Telugu News

పర్యవేక్షణ లోపమే ప్రాణాల్ని బలిగొంది..!?

పని స్థలంలో స్టాటా కంట్రోల్ కొరవడిందా

0

పర్యవేక్షణ లోపమే ప్రాణాల్ని బలిగొంది..!?

– పని స్థలంలో స్టాటా కంట్రోల్ కొరవడిందా..

– ఆంకరేజ్ టెస్టులు సైతం శూన్యమేనా..

– రిపోర్టులు రాకుండానే పనులకు ఉపక్రమించారా..?

 

– ఎస్ ఆర్ పి-3 గని ప్రమాదంపై విమర్శల వెల్లువ

– ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే అనర్ధాలకు మూలం..!?

– సేఫ్టీ పరికరాల సరఫరాలోనూ అంతులేని అలసత్వం

 

(మంచిర్యాల ప్రతినిధి-విజయం న్యూస్):

ఎస్ ఆర్ పి-3 గనిలో సంభవించిన ప్రమాదం ముమ్మాటికి అధికారుల పర్యవేక్షణ లోపం వల్లేనని తెలుస్తోంది. జాతీయ కార్మిక సంఘాలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. పని స్థలంలో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందినందునే ఈ ప్రమాదానికి దారితీసిఃదని సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. సాంకేతికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు రక్షణ పరికరాల సరఫరా చోటు చేసుకుంటున్న అలసత్వం ఇందుకు కారణం అని వాపోతున్నారు. అధికారిక వైఫల్యాలు ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని కూడా దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం పై వెల్లువెత్తుతున్న విమర్శల దరిమిలా ‘విజయం’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఎస్ ఆర్ పి-3 గనిలో బుధవారం నాటి ప్రమాదం నలుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కార్మికులు కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, చంద్రశేఖర్, సత్య నరసింహరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ప్రమాదం అధికారుల వైఫల్యాల కారణంగా సంభవించిందని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. వాస్తవానికి బుధవారం విధులకు ఉపక్రమించిన మూడవ సీన్ 21 లెవెల్ పని స్థలం వద్ద బ్యాడ్ రూఫ్ ఉంది. సదరు స్థలంలో బొగ్గు ఉత్పత్తి కోసం డిస్ట్రిక్ట్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ రూఫ్ బోల్ట్ వేశారు. అదే రూఫ్ కు అదనంగా స్విచ్చింగ్ పనులు చేస్తున్నారు. పైకప్పుకు సపోర్టు వేసే క్రమంలోనే ఈ గని ప్రమాదం సంభవించిందని స్పష్టమవుతోంది.

ఆంకరేజ్ టెస్టులు చేశారా..!?
సాధారణంగా భూగర్భ గనుల్లో పైకప్పు బ్యాడ్ ఉందని తెలిసినప్పుడు పలు విధాల సాంకేతిక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కోవలోనే పని స్థలంలో స్టాటా‌ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఉ కాన్ క్రేజ్ టెస్ట్ చేపట్టాలి. ఈ రెండు టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాకనే సదరు పని స్థలంలో భవిష్యత్తు కార్యాచరణ జరగాలి. రిపోర్టుల ప్రకారంగా నిబంధనలు పాటిస్తూ రక్షణ చర్యలను పటిష్టం చేయాలి. అయితే ఎస్ ఆర్ పి-3 గనిలో ఈ రెండు పరీక్షలు చేపట్టారు లేదా అన్నది అధికారికంగా తేలడం లేదు. రిపోర్ట్స్ పట్టించుకోకుండానే రోజువారి పనుల్లో భాగంగా విధులకు ఉపక్రమించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. దీనికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లోపించిందని జాతీయ కార్మిక సంఘాల నాయకులు విశ్లేషిస్తున్నారు.

భారీ మందంలో బండ కూలడంతోనే…
ప్రమాదం సంభవించిన పనిలో ప్రస్తుతం ఆరు ఫీట్ల వరకు రూఫ్ బోల్టు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం సమయంలో మాత్రం భారీ స్థాయిలో… భారీ మందంతో కూడిన బండ కూలినట్లు నాయకులు చెబుతున్నారు. 10 మీటర్ల పొడవు, మూడు మీటర్ల మందంతో కూడిన బండ వల్లే ఈ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడవుతోంది. ఆరు ఫీట్ల సామర్థ్యం గల రూపు బోల్టు ఉన్నందున పైకప్పును నిలువరించ లేకపోయిందని తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల కాలంలో రక్షణ పరికరాలు సైతం సక్రమంగా సరఫరా కావడం లేదని కార్మికులు చెబుతున్నారు. కరోనా సమయం నుండి తుంటలు గాని ఇతర రక్షణ పరికరాలు గాని సకాలంలో సరఫరా కావడం లేదని దీనివల్ల రక్షణ చర్యలు చేపట్టడానికి పలు ఆటంకాలు అనివార్యంగానే ఏర్పడుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి రక్షణ చర్యలు చేష్టలుడిగి పోవడంతోనే ఎస్ ఆర్ పి-3లో ఇంతటి స్థాయిలో ఉపద్రవము ముంచుకొచ్చిందన్న విమర్శలు తారాస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులోనైనా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు పాటించి గనుల్లో రక్షణ చర్యలను పటిష్టం చేయాలని కార్మిక వర్గం కోరుతోంది

 

also read:- విరాట్ కోహ్లి కుమార్తేను చంపేస్తామని బెదిరింపులు– బెదిరించిన సంగారెడ్డికి చెందిన యువకుడు.