Telugu News

బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం: తమ్మినేని

విలేకర్ల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

0

బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం: తమ్మినేని

== ఇప్పటి వరకే మా పొత్తులు

== ఆ తరువాత ఎవరిదారి వాళ్లదే

== జాతీయ స్థాయిలో పొత్తులపై సీఎం మాతో చర్చించారు

== రాజగోపాల్ రెడ్డి  అభివృద్ధి కోసమే రాజీనామా అనడం హస్యాస్పదమే

== రాజకీయ భవిష్యత్ కోసమే రాజగోపాల్ రాజీనామా

== తెల్దారుపల్లి హత్యకు, మునుగోడు ఎన్నికకు ఎలాంటి సంబందం లేదు

== వ్యక్తిగత కక్ష్యలు వల్లనే హత్య జరిగింది.. రాజకీయ హత్య కాదు

== విలేకర్ల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

కూసుమంచి, సెప్టెంబర్ 4(విజయంన్యూస్)

బీజేపీ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తుందని, రాజ్యంగాన్ని భష్ట్రుపట్టించి పరిపాలన చేస్తుందని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ పరిపాలనను తప్పు పడుతున్నారని దుయ్యబట్టారు. ఆదివారం కూసుమంచి మండలంలోని మల్లెపల్లి గ్రామంలో పార్టీ నాయకుడు కట్టా పుల్లయ్య ప్రథమ వర్థంతి సందర్భంగా  ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అవిష్కరించారు.

ఇది కూడా చదవండి: లోక్యతండాలో బాలుజాదవ్ విగ్రహావిష్కరణ

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. కట్టా పుల్లయ్య సీపీఎం పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డారని అన్నారు. ఆయన వేసిన ప్రతి అడుగు పార్టీ కోసమే ఉండేదని, పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి అండగా సీపీఎం పార్టీ ఉంటుందన్నారు. బీజేపీ పార్టీ దేశంలో  రాజ్యంగ పరిపాలన కాకుండా రాజకీయ పరిపాలన చేస్తోందని ఆరోపించారు. ప్రతిది రాజకీయ కోణంలో, ఓటు బ్యాంక్ కోణంలో చూస్తుందని ఆరోపించారు. సామాన్యుడు బతకలేని విధంగా అన్నింటి ధరలు పెంచేసి, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ పథకాలను అదాని, అంబానీలకు దారాదత్తం చేస్తుందన్నారు. వ్యవసాయ మూడు నల్ల చట్టాల విషయంలో సీపీఎం పార్టీ ముందే చెప్పిందని, కచ్చితంగా దేశానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం వస్తుంది మూడు చట్టాల విషయంలో అని చెప్పడం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి : తెల్దారుపల్లిలో పర్యటించిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం

చివరి అదే జరిగిందన్నారు. కచ్చితంగా నల్ల చట్టాల రద్దు విషయంలో రైతుల ఐక్యత, రైతు ఉద్యమ నేపథ్యంలో ఇది రైతుల విజయమని అన్నారు. రైతు ఉద్యమానికి సీపీఎం, వామపక్ష పార్టీల మద్దతుతో సూపర్ సక్సెస్ అయ్యిందని, కేంద్రం దిగివచ్చి చట్టాలను రద్దు చేసిందన్నారు. ఇక బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకుని సీబీఐ, ఈడీలను జేబులో పెట్టుకుని ప్రశ్నించేవారిపై దాడులకు పాల్పడుతూ ప్రభుత్వ పరిపాలనను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఆలోచనతో ఈడీ, సీబీసీఐడీ, సీబీఐలను వాడుకుంటుందన్నారు. ప్రజలు చూస్తూనే ఉన్నారని, సరైన సమయంలో కచ్చితంగా ప్రజలు సరైన సమాధానమిస్తారనే నమ్మకం సీపీఎం పార్టీకి ఉందన్నారు. అన్ని మతాల ఐక్యదేశంగా ఉండే మన భారతదేశంలో మతతత్వాన్ని ప్రజల్లో నింపుతూ కుల రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మతతత్వ పార్టీలను తరిమికొట్టడమే వామపక్ష పార్టీల నినాదమని, అందుకే బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు.

== మునుగోడు వరకే పొత్తులు

మునుగోడు ఎన్నికల వరకే సీపీఎం, టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మునుగోడులో బీజేపీ ని ఓడించడం కోసం టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన, అందుకే అప్పటి వరకు మాత్రమే పొత్తు ఉంటుందని  తెలిపారు. ఆ తరువాత ఎవరిదారి వారిదేనని, ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఏకైక పార్టీ సీపీఎం పార్టీ అని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్ ను కలిసి చర్చించడం జరిగిందన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన అంశాలపై చర్చించేందుకు మరోసారి సీపీఎం ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులను, అన్ని పార్టీలను కలుపుకుని రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాధనను సీఎం కేసీఆర్ మా వద్ద ఉంచారని, ఆ ప్రతిపాదనను జాతీయ పార్టీకి పంపించడం జరిగిందన్నారు. జాతీయ పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర పార్టీ పనిచేస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: తెల్దారుపల్లి హత్యకేసులో మరో మలుపు

== రాజగోపాల్ రెడ్డి  అభివృద్ధి కోసం కాదు..రాజకీయ భవిష్యత్ కోసం రాజీనామా

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నానని చెప్పడం హస్యాస్పదంగా ఉందని, ఆయన రాజకీయ భవిష్యత్ కోసం పదవికి రాజీనామా చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అయితే కాంగ్రెస్ లో ఉండి రాజీనామా చేయోచ్చు కదా..? అని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్ కోసం, అక్రమ సంపాధనను కాపాడుకోవడం కోసం ఆయన రాజీనామా చేశారని ఆరోపించారు. ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

== మునుగోడు ఎన్నికలకు, తెల్దారుపల్లి హత్యకు ఏం సంబంధం..?

ఖమ్మం రూరల్ మండలం, తెల్దారుపల్లిలో జరిగిన హత్యకు, మునుగోడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెల్దారుపల్లి గ్రామంలో జరిగిన హత్య రాజకీయ హత్య కాదని, వ్యక్తిగత కక్ష్యల నేపథ్యంలో హత్య జరిగిందన్నారు. ఈ హత్యకు సీపీఎం పార్టీకి ఏం సంబందముందన్నారు. సీపీఎం పార్టీని నిందించడం సరైంది కాదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసమే హత్య జరిగిందని, హత్య కేసు నుంచి బయటపడేందుకే మునుగోడులో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించడం దుర్మార్గమన్నారు. జాతీయ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సీపీఎం జాతీయ కార్యవర్గం నిర్ణయం మేరకు మేము పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు.  హత్యలు జరగడం బాధాకరమని, మా గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, నాయకులు బుగ్గవీటి సరళ, బండి రమేష్, పుల్లయ్య, రాజశేఖర్, తాళ్లూరి రవి, సన్మథరావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, బత్తుల హైమావతి, శీలం గురుమూర్తి, సర్పంచ్ నాగేశ్వరరావు, శాఖ కార్యదర్శి చీరేళ్ల రాధాక్రిష్ణా తదితరులు పాల్గొన్నారు.