Telugu News

దోపిడీదారి బీ జేపీ సర్కారు ను సాగనంపుదాం: నారాయణ, పొంగులేటి

కాంగ్రెస్ అభ్యర్ధి విజయానికి అంతా కృషి చేస్తాం

0

దోపిడీదారి బీ జేపీ సర్కారు ను సాగనంపుదాం: నారాయణ

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
– కాంగ్రెస్ అభ్యర్ధి విజయానికి అంతా కృషి చేస్తాం
– పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం లో వెల్లడి

(ఖమ్మం-విజయం న్యూస్):

ప్రజా ధనాన్ని దోచుకుంటున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈసారి సాగనంపుదామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో సీపీఐ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డితో కలిసి మాట్లాడారు. లండన్ కోర్టులో అదానీ తాను దోచుకున్న దాంట్లో 70 శాతం ప్రధానికే ఇచ్చానని తాజాగా తన విచారణలో వెల్లడించాడని అన్నారు. దీన్నిబట్టి కేంద్ర దోపిడీ విధానం తేట తెల్లం అయిందని విమర్శించారు. రకరకాల పన్నులు, జీఎస్టీ విధానంతో సామాన్యులు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారని తెలిపారు. మధ్యతరగతి వాడు కనీసం చెప్పులు వేసుకోలేని పరిస్థితి నెలకొందని.. తన కాలి చెప్పు తీసి చూయిస్తూ దీనిపై ఎన్ని రకాల పన్నులు వేశారు అని వివరించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. పాలన సాగిస్తున్నారని, ఇది అన్ని వర్గాలకు ప్రమాదకరమని చెప్పారు. ఇండియా కూటమి విజయంలో భాగంగా.. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు తమ పార్టీ శ్రేణులంతా శ్రమిస్తాయని ప్రకటించారు.
*మంత్రులు తుమ్మల, పొంగులేటి మాట్లాడుతూ..:* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశ బీఆర్ఎస్, కేంద్రంలో మతతత్వ బీజేపీలను ఓడించడమే లక్ష్యమన్నారు. అంతా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*ఈ కార్యక్రమంలో ..* కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నాయకులు మహమ్మద్ మౌలానా, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల, గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.