జుజ్జులరావుపేటలో రియల్ దందా..?
== జాతీయ రహదారి పక్కనే 100 ఎకరాల్లో వెంచర్ నిర్మాణ పనులు
== 42 ఎకరాల్లో వ్యవసాయ మాగాణి భూమి కొనుగోలు
== ముమ్మరంగా డెవలఫ్ మెంట్ పనులు
== కలర్ పుల్ బ్రోచర్లు.. అకట్టుకునే హోర్డింగ్ లు
== అంతులేని ప్రచారం.. అద్భుత ప్రకటనలు
== అనుమతుల సంగతి ఏంటి..?
జాతీయ రహదారి లో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి.. అడ్డగోలుగా అనుమతులు లేకుండా యదేచ్ఛగా వెంచర్లను నిర్మాణం చేస్తున్నారు..కన్వర్షన్, డీటీసీపీ, లేఆవుట్, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్ శాఖలకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సిన రియల్ వ్యాపారులు, ఆవేవి లేకుండానే అక్రమ పద్దతిలో వ్యాపారానికి తెరలేపుతున్నారు.. అనుమతులు లేకుండా అందమైన బ్రోచర్లు.. అకట్టుకునే ప్రకటనలతో వెంచర్ పూర్తి కాకుండా, రైతుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వెంచర్లు వేసి వ్యాపారం షూరు చేస్తున్నారు.. ఇదేందని అడిగితే అధికారం అంటూ హుకుం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. జాతీయ రహదారిపై అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై ‘విజయం’ తెలుగుదినపత్రిక, ‘విజయం టీవీ’ ప్రత్యేక కథనం..
(కూసుమంచి-విజయంన్యూస్)
సూర్యపేట- ఖమ్మం జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తైయ్యాయి.. వాహనాల రాకపోకలు ప్రారంభమైయ్యాయి.. మస్తు రద్దీగా మారింది.. ఈ సమయంలో జాతీయ రహదారి పక్కనే రియల్ వ్యాపారం బాగుంటుంది.. నూతనంగా ఇండ్ల నిర్మాణం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.. అందుకే రియల్ వ్యాపారులు కొత్త వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తారు.. అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు నుంచి నాయకన్ గూడెం వరకు రియల్ వ్యాపారంషూరు అయ్యింది. దీంతో అక్కడ భూముల ధరలకు రెక్కలోచ్చాయి. ఎకరం రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతుంది.. జీళ్లచెరువు గ్రామంలో ఏకంగా రూ.2.20 కోట్ల వరకు ఎకరం భూమి అమ్ముడుపోతున్న పరిస్థితి ఉంది. ఆ తరహాలో భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రియల్ వ్యాపారులు భూములను కొనుగోలు చేసి అద్భుతమైన వెంచర్లను తయారు చేస్తున్నారు. ఇంకేముంది..
రియల్ వ్యాపారులు రంగప్రవేశం చేశారు.. జాతీయ రహదారి పక్కనే వెంచర్లు వేసేందుకు రియల్ వ్యాపారులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా తల్లంపాడు నుంచి నాయకన్ గూడెం వరకు పెద్ద ఎత్తున వెంచర్లు వేసేందుకు రియల్ వ్యాపారులు మక్కువ చూపుతుండగా, కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట పంచాయతీలో జాతీయ రహదారి వద్ద సుమారు 100 ఎకరాల్లో వెంచర్ వేసేందుకు ఓ రియల్ ఎస్టేట్స్ కంపెనీ సమయత్తమైంది. జుజ్జులరావుపేట రెవెన్యూ పరిధిలో గల పలువురు రైతుల వద్ద నుంచి భూములను కొనుగోలు చేశారు. మొదటిగా ఏడుగురు రైతుల వద్ద నుంచి 39.12 ఎకరాల్లో మాగాణి భూమిని కొనుగోలు చేయగా, మరి కొంత మంది రైతుల వద్ద నుంచి నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరందరికి ఎకరం సుమారు రూ.1 కోటీ చొప్పున కొనుగోలు చేసి ¼ డబ్బులను కట్టినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ భూమిలో డెవలఫ్ మెంట్ వర్స్ ను ప్రారంభించారు. మాగాణి భూములను వెంచర్ కోసం తయారు చేసే పనిలో నిమగ్నమైయ్యారు. రెండు జేసీబీలు, మూడు డోజర్లు, టిప్పర్ల సహాయంతో అక్కడ అభివద్ది పనులు జరుగుతున్నాయి.
== అనుమతుల సంగతేంటి..?
వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చుకని వెంచర్లను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ముందుగా వ్యవసాయ భూమిని మార్చుకునేందుకు నాలా(కన్వర్షన్) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీవోకు ధరఖాస్తు చేసి సంబంధిత డీడీ చెల్లిస్తే రెవెన్యూడివిజన్ అధికారులు కన్వర్షన్ కు అనుమతిని ఇస్తారు. ఆ తరువాత సుడా పరిధిలో ఉంటే సుడాకు, గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే డీటీసీపీ, గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. పంచాయతీ అనుమతి కావాలంటే కచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10శాతం గ్రీన్ ల్యాండ్ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయించాలి. మరికొంత అమౌంట్ డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ తరువాత విద్యుత్ శాఖ, ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వెంచర్లో అంగన్ వాడీ నిర్మాణం చేయాల్సి ఉంటుంది.. ఇదంతా పంచాయతీ, ప్రభుత్వ నిబంధనలు. ఈ అనుమతులు వచ్చిన తరువాతనే వ్యవసాయ భూమిని మెట్టభూమిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అందులో ఎలాంటి పనులు చేయకూడదు. అయితే జుజ్జుల రావుపేట వద్ద వెంచర్ వేస్తున్న వారు మాత్రం ఇలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. కనీసం కన్వర్షన్ అనుమతి తీసుకున్నారంటే అదికూడా లేదని తెలుస్తోంది. కన్వర్షన్ ఉండదు, పంచాయతీ అనుమతి ఉండదు, పంచాయతీలో తీర్మాణం చేయరు, రైతుల నుంచి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయించుకోరు కానీ రియల్ వ్యాపారులు మాత్రం చేయాల్సిందంతా చేసేస్తున్నారు.
==అకట్టుకునే బ్రోచర్.. అద్భుతమైన వీడియో.. ముమ్మరంగా ప్రచారం
జుజ్జులరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేస్తుండటమే కాకుండా వెంచర్ నిర్మాణం చేస్తున్నట్లు అద్భుతంగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వెంచర్ కు సంబంధించిన కలర్ పుల్ బ్రోచర్లు, అద్భుతమైన ప్రకటనలు. చూడచక్కని వీడియో.. అకట్టుకునే యాంకర్ వాయస్.. నేరుగా చైర్మన్ రంగంలోకి దిగి ప్రకటనలు.. ఇవ్వన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి.. రియల్ ఎస్టేట్ రంగంలో దశబ్ధాల అనుభంతో కస్టమర్లు, శ్రేయాభిలాషుల మన్నలను పొందిన సంస్థ అంటూ జాతీయ రహదారి పక్కనే డీటీసీపీ, లేఆవుట్ అనుమతులతో అద్భుతమైన వెంచర్ ను నిర్మాణం చేస్తున్నామంటూ వీడియోలు.. యూట్యూబ్ లో ప్రకటనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. ఈ ప్రకటనలు బిజినెస్ ను పెంచే విధంగా ఉన్నాయి.. అందులో తప్పు లేదు.. కానీ అనుమతులు లేకుండానే టీడీపీసీ అనుమతి, గ్రామ పంచాయతీ అనుమతులు అంటూ ప్రచారం చేసుకోవడం గమనర్హం. ఈ విషయంపై ఉన్నతాధికారులను వివరణ కోరగా అక్కడ వెంచర్ వేస్తున్నట్లే తెలియదని కొంతమంది అంటే, ఆ వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవని మరికొంత మంది అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది.. ఈ విషయం స్థానిక సర్పంచ్ మందడి పద్మారెడ్డిని వివరణ కోరగా మా పంచాయతీలో వెంచర్ వేస్తున్నట్లు తెలిసిందని, అనుమతులు లేకుండా వెంచర్ వేస్తే అధికార నిబంధనల ప్రకారం పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటే సహాకరిస్తామని తెలిపారు. ఎవరైన నిబంధనల మేరకు పనులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదని చెప్పారు. రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేసి ¼ వంతు డబ్బులు కట్టినట్లుగా తెలిసిందన్నారు.
== పంచాయతీ అనుమతులు లేవు : సహాజ, పంచాయతీ కార్యదర్శి
జుజ్జులరావుపేట పంచాయతీ పరిధిలో జాతీయ రహధారి పక్కన సుమారు 40 ఎకరాల్లో వెంచర్ వేస్తున్నట్లుగా తెలిసింది. సంబంధిత రైతులను అడిగాము.. భూమిని ఖమ్మంలోని రియల్ ఎస్టెట్ అతనికి అమ్మామని చెప్పారు. ¼ వంతు డబ్బులు కూడా కట్టారని, కానీ మొత్తం చెల్లించని నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పారు. గతంలో జాతీయ రహదారి పక్కన పెద్దపెద్ద హోర్డింగ్ లు పెట్టడం వల్ల వాటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లేఆవుట్ అనుమతులు లేనందున తొలగించడం జరిగింది. రైతులకు చెప్పడం జరిగింది. ఎలాంటిఅనుమతులు లేకుండా పనులు చేయోద్దని చెప్పాము.. ఈ విషయం ఉన్నతాధికారులకు చెప్పాము.. వారి ఆదేశాలనుసారంగా పనిచేస్తాము.
అనుమతులంటూ ‘రియల్ మోసం’.. అవేవి లేకుండానే వ్యాపారం షూరు.. అడిగితే అధికారమంటూ హుకాయింపు..ఆయనకు అండగా ఆ విలేకరి.. అధికారులపై ఒత్తిడి…మా వాళ్లే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం.. (రేపటి సంచికలో)