ప్లాస్టిక్ భూతాన్ని….తరిమేద్దాం….!
మానవాళి మనుగడకు ముప్పు... జిల్లాలో అమలుకాని నిషేధం... దొంగచాటుగా అమ్మకాలు.... పూర్తి స్థాయిలో దృష్టిసారించని అధికారులు..
ప్లాస్టిక్ భూతాన్ని….తరిమేద్దాం….!
మానవాళి మనుగడకు ముప్పు…
జిల్లాలో అమలుకాని నిషేధం…
దొంగచాటుగా అమ్మకాలు….
పూర్తి స్థాయిలో దృష్టిసారించని అధికారులు..
మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్ ప్రమాదకరంగా మారుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా వినియోగం మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ కవర్లు భారీగా దిగుమతి అవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. జిల్లాలో నానాటికీ పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై విజయం దిన పత్రిక ప్రత్యేక కథనం..
( పెద్దపల్లి – విజయం న్యూస్):
జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ నిషేధం అమలుకావడంలేదు.ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల లో,వివిధ గ్రామ పంచాయితీ ల ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ అమ్మకాలను అరికట్టినప్పటికీ కొన్నిచోట్ల దొంగచాటుగా విక్రయాలు సాగుతున్నాయి. రోడ్లపై చెత్త కనపడకుండా చేయడంలో చూపుతున్న శ్రద్ధ ప్లాస్టిక్ వినియోగాన్ని పాలకవర్గం అరికట్టడంలో చూపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అన్ని మార్కెట్లు, షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఉంటోంది. 40 మైక్రాన్ల కన్నా అధిక మందం కలిగిన వివిధ రకాల ప్లాస్టిక్ కవర్లను వినియోగించేందుకు అవకాశం ఉన్నా వాటి వినియోగం పెరిగే కొద్దీ అనర్థానికి దారితీస్తోంది. ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవాలంటే కనీసంగా వెయ్యి సంవత్స రాలు పడుతుందనేది శాస్త్రవేత్తల అంచనా.పట్టణంలోని కిరాణ దుకాణాలు, కూర గాయల మార్కెట్లు, బిర్యానీ హౌస్‌లు, కర్రీ పాయింట్లలో వీటి వినియోగం ఎక్కు వగా ఉంటోంది. ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చే ఆహార పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరగడం వల్ల వాటిని భుజించేవారికి పలు వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచుల వినియోగం పెంచాల్సిన అవసరముంది. తొలిదశలో క్లాత్ బ్యాగులు చాలా షాపుల్లో దర్శనమిచ్చాయి.కానీ ప్లాస్టిక్ వాడకానికి అలవాటుపడినవారు వాటిని పట్టించు కోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రహదారుల పక్కన, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగులబెట్టడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పాడైపోయిన కంప్యూటర్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలను నిక్షిప్తం చేసేందుకు కూడా సరైన ప్రణాళిక అవసరం. డంపింగ్ యార్డులు లేకపోవడంతో చాలాచోట్ల వీటిని పట్టించుకోవడంలేదు. చిత్తశుద్ధితో దష్టిసారిస్తే మున్సిపాలిటీలలో,గ్రామ పంచాయితీ లలో వీటిని అరి కట్టడం సాధ్యమే.
also read :- రోడ్డు ప్రమాదంలో పసికందు సహా ఐదుగురు దుర్మరణం
కుప్పలుతెప్పలుగా వ్యర్థాలు
నిత్యం రోడ్లపై చెత్తను ఏరుకుని జీవించేవారెందరో అభాగ్యులు, వీటిని కొనుగోలు చేసే దుకాణ యజమానులూ ఉన్నారు.ఒక్కో చెత్త కొనుగోలు కేంద్రం వద్ద నిత్యం కుప్పలుతెప్పలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా వారానికి టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలను ఎగుమతి చేస్తున్నారు. రోడ్లపై వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం ద్వారానే పలు పశువుల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయని కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోవడంలేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు జీవ కోటికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తి, వినియోగం రెండూ అధికంగానే జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను వినియోగించని గృహమే కనిపించదు. వినియోగం జీవరాశులకే కాదు యావత్ ప్రపంచానికే ముప్పుపొంచి ఉందని పలువురు శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ సంచులు నిషేధించి జంతువుల పట్ల కారుణ్యం చూపాలని దేశసర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభు త్వాలను నేరుగా ఆదేశించింది. పల్లెల్లో పేరుకుపోయిన టన్నుల కొద్ది ప్లాస్టిక్ అసాంఖ్యాక మూగజీవుల ఉసురు తీస్తున్నాయి. కొంతమంది ప్లాస్టిక్ వ్యర్థా లను తరలించలేక తగలపెడుతుంటే వెలువడే విష వాయువులు సైతం ప్రాణాం తకంగా మారుతున్నాయి. 40 మైక్రాన్నలోపు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఐదేండ్ల కిందట నిషేధించింది. అంతే కాకుండా పాలిథిన్ సంచుల ఉత్పత్తి, వినియోగాలపై ఆంక్షలు, అమలు బాధ్యతలను సంబంధిత కలెక్టర్‌కు, స్థానిక సంస్థల ప్రతినిధులకు కట్టబెడుతూ ఆదేశాలు జారీచేశారు. అప్పట్లో మొక్కుబడిగా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత నిషేధిత ప్లాస్టిక్ సంచులపై పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. భూమిపై ఏదైనా నశించి పోవాల్సిందే అంటారు కొందరు. ప్రపంచానికి పెను భూతంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను గౌరవించి అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది.ఈ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టిసారించి పూర్తిస్థాయిలో నిషేధించాల్సిన అవసరం ఉంది.
also read :- ప్రభుత్వ భూములును అక్రమిస్తే ఉక్కుపాదం : మంత్రి పువ్వాడ
పేరుకే ప్లాస్టిక్ నిషేధం
ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్లాస్టిక్ కవర్లను ప్రభుత్వం నిషేధించినా అమలు మాత్రం చేయడంలేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఎటు చూసినా ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి.పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు దేన్నయినా ప్లాస్లిక్ కవర్లలోనే ఇస్తున్నారు. వినియోగదారులు కూడా ఇండ్ల నుంచి సంచులు తెచ్చుకోవడమే మరిచారు. రోడ్లు, మురుగుకాల్వలు, ఇండ్లముందు, సినిమా హాళ్లు ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే కన్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్లు 40 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న వాటిని నిషేధించింది.అంతకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలిసి నీరు, భూమి పొర విషతుల్యం అవుతాయి.
అవగాహనరాహిత్యమే అసలు కారణం
ప్లాస్టిక్ కవర్ల వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలడంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే 40 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ సంచులను వాడరాదని ఆదేశాలున్నా వినియోగదారులకు షాపుల యజమానులు విక్రయిస్తున్నారు. ఇది తెలియని వినియోగదారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పాన్ మొదలుకుని కూర గాయల వరకు పాలిథిన్ కవర్లు వినియోగిస్తుండడతో వాటిని వినియోగించి పడేసిన తర్వాత అవిపొలాల్లో, మురుగుకాల్వల్లో అడ్డుగా నిలిచి నీటిని భూమిలోకి ఇంకి పోకుండా చేస్తున్నాయి. దీనివల్ల భూగర్భజలాలు ఇంకకపోవడం, వరదనీటి ఉధతికి పొలంగట్లు కోసుకుపోయి సారవంతమైన మట్టి బయటకు వెళ్లడం వంటివి జరుగు తున్నాయి. అలాగే ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల వాటి రసాయనాలు తినే పదార్థాల ద్వారా శరీరంలోకి చేరి క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. టీ కప్పు నుండి మొదలుకొని భోజనం చేసే ఇస్తారి వరకు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే వాడుతున్నారు. ఒకప్పుడు పల్లెల్లో విస్తరాకులను ఆకులతో కుట్టేవారు. ఇప్పుడు రెడీమెడ్ ప్లాస్టిక్‌వే వాడుతున్నారు. ఇలా ప్రజలు అధికసంఖ్యలో ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల వాతావరణం కలుషితమవుతోంది. భూతాపం పెరిగి అనర్థాలకు దారితీసే అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ సమయంలో పట్టణంతో పాటు నియోజకవర్గంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణ చేయాలని ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
also read :- గ్రంథాలయాలే… ఆధునిక దేవాలయాలు!