Telugu News

మమ్మల్ని పట్టించుకోరా.. జర ప్లీజ్

ప్రారంభించారు.. వదిలేశారు.. కొత్తగూడెంలో మరుగుదొడ్ల దుస్థితి

0

ఎందుకు కట్టారు?
– శిధిలమైపోవాల్సిందేనా
– ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించారు
– తాళాలు తీయడం మరిచారు
– ఇందులో ఎవరిది నిర్లక్ష్యం
(భద్రాద్రి కొత్తగూడెం-విజయం న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న మరుగుదొడ్లను కొన్ని ప్రాంతాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించి నెలలు గడుస్తున్నప్పటికీ మరుగుదొడ్లకు వేసిన తాళాలు నేటికీ తీయని దుస్థితి నెలకొంది. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద, పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఉపయోగంలో లేవు. ప్రజా మరుగుదొడ్లను ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరుగుదొడ్లను ప్రారంభించి రోజులు గడుస్తున్న వాటికి వేసిన తాళాలు తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు వివిధ ప్రాంతాలు దిష్టిబొమ్మ లాగా మిగిలిపోవడం బాధాకరమని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు ఉండి ఉపయోగం లేని వాటిపై గతంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మినీ ప్రశ్నించగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

పోడు పంచాయతీ తెలుద్దాం: సీఎం కేసీఆర్

పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ముగిసి రోజులు గడుస్తున్న మరుగుదొడ్లకు వేసిన తాళాలు తీసేందుకు ముహూర్తం కుదరకపోవడం విచారకరమని పాదచారులు వాపోతున్నారు. మరుగుదొడ్లు వినియోగంలో లేని ఫలితంగా మరుగుదొడ్లకు అమర్చిన తలుపులు, కిటికీలు, తాళాలు జంగు పట్టి పోతున్నాయి. అయినప్పటికీ అధికారులలో చలనం లేకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మరుగుదొడ్ల ఇరువైపులా చెత్తాచెదారం, పిచ్చి చెట్లు వెలసి దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రజా మరుగుదొడ్ల సౌకర్యం జనానికి ఉపయోగ పడకపోవడం పట్ల విమర్శలు రావడంతో పాటు కొత్తగూడెంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రారంభించిన ప్రజా మరుగుదొడ్లను వినియోగంలోకి తేవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న🔔 గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*