే కాలయముడిలా మారాడు. ఊహ కూడా తెలియని పసికందును బండరాయితో మోది కడతేర్చాడు ఆ కన్నతండ్రి. ఆ చిన్నారి చేసుకున్న పాపం ఏంటంటే ఆడపిల్లగా పుట్టడమే. లైన్​గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావుకు మహారాష్ట్రకు చెందిన మనీషతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరుఆడపిల్లలు. మొదటి కూతురికి 5 సంవత్సరాలు.. రెండో కూతురుకి మూడేళ్లు. కాగా మూడో సంతానం కూడా అమ్మాయే పుట్టింది.
ఈ క్రమంలో కాన్పు జరిగినప్పటి నుంచి.. బాపురావు భార్యపై తీవ్ర అసహనంతో ఉన్నాడు. ముగ్గురు ఆడపిల్లలే అనే కోపంతో తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. నిన్న రాత్రి అదే విషయంలో భార్యతో గొడవపడిన బాపురావు.. 40 రోజుల పసికందును ఇంటి నుంచి బయటకు తీసి రోడ్డుపై పడేశాడు. అంతటితో ఆగక బండరాయి తీసుకొచ్చి పసికందు తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ రామ్ మోహన్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.కేసు నమోదు చేసి, పసి కందు మృతదేహాన్ని ఆసిఫాబాద్  లోని సివిల్ హాస్పిటల్ కు తరలించి పోస్ట్ మార్టం చేయించారు. నిందితుడు ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు రూరల్  సీఐ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు